Kerala Theatre Strike: ఓటీటీలపై వార్ - కేరళ థియేటర్ల బంద్!

Kerala Theatre Strike: ఓటీటీల్లో సినిమాల్ని ముందుగానే విడుదల చేయడాన్ని నిరసిస్తూ జూన్ 7 -8 తేదీల్లో కేరళ రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్లని మూసివేస్తున్నట్లు ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ (FEUOK) ప్రకటించింది.

Advertisement
Update:2023-06-07 12:31 IST

Kerala Theaters: ఓటీటీలపై వార్ - కేరళ థియేటర్ల బంద్!

ఓటీటీల్లో సినిమాల్ని ముందుగానే విడుదల చేయడాన్ని నిరసిస్తూ జూన్ 7 -8 తేదీల్లో కేరళ రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్లని మూసివేస్తున్నట్లు ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ (FEUOK) ప్రకటించింది. థియేటర్లలో విజయవంతంగా నడుస్తున్న ‘2018’, ‘పచ్చువుమ్ అద్భుత విళక్కుం’ సినిమాల నిర్మాతలు ఓటీటీల్లో గడువుకంటే ముందే ప్రీమియర్ చేయడానికి అంగీకరించడంతో ఎగ్జిబిటర్ల సంఘం ఈ తీవ్ర నిర్ణయం తీసుకుంది.

‘2018’, ‘పచ్చువుమ్ అద్భుత విళక్కుమ్’ సినిమాలు థియేటర్లలో విజయవంతంగా నడుస్తున్నాయనీ, అందుకని ఓటీటీల్లో ముందస్తుగా విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ, జూన్ 7- 8 తేదీల్లో సినిమా హాళ్ళను పూర్తిగా మూసివేసి నిరసన తెలియజేయాలని నిర్ణయించుకున్నట్టు ఎగ్జిబిటర్ల సంఘం ప్రకటించింది. సినిమాల్ని థియేటర్లలో విడుదల చేసిన తర్వాత, నిర్ణీత వ్యవధి గడిచాక మాత్రమే ఓటీటీ విడుదలకి అనుమతించేట్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరింది.

ఓటీటీలో సినిమాల్ని ముందుగానే విడుదల చేయడం వల్ల థియేటర్ల యజమానులు సినిమా హాళ్ళని నడపడానికి ఇబ్బంది పడుతున్నారనీ, ఓటీటీలకి సమాంతరంగా సినిమా హాళ్ళని నడపలేమనీ, దీనికి ఒక పరిష్కారం కనుగొనాలనీ, పైన పేర్కొన్న రెండు సినిమాలు థియేటర్లలో మంచి వసూళ్ళతో ఆడుతూ వుండగానే, ఓటీటీ విడుదల తేదీల్ని ప్రకటించడంతో ప్రేక్షకులు థియేటర్లకి రావడం లేదనీ ఆవేదన వ్యక్తం చేసింది ఎగ్జిబిటర్ల సంఘం.

నిర్మాతలు ఇంకొన్ని రోజులు వేచి వుంటే ‘2018’ కేరళలో రూ. 200 కోట్లు వసూలు చేసిన తొలి మలయాళ సినిమాగా నిలిచిపోయేదనీ, ఇప్పటికే 25 రోజుల్లో రాష్ట్రంలో వసూళ్ళు రూ. 160 కోట్లు దాటాయనీ, రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు రూ. 60 కోట్ల పన్ను సమకూరిందనీ ఎగ్జిబిటర్ల సంఘం వెల్లడించింది. విడుదలైన మొదటి 10 రోజుల్లో రూ. 100 కోట్లు వసూలు చేసిన మొదటి మలయాళ సినిమాగా నిలిచిందనీ పేర్కొంది. .

నిజానికి ఓటీటీల్లో విడుదలలకి సంబంధించి నిర్మాతలతో ఎగ్జిబిటర్ల సంఘం గతంలో ఒక ఒప్పందం కుదుర్చుకుంది కూడా. సినిమాల్ని థియేటర్లలో విడుదల చేసిన 42 రోజుల తర్వాత మాత్రమే ఓటీటీల్లో విడుదల చేయాలనేది ఆ ఒప్పందం. ఈ ఒప్పందాన్ని ‘2018’, ‘పచువుమ్ అత్బుత విళక్కుమ్’ నిర్మాతలు పరిగణనలోకి తీసుకోలేదు.

