బోయపాటి మంచి దర్శకుడు కాదు, మంచి యాక్షన్ కొరియోగ్రాఫర్

‘ఇస్మార్ట్ శంకర్’ స్టార్ రామ్ పోతినేని అలియాస్ రాపో, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఎంతో విలువైనదిగా భావించుకుని నిర్మించిన ‘స్కంద- ది ఎటాకర్’ గతవారం విడుదలైన విషయం తెలిసిందే.

Advertisement
Update:2023-10-04 15:03 IST

‘ఇస్మార్ట్ శంకర్’ స్టార్ రామ్ పోతినేని అలియాస్ రాపో, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఎంతో విలువైనదిగా భావించుకుని నిర్మించిన ‘స్కంద- ది ఎటాకర్’ గతవారం విడుదలైన విషయం తెలిసిందే. విడుదలకి ముందు రాపో సినిమాలో తన పాత్రగురించి ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్పాడు. ‘బోయపాటి గారు నాకు ఈ పాత్ర చేసే ముందు నా సినిమాలన్నీ చూశారు. నేను గతంలో ఏ పాత్ర పోషించినా దాన్ని వందతో గుణిస్తే వచ్చే పాత్ర ‘స్కంద’ లో నా రుద్రకంటి భాస్కర్‌ పాత్ర’ అని గొప్పగా విశ్లేషించాడు.

‘భాస్కర్ లో ఒక హీరో, యాంటీహీరో ఇద్దరూ ఎంతో ప్రేమతో, విధేయతతో కన్పిస్తారు. కానీ అవసరమైనప్పుడు అంతులేని హింసకి పాల్పడడానికి కూడా వెనుకాడడు. కుటుంబం పట్ల విశ్వాసంతో, న్యాయం చేయాలన్న పట్టుదలతో వుంటాడు. తన వారిని రక్షించడానికి అతను ఏమైనా చేస్తాడు’ అని వివరించాడు. 'ఇక నేనెలా పోరాడాలో దర్శకుడు ఒక్క మాటలో చెప్పారు- నేను విసిరే ప్రతి పంచ్ బుల్‌డోజర్‌ బంప్ లా వుండాలన్నారు. దీన్ని నమ్మకంగా సాధించేందుకు అవసరమైన దారుఢ్యం కోసం 12 కిలోల బరువు పెరిగాను’ అని వివరించాడు.

‘స్కంద తిరిగి మిమ్మల్ని మీ మూలాల్లోకి తీసికెళ్ళే కథ. కథే ఈ సినిమా యూఎస్పీ (యూనిక్ సెల్లింగ్ పాయింట్). ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో చూడాలని చాలా ఎగ్జయిట్‌గా వున్నాను’ అని ఆతృత వ్యక్తం చేశాడు.

ప్రేక్షకులు వెంటనే యూనిక్ ఫెయిలింగ్ పాయింట్ గా తేల్చేశారు. రాపో విసిరిన ఒక్కో పంచ్ తమ మీద ఎటాక్ గానే ఇబ్బందిపడ్డారు. సీఎం ఇంటికి హెలికాప్టర్ మీద వచ్చి పెళ్ళి కూతుర్ని కిడ్నాప్ చేసుకుపోతూంటే తమ కామన్ సెన్సుని హైజాక్ చేసినట్టే ఫీలయ్యారు. హీరోగా, యాంటీ హీరోగా రాపో మండించిన 12 కిలోలు ఎక్స్ ట్రా హింసకి యూఎస్పీ కథ నుంచి విముక్తి కోరుకుని ఇంటి బాట పట్టారు.

వరుసగా నాలుగు రోజుల సెలవుల సదవకాశాన్ని క్యాష్ చేసుకోలేక నిన్న మంగళవారం తో పూర్తిగా బయ్యర్లని ఇరకాటంలో పెట్టేసింది. మంగళవారం వరకు తెలుగు కలెక్షన్స్ 33.7 కోట్లు. ఓవర్సీస్ 4 కోట్లు, తమిళం 15 లక్షలు, హిందీ 25 లక్షలు (మలయాళం, కన్నడ అంకెలు అందుబాటులోకి రాలేదు). మొత్తం కలిపి 39.1 కోట్లు. బడ్జెట్ 70 కోట్లు, పబ్లిసిటీ 10 కోట్లు. మొత్తం 80 కోట్లు. లోటు సుమారు 40 కోట్లు.

అంటే నాణ్యత లేని కంటెంట్ తో స్టార్ సినిమాలు తీస్తే 40 కోట్ల బడ్జెట్ కి పరిమితం చేయాలన్న మాట. ఫ్లాపవడం ఖాయం కాబట్టి ‘స్కంద’ లాగా 40 కోట్ల కలెక్షన్స్ తో నష్టముండదు. హిట్టయితే తగ్గించుకున్న పారితోషికాల్ని లాభాల్లో చూసుకోవచ్చు. ‘స్కంద’ ని చూస్తే చిరంజీవి ‘భోళా శంకర్’ గుర్తుకొస్తుంది. ఎప్పటి కథలివి, ఏనాటి సినిమాలు. బోయపాటి ఈ అరిగిపోయిన మూస కథల్లోంచి బయటికి రాలేడు. ఈ కథలకి కొత్త కొత్త ఐడియాలతో వయొలెంట్ యాక్షన్ సీన్లు తీస్తాడు.

బోయపాటి మంచి యాక్షన్ కొరియోగ్రాఫర్, అంతేగానీ మూవీ మేకర్ కాదు. ఇలాటి కాలం చెల్లిన కథలతో భారీ హింసాత్మక యాక్షన్ తో బాలకృష్ణ తో తీసిన సినిమాలే హిట్టయ్యాయి. ఎన్టీఆర్ తో ‘దమ్ము’, రామ్ చరణ్ తో ‘వినయ విధేయ రామ’, ఇప్పుడు రాపోతో ‘స్కంద’ ప్రయోగాలే అయ్యాయి. ప్రేక్షకుల్ని తక్కువ అంచనా వేసి కామన్ సెన్సు, లాజిక్ అనేవి లేకుండా తీస్తే ముగ్గురు యంగ్ స్టార్లూ దెబ్బతినిపోయారు.

బోయపాటి తమిళ స్టార్ సూర్యతో ఇక కొత్త మూవీ ప్రారంభించాలి. ‘స్కంద’ చూసి సూర్య వెనక్కి తగ్గుతున్నట్టు తెలుస్తోంది. తమిళంలో కూడా ఇదే తన మార్కు తెలుగు పాత మూస తీస్తే తమిళ ప్రేక్షకులు ఒప్పుకునే పరిస్థితుల్లేవు. అక్కడ స్టార్లతో ‘విక్రమ్’, ‘జైలర్’, ‘లియో’ ‘మావీరన్’ లాంటి మూస వ్యతిరేక సినిమాలు తీస్తున్న నెల్సన్ దిలీప్ కుమార్, లోకేష్ కనకరాజ్, మడోన్ అశ్విన్ లాంటి కొత్త తరం దర్శకులు మలుపు తిప్పుతున్నారు తమిళ స్టార్ సినిమాల్ని. 

Tags:    
Advertisement

Similar News