OTT: ఇక ఓటీటీలపై పైరసీ దెబ్బ!

OTT: ఓటీటీల్లో వచ్చే సినిమాలు పైరసీ సైట్లలో ఉచితంగా లభిస్తూంటే ఇక ఓటీటీల్లో చందాదారులుగా ఎవరు చేరతారు. సినిమాలే కాదు, ఓటీటీ వెబ్ సిరీస్ ని కూడా పైరసీ సైట్లలో పెట్టేస్తున్నారు.

Advertisement
Update:2022-11-01 13:25 IST

ప్రముఖ పైరసీ ట్రాకింగ్ ప్లాట్‌ఫామ్స్ నుంచి తాజా శోధనలు, సర్వేలు సినిమా పైరసీ అదుపు లేకుండా పెరిగిపోయినట్టు సూచిస్తున్నాయి. కోవిడ్ లాక్డౌన్ సమయంలో చట్టవిరుద్ధంగా పైరసీ సైట్లు పుట్టగొడుగుల్లా వెలిశాయని, దీంతో సినిమా, వీడియో పైరసీ ప్రమాదకర స్థాయికి చేరుకుందని హెచ్చరిస్తున్నాయి. కోవిడ్ సంక్షోభం కారణంగా థియేటర్లు మూతబడి, దేశం మొత్తం లాక్‌డౌన్‌లో ఉన్న సమయంలో, డిజిటల్ మీడియా అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్ళింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్, జీ5, ఎమ్‌ఎక్స్ ప్లేయర్ వంటి ప్రధాన ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఈ సమయంలో వ్యాపారాన్ని స్థిరీకరించుకున్నాయి. ప్రాంతీయ భాషల్లో సైతం పదుల సంఖ్యలో ఓటీటీ సంస్థలు వెలిశాయి. తెలుగులో ఆహా ఓటీటీ ప్రముఖంగా వుంది. ఇవన్నీ లక్షల్లో, కోట్లలో చందాదారుల్ని సంపాదించుకుని పురోగమిస్తున్నాయి.

అయితే లాక్డౌన్ సమయంలో పైరసీ సైట్లు కూడా విచ్చల విడిగా పెరిగాయి. చాలా ఏళ్ళుగా సినిమా రంగాన్ని కాటేస్తున్న పైరసీదార్లు, ఇక ఓటీటీ సంస్థల్ని కూడా కాటేయడం మొదలెట్టారు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్, జీ5, ఆహా మొదలైన అన్ని ఓటీటీల్లో విడుదలయ్యే వివిధ భాషల సినిమాల్ని పైరసీ సైట్లలో పెట్టేస్తున్నారు.

ఓటీటీల్లో వచ్చే సినిమాలు పైరసీ సైట్లలో ఉచితంగా లభిస్తూంటే ఇక ఓటీటీల్లో చందాదారులుగా ఎవరు చేరతారు. సినిమాలే కాదు, ఓటీటీ వెబ్ సిరీస్ ని కూడా పైరసీ సైట్లలో పెట్టేస్తున్నారు. తాజాగా అక్టోబర్ 27 న డిస్నీ+ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అయిన వెబ్ సిరీస్ 'ఝాన్సీ' ని పైరసీ సైట్లలో పెట్టేశారు. ఆహా ఓటీటీ లో విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ అయితే ఇక చెప్పనవసరం లేదు. మన దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా సినిమా వ్యాపారాన్ని,ఓటీటీ వ్యాపారాన్నీ ముప్పుతిప్పలు పెడుతున్నారు పైరసీదార్లు.

ప్రేక్షకులూ తక్కువేం కాదు

పాప్‌కార్న్ టైమ్, యూరో స్ట్రీమింగ్, ఆల్టాడెఫినిజియోన్, స్ట్రీమియో, తమిళ్‌ రాకర్స్, తమిళ్‌గన్, మూవీ రూల్జ్ వంటి ప్రసిద్ధ పైరసీ ప్లాట్‌ ఫామ్స్ అన్ని భాషల్లోని తాజా విడుదలల్ని హోస్ట్ చేయడం ద్వారా ప్రేక్షకుల్ని ఎలా ఆకర్షిస్తున్నాయో డేటా ట్రాకింగ్ సంస్థ ముసో అంచనా వేసింది. దీని ప్రకారం ప్రపంచవ్యాప్త బిట్ టొరెంట్ పైరసీ డౌన్‌లోడ్ అంచనాలు 12 మిలియన్లుగా వున్న రోజువారీ డౌన్‌లోడ్‌లు, లాక్డౌన్ సమయంలో 16 మిలియన్లకి చేరుకున్నాయి! ఇది ప్రేక్షకులు డౌన్ లోడ్ చేసుకుంటున్న పైరసీ సినిమాల సంఖ్య మాత్రమే.

ప్రేక్షకులు ఇలా డౌన్ లోడ్ చేసుకోవడంతో ఆగకుండా, పాస్‌వర్డ్ షేరింగ్‌ తో, టెలిగ్రామ్ వంటి ఫైల్-షేరింగ్ ప్లాట్ ఫామ్స్ లో, పాప్‌కార్న్ టైమ్ వంటి యాప్స్ లో కంటెంట్ ని సర్క్యులేట్ చేసేస్తున్నారు. అంటే పైరసీని ప్రేక్షకులు కూడా వ్యాప్తి చేస్తున్నారన్న మాట!

