ఆగస్టులో కేంద్రం ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఓటీటీ?

ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ప్రసార భారతి యాజమాన్యంలో ప్రారంభించనున్న సొంత ‘ఫ్యామిలీ ఫ్రెండ్లీ’ ఓటీటీ నుంచి వీక్షకులు ఏమాశించవచ్చు? ప్రసార భారతి దాని కంటెంట్ ని దేశంలోని పౌరులందరికీ, మారుమూల గ్రామాల నుంచి ప్రపంచ ప్రేక్షకుల వరకూ అందుబాటులో వుండేలా ఓటీటీ సర్వీసుని రూపొందించడం, అభివృద్ధి చేయడం, నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisement
Update:2024-06-25 12:52 IST

ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ప్రసార భారతి యాజమాన్యంలో ప్రారంభించనున్న సొంత ‘ఫ్యామిలీ ఫ్రెండ్లీ’ ఓటీటీ నుంచి వీక్షకులు ఏమాశించవచ్చు? ప్రసార భారతి దాని కంటెంట్ ని దేశంలోని పౌరులందరికీ, మారుమూల గ్రామాల నుంచి ప్రపంచ ప్రేక్షకుల వరకూ అందుబాటులో వుండేలా ఓటీటీ సర్వీసుని రూపొందించడం, అభివృద్ధి చేయడం, నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకుంది. 2023 సెప్టెంబర్ 29 నాటి ముసాయిదా టెండర్ అభ్యర్థనలో, ఓటీటీ సర్వీసు డిజైన్, అభివృద్ధి, అమలు, కార్యకలాపాలు, నిర్వహణ కోసం బిడ్డర్ల నుంచి టెండర్లని ఆహ్వానించింది. వచ్చే ఆగస్టుకల్లా ఓటీటీ సర్వీసుని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో వుంది.

ఇందులో భాగంగా, 4కె రిజల్యూషన్‌లో వినియోగదారుల కోసం యాడ్-సపోర్టెడ్ వీడియో-ఆన్-డిమాండ్ (వీఓడీ) మల్టీ-స్క్రీన్ సౌకర్యాన్ని అందించడం సర్వీసు లక్ష్యం. తద్వారా వినియోగదారులు వారి మొబైల్‌లు లేదా టాబ్లెట్‌లలో ఈ స్ట్రీమింగ్ సర్వీసు కంటెంట్ ని యాక్సెస్ చేయవచ్చు. అంతేకాకుండా షోలు, క్రికెట్ టోర్నమెంట్‌లు సహా ఛానెల్‌లు, ప్యాకేజీలు, కంటెంట్‌ని కొనుగోలు చేసే లా కార్టే ఫీచర్‌ని కూడా పొందవచ్చు. ప్రసార భారతి 10 కోట్ల మంది వినియోగదారుల వరకు సేవలందించే సర్వీసుని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ముసాయిదా టెండర్‌లో ఓటీటీ సర్వీసు కోసం నిర్దిష్ట డిజిటల్ రైట్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ని కోరడం కీలక అంశం. ఈ సర్వీసు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, హాట్‌స్టార్ వంటి ప్రైవేట్ ఓటీటీ లతో పోటీ పడేందుకు సైతం సిద్ధమవుతోంది. ప్రారంభంలో కంటెంట్‌ని ప్రారంభ సంవత్సరం లేదా రెండు సంవత్సరాల వరకు వీక్షకులు ఉచితంగా పొందవచ్చు. దేశ సంస్కృతీ సాంప్రదాయాల్ని కాపాడే లక్ష్యంగా కంటెంట్ వుంటుంది. కుటుంబ వీక్షణకి అనువైన, ఆరోగ్యకరమైన కంటెంట్‌ని అందించాలనే నిబద్ధతని కలిగి వుంటుంది.

ప్రస్తుతం కొన్ని ఓటీటీల్లో కంటెంట్ అసభ్యకర, దూషణాత్మక భాషతో వుంటోందని, ఇది కుటుంబంతో కలిసి చూడడం ఇబ్బందికరంగా వుంటోందనీ, కనుక మర్యాదపూర్వక, మన దేశపు సంస్కృతి-జాతీయవాద విలువల్ని ప్రతిబింబించే కంటెంట్ ని అందిస్తామనీ ప్రసార భారతి అధికారి ఒకరు తెలిపారు. ఒటీటీల వినోదం చాలా కలుషితమైందని, స్వచ్ఛమైన వినోదాన్ని అందించడం, సామాజిక - జాతీయ విలువల్ని ప్రోత్సహించడంపై తమ దృష్టి వుంటుందనీ చెప్పారు. ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్‌తో పాటు, కరెంట్ అఫైర్స్ ప్రోగ్రాములు కూడా కవర్ చేస్తామన్నారు.

వీక్షకులకు అందించే సదుపాయాలు :

ప్రారంభంలో ఉచిత యాక్సెస్: వీక్షకుల్ని ఆకర్షించడానికి మొదటి ఒకటి లేదా రెండు సంవత్సరాల పాటు ఉచిత కంటెంట్‌ని అందిస్తారు. ఆ తర్వాత ఛార్జీలు నిర్ణయిస్తారు.

కుటుంబ ఆధారిత కంటెంట్: కుటుంబాలు కలిసి చూడడానికి అనువైన ‘క్లీన్’ వినోదాన్ని అందిస్తారు.

జాతీయ విలువల్ని ప్రోత్సహించడం: కంటెంట్ వినోదాన్ని మాత్రమే కాకుండా సామాజిక- జాతీయ విలువల్ని కూడా ప్రోత్సహించేలా రూపొందిస్తారు.

కరెంట్ అఫైర్స్ కవరేజ్: కరెంట్ అఫైర్స్ కి సంబంధించిన కంటెంట్‌ ని అందిస్తారు.

కంటెంట్ సృష్టికర్తలతో సహకారం: కంటెంట్‌ని అభివృద్ధి చేయడానికి విపుల్ షా, కబీర్ బేడీ వంటి ప్రముఖ కంటెంట్ సృష్టికర్తలతో భాగస్వామ్యాన్ని కలిగి వున్నారు.

ప్రసార భారతి ఒటీటీ సర్వీసు ప్రారంభం స్ట్రీమింగ్ రంగంలో విశేష మార్పుని తెస్తుంది. ఫ్యామిలీ ఫ్రెండ్లీ కంటెంట్ తో, జాతీయ విలువలపై దృష్టితో ప్రత్యామ్నాయాన్ని అందించేలా ఇది వుంటుంది.

దేశంలో దాదాపు 78 ఓటీటీ సర్వీసులు ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిలో పడేందుకు పోటీ పడుతూండడంతో, ప్రసార భారతి ఈ రద్దీ మార్కెట్‌లో నిలదొక్కుకోవడానికి ఒక ముఖ్యమైన అవరోధాన్ని ఎదుర్కోక తప్పదనే వాస్తవాన్ని కూడా గుర్తించింది. మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో వున్న దాదాపు 78 ఓటీటీ సర్వీసులతో అయోమయాన్ని తగ్గించడం ప్రసారభారతి ముందున్న ముఖ్య సవాలు. దీన్ని ఎదుర్కోవాలంటే తేడా గల కంటెంట్ ని అందించడమొక్కటే మార్గమని భావిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News