దక్షిణ రాష్ట్రాల్లో కూడా పాస్ పోర్ట్ 2.0 తో 10 సినిమాల ఆఫర్!
పీవీఆర్ పాస్‌పోర్ట్ 2.0 కోసం ప్రీ-రిజిస్టర్ చేసుకున్న ప్రేక్షకులు- సౌత్ ఇండియా ప్రేక్షకులు సహా - సరసమైన ధరలో సినిమాల శ్రేణికి ముందస్తు యాక్సెస్ ని పొందగలుగుతారు.
మల్టీప్లెక్సులకి ఎక్కువ మంది ప్రేక్షకుల్ని ఆకర్షించే ప్రయత్నంలో, పీవీఆర్ సినిమాస్ సబ్‌స్క్రిప్షన్ ఆధారిత సినిమా వీక్షణ సేవ ‘పీవీఆర్ పాస్ పోర్ట్ 2.0’ ని త్వరలో లాంచ్ చేయబోతోంది. ఈ సేవ కోసం ప్రారంభించిన యాప్‌లలో, వెబ్‌సైట్‌లలో ముందస్తు రిజిస్ట్రేషన్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయని కంపెనీ సీనియర్ అధికారి తెలిపారు. ముందస్తు రిజిస్ట్రేషన్లు అద్భుతంగా జరుగుతున్నాయని వెల్లడించారు. పీవీఆర్ పాస్‌పోర్ట్ 2.0 కోసం ప్రీ-రిజిస్టర్ చేసుకున్న ప్రేక్షకులు- సౌత్ ఇండియా ప్రేక్షకులు సహా - సరసమైన ధరలో సినిమాల శ్రేణికి ముందస్తు యాక్సెస్ ని పొందగలుగుతారు.
ఈ పాస్‌పోర్ట్ అనేది మెట్రో పాస్‌తో సమానం. దీని ప్రకారం ప్రేక్షకులు సినిమా కోసం వెళ్ళే ప్రతిసారీ సినిమా టిక్కెట్ల ధర గురించి ఇబ్బంది పడాల్సిన అవసరముండదు. గత సంవత్సరం అక్టోబరులో, పాస్‌పోర్ట్ 1.0 గా సబ్‌స్క్రిప్షన్-ఆధారిత వోచర్ సేవని కంపెనీ విడుదల చేసింది. ఇందులో ప్రేక్షకులు నామమాత్రపు వన్-టైమ్ రుసుము రూ. 699 లతో 10 సినిమాల్ని చూసే అవకాశం కల్పించింది. పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ సేవలో 20,000 సబ్‌స్క్రిప్షన్‌లని మాత్రమే అందించింది. ఈ సేవ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి శాంపిల్ సర్వేలాగా చేపట్టి, ప్రేక్షకులు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ని పరిగణనలోకి తీసుకుని చాలా మార్పులు చేసి పీవీఆర్ పాస్ పోర్టు 2.0 ని లాన్ చేస్తోంది.
అయితే పాస్‌పోర్ట్ 2.0, సబ్‌స్క్రిప్షన్‌ల పరంగా చాలా భారీగా వుండే అవకాశముంది. పాస్‌పోర్ట్ 2.0 సబ్‌స్క్రిప్షన్‌ల సంఖ్య పాస్‌పోర్ట్ 1.0 కంటే 4 నుంచి 5 రెట్లు పెద్దదిగా వుండొచ్చు. మునుపటి పైలట్ ప్రాజెక్టులా గాకుండా ఇది దక్షిణ రాష్ట్రాలన్నిటా చెల్లుబాటు అవుతుంది. దక్షిణ రాష్ట్రాల్లో చెల్లుబాటు కారణంగా , ప్రీ-రిజిస్ట్రేషన్ల సంఖ్య ఇప్పటికే కేటాయించాలని నిర్ణయించిన పాస్ పోర్టుల సంఖ్యని మించిపోయింది.
ఆన్‌లైన్‌లో ఎలా కొనుగోలు చేయాలి?
1: అధికారిక పీవీఆర్- ఐనాక్స్ వెబ్‌సైట్ లోకెళ్ళాలి
2: దిగువన 'ప్రివిలేజ్' బటన్‌పై క్లిక్ చేయాలి లేదా హోమ్‌పేజీ బ్యానర్ ద్వారా యాక్సెస్ చేయాలి.
3: 'జాయిన్ నౌ’ పై క్లిక్ చేయాలి
4: అవసరమైన వివరాల్ని నమోదు చేయాలి. కార్డులు, వాలెట్‌లు లేదా యూపీఐ ద్వారా ఆన్‌లైన్ చెల్లింపు చేయాలి
5: చెల్లింపు విజయవంతం అయిన తర్వాత నిర్ధారణ సందేశం వస్తుంది
అయితే పాస్ పోర్ట్ 2.0లో ఐమాక్స్, గోల్డ్, లక్స్, డైరెక్టర్స్ కట్ వంటి ప్రీమియం సేవలు అందుబాటులో వుండవు. ‘టైమ్ రిచ్, మనీ పూర్’ తరగతి ప్రేక్షకుల్ని దృష్టిలో వుంచుకుని ఈ ఆఫర్ ని అందిస్తున్నా, అన్నివర్గాల ప్రేక్షకులూ దీన్ని పొందవచ్చు.