ఓటీటీ సంస్థలు కోట్లు ఖర్చు పెట్టి సినిమా హక్కులు పొందుతాయి. ఇంకా పూర్తి చేయాల్సిన లీగల్ ప్రక్రియ వుంటుంది. ఇన్ని భరించి, ఒక కొత్త సినిమాని కోట్ల రూపాయల పెట్టుబడితో స్ట్రీమింగ్ చేస్తే కొత్త చందాదారులు పెరుగుతారని అంచనా వుంటుంది. కానీ స్ట్రీమింగ్ చేసిన సాయంకాలానికే పైరసీ సైట్లలో ఆ సినిమాలు వచ్చేస్తూంటే ఓటీటీల పరిస్థితి దారుణంగానే వుంటుంది. తెలుగులో చూసుకున్నా ఓటీటీల్లో విడుదలయ్యే ప్రతీ తెలుగు సినిమా పైరసీ సైట్లలోకి వచ్చేస్తోంది. దీనికి ముందు థియేటర్లో విడుదలైతే ఆ పైరసీ కాపీ వచ్చేస్తోంది.

అరికట్టే మాట?

ఇలా ముందు నిర్మాతలకీ, తర్వాత ఓటీటీలకీ ఇది పెను గండంగా మారింది. సోనీలివ్, మాక్స్ ప్లేయర్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే ప్రసిద్ధ షోలు అరగంటలో పైరేటెడ్ వెర్షన్‌లుగా వచ్చేస్తున్నాయని ఈ సంస్థల బాధ్యులు వాపోతున్నారు. పైరసీ వల్ల ఓటీటీలు 30 శాతం రెవెన్యూని కోల్పోతున్నాయని అంచనా. భారతీయ అధికార పరిధిలోకి రాని, గూగుల్ ప్లే స్టోర్‌లోని యాప్‌ల ద్వారా చాలా పైరసీ జరుగుతోందని, దీన్ని అరికట్టలేమనీ ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇంటర్నెట్ లో ఒకసారి అప్ లోడ్ అయిన ఏ కంటెంట్ నైనా నియంత్రించడం, నిరోధించడం సాధ్యం కాదు. ఎమ్ఎక్స్ ప్లేయర్ కంటెంట్‌ని క్రమం తప్పకుండా కనీసం 15-20 మిలియన్ల మంది చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా చూస్తున్నారని, దీని వల్ల యాడ్ రాబడిలో కూడా నష్టం వాటిల్లుతోందనీ ఆ కంపెనీ ఆరోపిస్తోంది.

కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఇప్పటికే పైరసీ నిరోధక చర్యలపై పనిచేస్తోంది. ప్లాట్‌ఫామ్స్ కూడా కొన్ని సాంకేతికాలపై తమ వంతు కృషి చేస్తున్నాయి. ఉదాహరణకు, మొబైల్‌లో ఏదైనా నెట్‌ఫ్లిక్స్ షో స్క్రీన్‌షాట్ తీయడానికి ప్రయత్నిస్తే, బ్లాక్ స్క్రీన్ వస్తుంది. అయితే పైరసీని నిర్మూలించడం సాధ్యం కాదనేది అందరూ అంగీకరించేదే. భారతదేశం వెలుపల వున్న రోగ్ పైరేట్స్, కంటెంట్‌ ని దొంగిలించకుండా, ప్లాట్‌ఫామ్స్ ల ఫారమ్‌ల సాంకేతికతని రివర్స్ ఇంజనీరింగ్ చేయడం వంటి సాంకేతిక చర్యల్ని ప్రయోగాత్మకంగా చేపట్టాల్సి వుందని చెప్తున్నారు.

పైరసీదార్ల కేమిటి లాభం?

ఇంతా చేసి సినిమాల పైరసీ కాపీలని పైరసీ దార్లు తమ వెబ్సైట్స్ లో అందుబాటులో వుంచితే వచ్చే లాభమేమిటి? వెబ్ సైట్స్ కి యాడ్స్ కూడా రావు. మరేంటి ఆదాయ మార్గం? మరేమీ లేదు, ఆ పైరసీ సినిమాలు చూసే ప్రేక్షకుల జేబులు ఖాళీ చేయడమే. ఈ డిజిటల్ పైరసీ వెనుక వున్న నేరస్థులు తరచుగా పెద్ద సంఖ్యలో ప్రేక్షకుల్ని ఆకర్షించడానికి కంటెంట్‌ ని 'ఎర'గా ఉచితంగా అందుబాటులో వుంచి, ఇతర సైబర్ నేరగాళ్లని, హ్యాకర్స్ నీ తమ సైట్స్ లో మాల్‌వేర్‌ ని వుంచడానికి ఛార్జీ విధించడం ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఆ సైబర్ నేరస్థులు లేదా హ్యాకర్లు సైట్స్ కొచ్చే సినిమా ప్రేక్షకుల కంప్యూటర్స్ లో, మొబైల్స్ లో ఆ మాల్ వేర్స్ ని ప్రవేశపెట్టి, ఏంచక్కా బ్యాంకు ఖాతాల్లో సొమ్ము తమ ఖాతాల్లో వేసుకుంటారు.

ఆ మధ్య ఇంకో వార్త కూడా వెలువడింది. భారత్ ఆర్ధిక వ్యవస్థని దెబ్బదీయడానికి చెన్నైలోని పైరసీదార్లకి ఒక్కో సినిమాకి ఇరవై వేలు ఇచ్చి సినిమాల్ని అప్ లోడ్ చేయిస్తున్నారని. ఎవరు చేయిస్తున్నారు? ఇంకెవరు, పాకిస్థానీ ప్రబుద్ధులు.

Tags:    
Advertisement

Similar News