అన్ స్టాపబుల్ షోకు చీఫ్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్

వచ్చే ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ తో కలిసి అన్ స్టాపబుల్ షోకు హాజరుకానున్నట్లు ఆహా మేకర్స్ హింట్ ఇచ్చారు.

Advertisement
Update:2022-10-16 16:59 IST

అల్లు అరవింద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ అనే పేరుతో ఓ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. అన్ స్టాపబుల్ మొదటి సీజన్ విజయవంతంగా పూర్తి కాగా, ఇటీవలే ఈ షో రెండవ సీజన్ మొదలైంది. అన్ స్టాపబుల్ షో ప్రారంభ కార్యక్రమానికి చీఫ్ గెస్టులుగా టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ హాజరయ్యారు. ఈ షోలో 1995లో టీడీపీలో తలెత్తిన సంక్షోభం, ఎన్టీఆర్ నుంచి పార్టీని స్వాధీనం చేసుకోవడంపై చంద్రబాబు, బాలకృష్ణ వివరించారు.

అయితే ఆనాడు చంద్రబాబు తన మామకు వెన్నుపోటు పొడిచి పార్టీని స్వాధీనం చేసుకున్నాడని ఇప్పటికీ విమర్శలు వస్తుంటాయి. దీన్ని కప్పిపుచ్చుకోవడం కోసం, ఆనాడు ఎన్టీఆర్ వల్లే తప్పిదాలు జరిగాయని, తాము పార్టీని తమ చేతుల్లోకి తీసుకోవడం వల్లే కుటుంబానికి మేలు జరిగిందని బావ బామ్మర్దులు ఈ షో ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు.

కాగా అన్ స్టాపబుల్ షోకు చంద్రబాబు, లోకేష్ హాజరు కావడంతో అల్లు అరవింద్ మద్దతు టీడీపీకా, జనసేనకా అన్న ప్రశ్నలు తలెత్తాయి. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. ఇదిలా ఉండగా అన్ స్టాపబుల్ రెండో ఎపిసోడ్ కు అతిథులుగా నిర్మాత నాగవంశీ, హీరోలు విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ హాజరయ్యారు. ఇందుకు సంబంధించి ఒక ప్రోమో వీడియో కూడా విడుదలైంది.

ఆ ప్రోమోలో బాలకృష్ణ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ కు ఫోన్ చేస్తారు. అన్ స్టాపబుల్ కు ఎప్పుడు వస్తున్నావ్.. అని బాలకృష్ణ త్రివిక్రమ్ ని అడగ్గా.. మీరు ఓకే అంటే ఇప్పుడే వస్తాను సార్.. అని త్రివిక్రమ్ రిప్లై ఇచ్చాడు. అందుకు బాలకృష్ణ స్పందిస్తూ ఎవరితో కలసి రావాలో తెలుసు కదా.. అని త్రివిక్రమ్ ని ప్రశ్నిస్తాడు. అంతటితో ఆ ప్రోమో వీడియో ముగిసింది. దీన్ని బట్టి వచ్చే ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ తో కలిసి అన్ స్టాపబుల్ షోకు హాజరుకానున్నట్లు ఆహా మేకర్స్ హింట్ ఇచ్చారు.

గత సీజన్ లో నటీనటులు, సినీ ఇండస్ట్రీకి చెందినవారు మాత్రమే అన్ స్టాపబుల్ షోకు వచ్చి ఎంటర్టైన్మెంట్ అందించగా.. ఈ సీజన్ లో మాత్రం వరుసగా రాజకీయ నాయకులు ఈ షోకు హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. అది కూడా వైసీపీ వ్యతిరేక వర్గాలను వరుసగా షోకు ఆహ్వానిస్తుండడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

Tags:    
Advertisement

Similar News