ఆలిండియా టాప్ త్రీలో జైలర్!

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ‘జైలర్’ మేనియా పట్టి వూపేస్తోంది తెలుగు రాష్ట్రాలు సహా. ఆగస్టు 10 న విడుదలైన సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా బ్లాక్ బస్టర్ ‘జైలర్’ నిన్న సోమవారం కలుపుకుని అయిదు రోజులకి ప్రపంచవ్యాప్తంగా 340.90 కోట్లు గ్రాస్ వసూలు చేసి అదరగొట్టింది.

Advertisement
Update:2023-08-15 19:18 IST

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ‘జైలర్’ మేనియా పట్టి వూపేస్తోంది తెలుగు రాష్ట్రాలు సహా. ఆగస్టు 10 న విడుదలైన సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా బ్లాక్ బస్టర్ ‘జైలర్’ నిన్న సోమవారం కలుపుకుని అయిదు రోజులకి ప్రపంచవ్యాప్తంగా 340.90 కోట్లు గ్రాస్ వసూలు చేసి అదరగొట్టింది. ఇంత పెద్ద హిట్టవుతుందని ఎవరూ వూహించలేదు. పానిండియా సినిమాలుగా వచ్చిన కొన్ని తమిళ సినిమాలు తెలుగు పానిండియాల కంటే వెనుక బడ్డ దృశ్యాన్ని చూశాం. అలాంటిది అనూహ్యంగా రజనీ పానిండియా ‘జైలర్’ వచ్చేసి రికార్డులు బద్దలు కొట్టడం ట్రేడ్ విశ్లేషకుల్ని సైతం విస్మయ పరుస్తోంది.

జైలర్ 5 రోజుల గ్రాస్ కలెక్షన్స్ రిపోర్టు ఇది : తమిళనాడు - 96.85 కోట్లు, తెలుగు రాష్ట్రాలు- 39.70 కోట్లు, కర్ణాటక- 36.00 కోట్లు, కేరళ - 27.80 కోట్లు, మిగతా దేశం 5.05 కోట్లు, ఓవర్సీస్ -141.50 కోట్లు. మొత్తం 346.90 కోట్లు. ఐదు రోజుల్లో రికార్డు 350 కోట్ల కలెక్షన్స్ తో ముందుకు దూసుకుపోతోంది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా ఏరియాల్లో ప్రీ-బుకింగ్‌ల ద్వారా 2 కోట్ల నుంచి 3 కోట్ల వరకు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ రెస్పాన్స్ చూసి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల సంఖ్య పెంచారు. ఇక బాలీవుడ్ హిట్లు లేక నష్టాల్లో వున్న పీవీఆర్ - ఐనాక్స్ మల్టీప్లెక్స్ గ్రూపుకూడా తొలిరోజు 40 కోట్ల కలెక్షన్లతో వూపిరి పీల్చుకుంది.

గత మూడు పరాజయాలతో బలహీనపడ్డ రజనీకాంత్ ‘జైలర్’ తో తిరిగి సత్తా చాటారు. ఆగస్టు 10న తీవ్ర ఉత్కంఠ రేపుతూ విడుదలైన ‘జైలర్’ రజనీ మునుపటి సినిమాల్లాగా యాక్షన్ ప్యాక్డ్ గానే వుంటుందని అభిమానులు వూహించారు. ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల ముందు క్యూలు కట్టారు. సినిమా చూశాక ఒక గొప్ప అనుభూతికి లోనై బయటపడ్డారు. యాక్షన్ ప్యాక్డే కాదు, అన్ని వర్గాల ప్రేక్షకులూ మెచ్చే కామెడీ- ఫ్యామిలీ డ్రామా- యాక్షన్ థ్రిల్లర్ గా సర్వాంగసుందరంగా వుందని సంతృప్తి చెందారు.

గతంలో రజనీకాంత్ నటించిన ‘కబాలి’, దర్బార్’ లు ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. వీటితో పోల్చితే ‘జైలర్’ కి ఓపెనింగ్స్ భారీగా వచ్చాయి. రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘జైలర్’ మొత్తం వసూళ్ళు బడ్జెట్ ని చాలా మించి పోతాయని భావిస్తున్నారు. అయిదు రోజులకే 350 కోట్ల రికార్డు వసూళ్ళతో లాభాల్లో పడింది.

ఇంకా ‘జైలర్’ రికార్డులు చూస్తే, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్ళు చేసిన తమిళ సినిమాల జాబితాలో 4 వ స్థానానికి చేరుకుంది. అత్యధిక వసూళ్ళు సాధించిన దక్షిణ భారత చలన చిత్రాల్లో 12వ స్థానంలో వుంది. అత్యధిక వసూళ్ళు చేసిన భారతీయ చలన చిత్ర్రాల జాబితాలో 30 వ స్థానాన్ని పొందింది. దేశవ్యాప్తంగా అడ్వాన్సు బుకింగులు 13 కోట్లు, అమెరికాలో అడ్వాన్సు బుకింగులు 6 కోట్లు రాబట్టింది. ఇంకా మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్ 2’ కలెక్షన్స్ ని అధిగమించి 2023లో అత్యధిక వసూళ్ళు సాధించిన మూడవ మూవీగా ‘జైలర్’ నిలిచింది. షారుఖ్ ఖాన్ ‘పఠాన్’, ప్రభాస్ ‘ఆదిపురుష్’ మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి.

200 కోట్ల బడ్జెట్ తో సన్ పిక్చర్స్ నిర్మించిన ‘జైలర్ ‘ లో తన నటనకు గాను రజనీ అందుకున్న పారితోషికం 110 కోట్లు. తమన్నా భాటియా ఛార్ట్ బస్టర్ సాంగ్ తో బాటు, కొన్ని సన్నివేశాల్లో నటించి నందుకు తీసుకున్న పారితోషికం 3 కోట్ల రూపాయలు. రమ్యకృష్ణ 80 లక్షలు. మూడు సీన్లలో నటించిన మలయాళ స్టార్ మోహన్ లాల్ 8 కోట్లు, మూడు సీన్లలో నటించిన కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్‌ 4 కోట్లు, రెండు సీన్లు నటించిన జాకీ ష్రాఫ్‌లు 4 కోట్లు అందుకోగా, కామెడీ ఎపిసోడ్ నటించిన తెలుగు కమెడియన్ సునీల్ 60లక్షలు, రజనీతో కామెడీ సీన్లు నటించిన యోగిబాబు 1 కోటి, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ 10 కోట్లు పొందినట్టు సమాచారమందుతోంది.

అయితే ఇంతటి ‘జైలర్’ ఘనవిజయానికి తను కూడా కారకుడైన, విలన్ గా నటించిన, మలయాళ నటుడు వినాయకన్ కి మాత్రం 35 లక్షలే ముట్ట జెప్పడం కొసమెరుపు!

Tags:    
Advertisement

Similar News