బిగ్ కమర్షియల్స్ తో స్మాల్ ఓటీటీల సంకటం!

నెట్ ఫ్లిక్స్, అమెజాన్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ల వంటి దిగ్గజ ఓటీటీలు హిందీ, తెలుగు, తమిళ భాషల్లో భారీ కమర్షియల్ సినిమాల్ని మార్కెట్ లో ప్రవేశపెట్టడంతో, చిన్న స్థాయి ఓటీటీలు వాటితో పోటీపడలేక నష్టాల్లో పడుతున్నాయి.

Advertisement
Update:2024-03-27 15:55 IST

నెట్ ఫ్లిక్స్, అమెజాన్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ల వంటి దిగ్గజ ఓటీటీలు హిందీ, తెలుగు, తమిళ భాషల్లో భారీ కమర్షియల్ సినిమాల్ని మార్కెట్ లో ప్రవేశపెట్టడంతో, చిన్న స్థాయి ఓటీటీలు వాటితో పోటీపడలేక నష్టాల్లో పడుతున్నాయి. దిగ్గజ ఓటీటీలు ప్రధాన స్రవంతి సేవలతో, విస్తృత ప్రేక్షకుల ఆకర్షణతో, తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి, సినిమాలంటే కేవలం హిందీ, తెలుగు, తమిళ స్టార్ సినిమాలే అన్నట్టు మార్కెటింగ్ చేయడంతో- ప్రాంతీయ భాషా సినిమాలు వెనక్కి వెళ్ళిపోయి- ప్రాంతీయ ఓటీటీల్నిదెబ్బ కొడుతున్నాయి. ప్రధానంగా హిందీ, తెలుగు, తమిళ భారీ సినిమాలు వచ్చేసి మరాఠీ, బెంగాలీ, గుజరాతీ వంటి చిన్న ప్రాంతీయ చలనచిత్ర పరిశ్రమల్ని వెనక్కి నెట్టేస్తున్నాయి. ప్రాంతీయ, ఉప ప్రాంతీయ భాషలకి చెందిన ప్రేక్షకులు తమ భాషల్లో వచ్చే చోటామోటా సినిమాల నుంచి తప్పుకుని, ఓటీటీల్లో విడుదలయ్యే హిందీ, తెలుగు, తమిళ బిగ్ కమర్షియల్స్ వైపు వలస పోతున్నారు.

ఈ పరిస్థితి పూర్వం బాలీవుడ్ సినిమాలతో తలెత్తింది. థియేటర్స్ లో బాలీవుడ్ నుంచి వచ్చే బిగ్ కమర్షియల్ సినిమాలు అస్సాం, ఒరిస్సా, మణిపూర్, నాగాలాండ్, మిజోరం, ఛత్తీస్ గఢ్, ఝార్ఖండ్, రాజస్థాన్, కాశ్మీర్ మొదలైన రాష్ట్రాలకి చెందిన ప్రాంతీయ భాషా సినిమా పరిశ్రమల్ని దెబ్బ కొట్టేశాయి. మరాఠీ, బెంగాలీ, పంజాబీ, బీహారీ, గుజరాతీ పరిశ్రమలు మాత్రం తట్టుకున్నాయి. ఇప్పుడు ఈ రాష్ట్రాలకి కూడా పెద్ద ఓటీటీలతో సమస్య తలెత్తింది. వాణిజ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, బాలీవుడ్ తో బాటు రెండు ఆధిపత్య చలనచిత్ర పరిశ్రమలు టాలీవుడ్, కోలీవుడ్ లు ప్రాంతీయ భాషల సినిమాలు కాకుండా, భారీ వ్యూవ్స్ ని సమకూర్చే హిందీ, తెలుగు, తమిళ సినిమాల స్ట్రీమింగ్ తో, దేశవ్యాప్తంగా భారీ మొత్తంలో ప్రేక్షక వర్గాన్ని తమ ఖాతాలో వేసుకోవడంలో నిమగ్నమై వున్నాయి.

