అఫిషియల్ : 'ఉస్తాద్ భగత్ సింగ్'గా పవన్ కళ్యాణ్
కొత్త సినిమా టైటిల్ ప్రకటిస్తూ పవన్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఈ సందర్భంగా విడుదల చేయగా అది ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇందులో పవన్ ఒక స్పోర్ట్స్ బైక్ పక్కన టీ తాగుతూ స్టైలిష్ లుక్‌లో కనిపించారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కొత్త సినిమా ప్రకటన వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. పవన్ - హరీష్ శంకర్ కాంబినేషన్‌లో సినిమా ఆగిపోయిందని అనుకుంటున్న తరుణంలో ఉన్నట్టుండి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా చేస్తున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించి ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చింది.
నిజానికి రెండేళ్ల కిందటే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్‌తో ఒక సినిమా ప్రకటించారు. అప్పటికి పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు, వకీల్ సాబ్ సినిమాలు షూటింగ్ జరుగుతుండగా.. వాటి తర్వాత భవదీయుడు భగత్ సింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే పవన్ అనూహ్యంగా హరీష్ మూవీని పక్కన పెట్టి భీమ్లా నాయక్ అనే రీమేక్ మూవీ చేశాడు.
ప్రస్తుతం హరిహర వీరమల్లు మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్న పవన్ వారం కిందట సుజిత్ దర్శకత్వంలో మరో కొత్త సినిమా ప్రకటించాడు. ఈ నేపథ్యంలో పవన్ - హరీష్ కామినేషన్‌లో మూవీ ఉందో లేదో అన్న అనుమానాలు తలెత్తాయి. ఆ తర్వాత హరీష్ శంకర్ పవన్‌ని కలవడం, వారిద్దరూ కలసి తమిళ తేరి మూవీ రీమేక్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఆ మూవీ రీమేక్ అయితే వద్దని ట్విట్టర్ వేదికగా అభిమానులు హరీష్‌ని కోరారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం ఉన్నట్టుండి పవన్ - హరీష్ - మైత్రి మూవీ మేకర్స్ సినిమాపై ప్రకటన వచ్చింది. కొత్త సినిమా పేరును ఉస్తాద్ భగత్ సింగ్‌గా అనౌన్స్ చేశారు. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని ప్రకటించారు.
కొత్త సినిమా టైటిల్ ప్రకటిస్తూ పవన్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఈ సందర్భంగా విడుదల చేయగా అది ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇందులో పవన్ ఒక స్పోర్ట్స్ బైక్ పక్కన టీ తాగుతూ స్టైలిష్ లుక్‌లో కనిపించారు. అయితే ఈ మూవీ తేరి రీమేక్ నా.. లేదా కొత్త కథతో రూపొందిస్తున్నారా.. అన్న విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. కాగా ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా, డీవోపీగా బోస్ వ్యవహరిస్తున్నారు.