గతంలో చలనచిత్రాలు థియేటర్లలో విడుదలైన 32 రోజుల తర్వాత ఓటీటీల్లో విడుదల చేయాలని ఒక ఒక నిబంధన వుండేది. అయితే ఈ నిబంధన ఆచరణ సాధ్యం కాదని తేలడంతో పునః పరిశీలించాల్సి వచ్చింది. సవరించిన వ్యవధి 42 రోజులుగా నిర్ణయించారు. ఇకముందు ఎవరైనా నిర్మాత ఈ నిబంధనని ఉల్లంఘిస్తే ఆ నిర్మాత సినిమాల్ని బహిష్కరిస్తామని సంఘం హెచ్చరించింది.

తమ డిమాండ్లని పరిష్కరించాలని 20 రోజుల అల్టిమేటం జారీ చేశామని సంఘం తెలిపింది. 20 రోజుల్లోగా తమ డిమాండ్లని నెరవేర్చకపోతే సినిమా హాళ్ళని పూర్తిగా మూసివేసి నిరవధిక సమ్మెకు దిగుతామని మరో హెచ్చరిక జారీ చేసింది. అయితే సినిమాల్ని డైరెక్ట్-టు-ఓటీటీ విడుదల చేసుకుంటే అభ్యంతరం లేదని తెలిపింది.

నిబంధనల ఉల్లంఘన వినోదపు పన్నుని కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్న పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోకపోవడం పై కూడా సంఘం స్పందించింది. ఇటీవలి వరకు ఈ సమస్య గురించి ప్రభుత్వానికి తెలియదనీ, ప్రభుత్వం ఇప్పుడు సమస్యని గుర్తించిందని భావిస్తున్నామనీ, ఇప్పటికే సంబంధిత మంత్రితో చర్చలు జరిపామనీ, సంబంధిత డేటాతో బాటు, ఇతర నివేదికల్ని మంత్రికి సమర్పించామనీ, ఈ విషయాన్ని పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారనీ సంఘం తెలిపింది.

చెత్త సినిమాలకి నో!

ఓటీటీ విడుదలలతో సమస్య ఇలా వుండగా, కేరళలో థియేటర్లు ఎదుర్కొంటున్న భయంకర సంక్షోభం గురించి వార్తలు గత రెండు నెలలుగా వెలువడుతూనే వున్నాయి. మలయాళం సినిమాల బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్‌ల కారణంగా రాష్ట్రంలోని సినిమా హాళ్ళని కాపాడేందుకు ఎగ్జిబిటర్ల సంఘం గత నెలలోనే అనేక చర్యల్ని వెల్లడించింది. వాటిలో ప్రధానమైనది చెత్త సినిమాల బహిష్కారం.

ఎగ్జిబిటర్లని తీవ్రంగా దెబ్బ తీస్తున్న సమస్య చెత్త సినిమాలు. కేరళలో 1015 సినిమా హాళ్ళున్నాయి. నాణ్యత లేని సినిమాలకి ప్రేక్షకుల్లేక షోలు ఆపేయాల్సిన పరిస్థితి. దీంతో ఇలాటి సినిమాల్ని ప్రదర్శించకుండా వుండాలని ఎగ్జిబిటర్ల సంఘం నిర్ణయం తీసుకుండీ. ఒకవేళ ఎగ్జిబిటర్ల తిరస్కరణకి గురైన సినిమాలని నిర్మాతలు థియేటర్లలో ప్రదర్శించాలని కోరుకున్నట్లయితే, థియేటర్ యజమానులకి స్క్రీనింగ్ ఫీజు చెల్లించేలా నిబంధన విధించేందుకు సిద్ధమయ్యారు.

గత నెల జనరల్ బాడీ మీటింగులో, కొన్ని సినిమాలకు కనీస స్క్రీనింగ్ ఛార్జీని విధించాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే ఇలాటి సినిమాలకి థియేటర్లలో చాలా తక్కువ మంది ప్రేక్షకులుంటారు. కొన్నిసార్లు కేవలం ముగ్గురి నుంచి ఐదుగురు మాత్రమే వుంటారు. దీనివల్ల నిర్వహణ ఖర్చులు, విద్యుత్ ఛార్జీలు కూడా భరించడం కష్టమవుతోంది. ఈ సమస్యని పరిష్కరించడానికి, నాణ్యత లేనివిగా భావించే సినిమాల నిర్మాతల నుంచి స్క్రీనింగ్ ఫీజులు వసూలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మొత్తాన్ని చెల్లించడానికి నిరాకరించే నిర్మాతల సినిమాల్ని ప్రదర్శించకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఈ విధానం సింగిల్ స్క్రీన్ థియేటర్లకి మాత్రమే వర్తిస్తుంది, మల్టీప్లెక్సులకి కాదు.