ఈ ట్రెండ్ ప్రాంతీయ సినిమాల ఓటీటీ హక్కుల్లో కోతపెడుతోంది. ప్రాంతీయ ఓటీటీలు అతి తక్కువ ధరలకి కొనుగోలు చేయడంతో నిర్మాతలకి దిక్కు తోచడం లేదు. టాప్ మూడు లేదా నాలుగు ఓటీటీలు హిందీతో బాటు దక్షిణాది భాషల్లో తప్ప ఇతర ప్రాంతీయ కంటెంట్‌ పట్ల ఆసక్తి చూపడం లేదు.ఇటీవల నెట్‌ఫ్లిక్స్ హిందీలో షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ , ‘డంకీ’ రెండూ, తెలుగులో మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’, తమిళంలో విజయ్ నటించిన ‘లియో’, ఇంకా హిందీలో రణబీర్ కపూర్ నటించిన ‘యానిమల్’ వరుసగా స్ట్రీమింగ్ చేయడంతో ప్రాంతీయ సినిమాల ఓటీటీలు తలకిందులైపోయాయి. ఇవి స్ట్రీమింగ్ అవుతున్నప్పుడు ప్రాంతీయ కంటెంట్ ని ఎవరూ చూడడం లేదు!

నెట్ ఫ్లిక్స్ ఇంకా ఆగకుండా, అల్లు అర్జున్ తెలుగు బ్లాక్‌బస్టర్‌ ‘పుష్ప’ కి సీక్వెల్ ‘పుష్ప 2’ని , విజయ్ ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ ని, జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ నీ కొనుగోలు చేసేసింది. పెద్ద సినిమాల్ని బయ్యర్లు కాదు, ఓటీటీలు అడ్వాన్సు లిచ్చి ముందే కొనేస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో షాహిద్ కపూర్ నటిస్తున్న ‘అశ్వత్థామ - ది సాగా కంటిన్యూస్’ ని, , టైగర్ ష్రాఫ్ నటిస్తున్న ‘బాఘీ 4’ ని, రణ్‌వీర్ సింగ్ నటిస్తున్న ‘డాన్ 3’ నీ ముందే కొనేసింది.

ఇంకా రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’, పవన్ కళ్యాణ్ ‘హరి హర వీర మల్లు’, సూర్య ‘కంగువ’, హిందీ ‘హౌస్‌ఫుల్ 5’ లని కూడా కొనేసింది.

ప్రాంతీయంగా గమనిస్తే, పంజాబీ లేదా మరాఠీ సినిమాలని అప్పుడప్పుడు జాగ్రత్తగా ఎంపిక చేసుకుని జీ5, జియో సినిమా లవంటి దేశీయ ఓటీటీలు స్ట్రీమింగ్ చేస్తున్నాయి. ఎప్పుడూ ఎక్కువ మంది ప్రేక్షకల్ని ఆకర్షించే కంటెంట్‌పై ఎక్కువ దృష్టి వుంటుంది- ఎక్కువ మంది మాట్లాడే జనాభా వున్న హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళం వంటి భాషలు, ఎక్కువ మంది వీక్షకుల్ని ను ఆకర్షించగల సామర్థ్యం కలిగి వున్న కారణంగా- వీటిపైనే ఎక్కువ దృష్టి పెట్టాలన్నది పెద్ద ఓటీటీల వ్యూహం. పెద్ద ఓటీటీలు వీక్షకులిచ్చే ప్రాధాన్యాలపై, పాటించే వినియోగ విధానాలపై ఆధారపడి నిర్ణయాత్మక ప్రక్రియని చేపడతాయి. ఉదాహరణకు, సబ్‌స్క్రైబర్‌లు నిర్దిష్ట భాషలో కంటెంట్‌ని ఇష్టపడతారని డేటా సూచిస్తే, పెద్ద ఓటీటీలు ఆ ప్రాధాన్యాన్నితీర్చడం లక్ష్యంగా పెట్టుకుంటాయి.

తెలుగు, తమిళం సినిమాల ప్రజాదరణ నార్త్ లో హిందీ డబ్బింగ్ వెర్షన్ల విజయం నుంచి వచ్చింది. ఇదేవిధంగా, దక్షిణాది భాషల్లోకి డబ్ చేసిన హిందీ సినిమాలు కూడా ఒటీటీల్లో ఆదరణ పొందుతున్నాయి. ప్రాంతీయ సినిమా పరిశ్రమల్ని ఒకప్పుడు హిందీ బిగ్ కమర్షియల్స్ దెబ్బతీశాయనుకుంటే, ఇప్పుడు తెలుగు, తమిళ బిగ్ కమర్షియల్స్ కూడా వచ్చేసి కడుపుకొడుతున్నాయని ప్రాంతీయ ఒటీటీలతో బాటు నిర్మాతలు వాపోతున్నారు.

Tags:    
Advertisement

Similar News