Rajamouli-Cameron: అవతార్ దర్శకుడితో ఆర్ఆర్ఆర్ దర్శకుడు
James Cameron Appreciates Rajamouli - ప్రపంచం మెచ్చిన దర్శకుడు జేమ్స్ కామెరూన్, భారత్ మెచ్చిన దర్శకుడు రాజమౌళితో మాట్లాడాడు. ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రత్యేకంగా కొనియాడాడు.
యావత్ ప్రపంచం మెచ్చిన దర్శకుడు అతడు. ఇండియా మెచ్చిన దర్శకధీరుడు ఇతడు. ఇలాంటి ఇద్దరు డైరక్టర్లు కలిశారు. వాళ్లే జేమ్స్ కామెరూన్, రాజమౌళి.
కామరూన్ గురించి పరిచయం అనవసరం. టైటానిక్ నుంచి నిన్నటి అవతార్-2 వరకు విజువల్ వండర్స్ క్రియేట్ చేసిన వ్యక్తి అతడు. ఇక రాజమౌళి గురించి కూడా పరిచయం అనవసరం. బాహుబలితో టాలీవుడ్ ను పాన్ ఇండియా స్థాయికి చేర్చి, ఆర్ఆర్ఆర్ తో అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు.
ఇప్పుడీ ఇద్దరు దర్శకులు కలిశారు. కొద్దిసేపు మాట్లాడుకున్నారు. కామరూన్ ను కలవడంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు రాజమౌళి. అతడ్ని పొగడ్తలతో ముంచెత్తే ప్రయత్నం చేశాడు. అయితే అంతలోనే అడ్డుకున్నాడు జేమ్స్ కామరూన్. ఎవరూ ఊహించని విధంగా రాజమౌళిని, పొగడ్తల వర్షంలో తడిపేశాడు.
రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ సినిమాను ఆకాశానికెత్తేశాడు కామరూన్. నీరు-నిప్పు కాన్సెప్ట్ అద్భుతంగా ఉందని మెచ్చుకున్న ఈ దర్శకదిగ్గజం, సినిమాలో కొన్ని సన్నివేశాలకు తను లేచి నిల్చున్నానని అన్నాడు. నిజమైన ఇండియన్ సినిమాను తీశారని రాజమౌళిని మెచ్చుకున్న కామరూన్, పక్కనే ఉన్న కీరవాణి వర్క్ ను కూడా ప్రత్యేకంగా కొనియాడాడు.
కామరూన్ ప్రశంసలతో రాజమౌళి ఉబ్బితబ్బిబ్బయ్యాడు. తనకు ఇంతకంటే పెద్ద అవార్డ్ అక్కర్లేదన్నాడు. ఇదంతా ఒకెత్తయితే, రాజమౌళికి బంపరాఫర్ ఇచ్చాడు కామరూన్. హాలీవుడ్ సినిమా తీసే ఉద్దేశం ఉంటే తనకు చెప్పాలని, ఇద్దరూ కలిసి కూర్చొని చర్చించుకుందామని అన్నాడు. ఓ డైరక్టర్ కు ఇంతకంటే ఇంకేం కావాలి.