మలయాళంలో అవసరానికి మించిన సినిమాలు ఉత్పత్తి చేస్తున్నారు. నెలకు పాతిక సినిమాలు విడుదల చేసి ప్రేక్షకుల నెత్తిన వేస్తున్నారు. ఇవన్నీ చెత్త సినిమాలు. ప్రేక్షకులు వీటి వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఒకప్పుడు గుణాత్మక సినిమాలకి పేర్గాంచిన మాలీవుడ్ ఇప్పుడు దేశంలోనే చావకబారు సినిమా పరిశ్రమ మారిపోయింది. ఇంకా చాలా వెనక్కిపోతే, 1970-80 లలో మలయాళ సినిమాలంటే ‘ఏ’ సర్టిఫికేట్ సెక్స్ సినిమాలనే పేరుండేది. సీమా నుంచీ షకీలా వరకూ హీరోయిన్లు శృంగార పాత్రలతో ప్రేక్షకుల్ని రెచ్చగొట్టే వాళ్ళు. ఇవి తెలుగు డబ్బింగులుగా తెలుగునాట కూడా దాడి చేశాయి. దీనికి ఆద్యుడు దర్శకుడు ఐవీ శశి. 100 సినిమాలు తీసిన శశి బూతు సినిమాలే ఎక్కువ తీశాడు. ఆ నిమిషం, అనుభవం, ఆలింగనం, అంగీకారం...అంటూ ఆ చవకబారు సినిమాలే ఇప్పుడు సోకాల్డ్ వాస్తవిక సినిమాలుగా పునరావృతమవుతున్నాయి.

వాస్తవికత అనే పైత్యం ముదిరి ఈ వందల కొద్దీ చెత్త సినిమాలతో నిర్మాతలు, పంపిణీ దార్లు, థియేటర్ల యజమానులు తప్ప- దర్శకులు, నటీనటులు, టెక్నీషియన్లూ అపార ఉపాధి అవకాశాలు పొందుతూ చెట్టపట్టా లేసుకు తిరుగుతున్నారు. ఇది విచిత్ర పరిస్థితి. ఇలా మాలీవుడ్ లో హమాలీలు ఎక్కువైపోయారు. మాలీవుడ్ లో సామర్థ్యానికి మించి మొత్తం ఈ ఏడాది 250 నుంచీ 300 వరకూ సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. ఇలాటి సినిమాలకి ఫైనాన్స్ చేయడాన్ని నిలిపివేయాలని, లేదా డిస్ట్రిబ్యూటర్లు పంపిణీ చేయడం మానుకోవాలనీ, లేదా నటీనటులు ఇలాటి సినిమాల్లో నటించవద్దనీ ఎగ్జిబిటర్ల సంఘం డిమాండ్ చేసే హక్కులేదు. అయితే ఈ సినిమాల్ని ప్రదర్శించడానికి నిరాకరించే హక్కు మాత్రం వుంది.

సినిమాల నాణ్యతని అంచనా వేయడానికి ఎగ్జిబిటర్ల సంఘం పూనుకోవచ్చు. సినిమాల సంభావ్య విజయాన్ని అంచనా వేయడానికి, నాణ్యతని అంచనా వేయడానికీ ఎగ్జిబిటర్లుగా తమకి నైపుణ్యాలున్నాయని చెప్పుకుంటున్నారు. ఈ మూల్యాంకన ప్రక్రియలో పరిగణించే నిపుణులుగా సినిమా దర్శకులు, నటీనటులు, నిర్మాణ సంస్థలు, పంపిణీదారులూ వుండొచ్చు.

ఎగ్జిబిటర్ల సంఘం ఇంకో ఆక్షేపణ ఏమిటంటే, ఈ రోజుల్లో చాలా మలయాళ సినిమాలు ఓటీటీల్ని లక్ష్యంగా చేసుకునే ఏకైక ఉద్దేశ్యంతో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలే థియేటర్లకి నష్టం కలిగిస్తున్నాయి. ఈ సినిమాల్ని చూడడానికి థియేటర్ కొచ్చిన ప్రేక్షకులు తాము మోసపోయామని గ్రహిస్తున్నారు. దీంతో మళ్ళీ థియేటర్లకి రావడానికి సందేహిస్తున్నారు. అందుకని థియేటర్లని రక్షించడానికి ఏకైక మార్గం థియేటర్లని దృష్టిలో వుంచుకుని థియేటర్ సినిమాల్ని నిర్మాతలు నిర్మించడమే. ఇది హాళ్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్యని పెంచుతుంది. ఇలా రూపొందించిన సినిమాలే తమకి అవసరమని ఎగ్జిబిటర్ల సంఘం విన్నవించుకుంటోంది.

Tags:    
Advertisement

Similar News