మహా యుద్ధానికి మహా ఓటీటీలు సిద్ధం!

ఓటీటీ రంగంలో దేశంలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలు ఏళ్ళ తరబడి తీవ్రంగా పోటీ పడుతున్న విషయం తెలిసిందే.

Advertisement
Update:2024-03-28 17:30 IST

ఓటీటీ రంగంలో దేశంలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలు ఏళ్ళ తరబడి తీవ్రంగా పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఈ పోటీని పటాపంచలు చేసి ఆధిపత్య స్థానాన్ని క్లెయిమ్ చేయడానికి ముఖేష్ అంబానీ యాజమాన్యంలోని జియో సినిమా, వాల్ట్ డిస్నీకి చెందిన హాట్ స్టార్ ఓటీటీ స్ట్రీమింగ్ కంపెనీలు ఒకటై అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నాయి. గత నెల రిలయన్స్ ఇండస్ట్రీస్ - వాల్ట్ డిస్నీ కంపెనీలు తమ భారతీయ టెలివిజన్, ఇంటర్నెట్ స్ట్రీమింగ్ ఆస్తుల్ని విలీనం చేసి, 8.5 బిలియన్ల డాలర్లకి పైగా విలువైన బృహత్ సంస్థని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించాయి. ఈ విలీనంలో రిలయన్స్ గ్రూప్ 63% వాటాని కలిగి వుంటే, మిగిలిన వాటాని డిస్నీ కలిగి వుంటుంది.

ఈ విలీనం రెండు సమ్మేళనాల యాజమాన్యంలోని 120 టీవీ ఛానెల్స్ ని, అలాగే దేశంలోని రెండు అత్యంత ప్రజాదరణ పొందిన స్ట్రీమింగ్ యాప్‌లనీ కలిగి వుంటుంది. ఆ యాప్ లు జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలు. ఇందులో నెలవారీ క్రియాశీల వినియోగదారులు, కంటెంట్ లైబ్రరీలు, నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ఖర్చులు సహా - రిలయన్స్-డిస్నీజట్టు స్ట్రీమింగ్ వ్యాపారాల్ని వివిధ అంతర్జాతీయ ప్రమాణాలతో విశ్లేషించింది. ఈ విశ్లేషణలో దేశంలో ని నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలకి అందనంత మైళ్ళ దూరం ముందున్నట్టు గుర్తించింది. కొత్త వెంచర్ ప్రస్తుతం వెనుకబడి వున్న ప్రాంతాల్లో దాని రెండు ప్రధాన ప్రత్యర్థులని అధిగమించే ఆశాభావంతో వుంది.

డేటా ఎనలిటిక్స్ ప్లాట్‌ఫామ్ కామ్‌స్కోర్ ప్రకారం, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్- జియోసినిమా కలిసి దేశంలో స్ట్రీమింగ్ యూజర్ బేస్‌లో 31% నియంత్రిస్తాయి. అదే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలు కేవలం 8%, 4% వీక్షకులతో చాలా వెనుకబడి వున్నాయని తెలుస్తోంది.

2023 నాల్గవ త్రైమాసికంలో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ దేశంలో 333 మిలియన్ల (33 కోట్ల 3 లక్షలు) నెలవారీ క్రియాశీల వినియోగదారుల్నికలిగి వుంది. కాలిఫోర్నియాకి చెందిన మార్కెట్ ఇన్‌సైట్స్ సంస్థ సెన్సార్ టవర్ డేటా ప్రకారం, జియో సినిమా 95 మిలియన్ల (9 కోట్ల 50 లక్షలు) వినియోగదారుల్ని కలిగి వుంది. ఈ ఒక్కో ప్రతి ప్లాట్‌ఫామ్ యూజర్ బేస్ నెట్‌ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ వీడియోల కంటే ఎక్కువగా వుంది. రిలయన్స్ - డిస్నీ ఏకమైనప్పుడు తమ పోర్ట్ ఫోలియో డిజిటల్ సేవలు, వినోదం, క్రీడల విస్తృత కంటెంట్ ని కలిగి వుంటుందని వాగ్దానం చేశాయి.

జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లు ప్రస్తుతం దాదాపు సమాన సంఖ్యలో సినిమాలని, షోలని కలిగి వున్నాయి. స్ట్రీమింగ్ గైడ్ రీల్‌గుడ్ అందించిన డేటా ప్రకారం, నెట్‌ఫ్లిక్స్ ఇండియన్ లైబ్రరీతో పోలిస్తే, జియో- డిస్నీ వారి సంయుక్త చలనచిత్రాలు, టీవీ షోల కలెక్షన్ వరుసగా 73%, 45% పెద్దవిగా వున్నాయి. జియో- డిస్నీ జట్టు ఇప్పుడు డిస్నీ నుంచి అందిన 30 వేల కంటే ఎక్కువ లైసెన్స్ పొందిన కంటెంట్ ఆస్తులల్ని కూడా కలిగి వుంది. జియో- డిస్నీల జనాదరణలో ఎక్కువ భాగం వాటి స్థిరమైన స్పోర్ట్స్ కంటెంట్‌ కారణంగా లభించిందని చెప్పవచ్చు.

2023లో, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ టోర్నమెంట్ కోసం ప్రత్యేకమైన డిజిటల్ హక్కుల్ని పొందడానికి జియో సినిమా 2.8 బిలియన్ల డాలర్లు(23 వేల 240 వందల కోట్ల రూపాయలు) చెల్లించింది. ఇది దేశంలో అత్యధికంగా వీక్షించిన క్రీడా ఈవెంట్‌లలో ఒకటి. అయితే జియో సినిమా వినియోగదారులు ఉచితంగా ఈ టోర్నమెంట్‌ని వీక్షించడానికి అనుమతించింది.

నెట్ ఫ్లిక్స్ క్రీడా ఈవెంట్‌లని స్ట్రీమింగ్ చేయడంలో ప్రసిద్ధి చెందలేదు — ప్రముఖ డాక్యుమెంటరీ సిరీస్ ఫార్ములా 1: డ్రైవ్ టు సర్వైవ్ వంటి కొన్ని ఈవెంట్స్ మినహా. కానీ మన దేశం విషయానికి వస్తే క్రీడల కోసం నెట్‌ఫ్లిక్స్ పుష్ చాలా ఆలస్యం కావచ్చు, ఇక్కడ ప్రీమియం స్పోర్టింగ్ కంటెంట్ ప్లాట్‌ఫామ్‌లలో ఇప్పటికే అందుబాటులో వుండడం వల్ల.

మన దేశంలో నెట్‌ఫ్లిక్స్ ఒక పారామీటర్‌లో దాని ప్రత్యర్థుల కంటే ఉన్నత స్థానంలో వుందని చెప్పవచ్చు. ఒక విశ్లేషణ ప్రకారం, డిసెంబర్ 2023 - ఫిబ్రవరి 2024 మధ్య, నెట్ ఫ్లిక్స్ భారతదేశ వినియోగదారులు సగటున, మొబైల్ యాప్‌లో 4 గంటల 15 నిమిషాలు గడిపారు. అదే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 3 గంటల 47 నిమిషాలు, జియో సినిమాలో 2 గంటల 46 నిమిషాలు గడిపారు. నెట్ ఫ్లిక్స్ మన దేశంలో 2019 నుంచి 360 మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టింది. అయితే దాని ప్రీమియం కంటెంట్ ప్రారంభంలో సముచిత ప్రేక్షకుల్ని గెలుచుకున్నప్పటికీ, యాప్ మాత్రం మాస్ అప్పీల్‌ ని పొందలేక పోయింది. నెట్‌ఫ్లిక్స్ కి మాస్ అప్పీల్ లేకపోవడానికి ప్రధాన కారణం దాని ధర. దీని ప్రీమియం నెలవారీ ప్లాను. జియో సినిమా- డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ల కంటే ఐదు రెట్లు ఎక్కువ ఖరీదైనది.

ఈ మొత్తం నేపథ్యంలో చూస్తే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలు వీలైనంత పోరాటం చేయకుండా భారతీయ మార్కెట్‌ని వదిలిపెట్టే అవకాశం లేదు. ఎందుకంటే దేశంలో కంటెంట్ కోసం ప్రేక్షకులు ఆకలిగొని వున్నారు. పైగా మన దేశం స్ట్రీమర్‌లకు అత్యంత ఆకర్షణీయమైన మార్కెట్‌గా వుంది. ఎలాగంటే, ఇది ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా వుంది.

Tags:    
Advertisement

Similar News