అభిమానుల కోసం ఇకపై ఏడాదికి రెండు సినిమాలు.. - `ఆదిపురుష్` ప్రీరిలీజ్ వేడుకలో ప్రభాస్
ఆయన మాట్లాడుతుండగా.. అభిమానులు `పెళ్లెప్పుడు..` అంటూ ప్రశ్నించగా.. ఎప్పుడైనా ఇక్కడే తిరుపతిలోనే చేసుకుంటానని నవ్వుతూ సమాధానమిచ్చారు.
ఇకపై అభిమానుల కోసం ఏడాదికి రెండు సినిమాలు చేస్తానని హీరో ప్రభాస్ అన్నారు. కుదిరితే మూడు కూడా రావొచ్చని ఆయన చెప్పారు. వేదికలపై తక్కువ మాట్లాడి ఎక్కువ సినిమాలు చేస్తానని చెప్పి అభిమానుల్లో ఉత్సాహం నింపారు. ప్రభాస్ తాజాగా నటించిన `ఆదిపురుష్` చిత్రం జూన్ 16న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ చిత్ర ప్రీరిలీజ్ వేడుక తిరుపతిలో మంగళవారం నిర్వహించారు. ఈ వేడుకకు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చినజీయర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరవడం విశేషం.
చిరంజీవి అభినందించారు..
ఈ వేడుకలో ప్రభాస్ మాట్లాడుతూ `ఆదిపురుష్` లాంటి చిత్రం చేయడం తన అదృష్టమని చెప్పారు. ఒక సందర్భంలో చిరంజీవిని కలవగా, ఏంటి రామాయణం చేస్తున్నావా అని అడిగారని, అవునండీ.. అంటూ తాను సమాధానం చెప్పగా.. అందరికీ ఇలాంటి అదృష్టం దొరకదు.. నీకు దక్కింది.. అంటూ అభినందించారని వివరించారు.
పెళ్లి పైనా స్పందన..
ఇదే ఈవెంట్‌లో తన పెళ్లిపైనా ప్రభాస్ స్పందించారు. ఆయన మాట్లాడుతుండగా.. అభిమానులు `పెళ్లెప్పుడు..` అంటూ ప్రశ్నించగా.. ఎప్పుడైనా ఇక్కడే తిరుపతిలోనే చేసుకుంటానని నవ్వుతూ సమాధానమిచ్చారు. సినిమా ఫంక్షన్లకు హాజరుకాని చినజీయర్ స్వామివారు వచ్చి తమ చిత్ర బృందాన్ని ఆశీర్వదించారని, ఇది చాలా సంతోషంగా ఉందని ప్రభాస్ చెప్పారు.
అభిమానులే నా బలం..
ఎప్పటికీ ప్రేక్షకులు, అభిమానులే తన బలమని ప్రభాస్ చెప్పారు. మీరిచ్చిన ప్రోత్సాహంతోనే సినిమా పూర్తి చేసి ఇప్పుడు మీ ముందుకు వచ్చాం.. మామూలుగా వేదికలపై నేను మాట్లాడే దానికంటే ఈసారి ఎక్కువ మాట్లాడా.. అని ప్రభాస్ చెప్పారు. ప్రభాస్‌తో పాటు కృతిసనన్, సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఓంరౌత్ దర్శకత్వం వహించారు.