‘ఓ ఎం జీ-2’ కి 27 కట్స్ తో ‘ఏ’ సర్టిఫికేట్!

అక్షయ్ కుమార్ శివుడి పాత్ర నటించిన, సెన్సార్ లో వివాదాస్పదంగా మారిన ‘ఓ ఎం జీ -2’ (ఓ మైగాడ్-2) మూవీకి కట్స్ లేకుండా ‘ఏ’ సర్టిఫికేట్ మంజూరు చేస్తామన్న సెన్సార్ బోర్డు ప్రతిపాదనకి నిర్మాతలు ఒప్పుకున్నట్టు వచ్చిన అప్డేట్ కి బదులుగా, 27 కట్స్ తోనే ‘ఏ’ - పెద్దలకు మాత్రమే సర్టిఫికేట్ జారీ చేసినట్టు ధృవీకరించిన తాజా అప్డేట్ వస్తోంది.

Advertisement
Update:2023-08-05 22:01 IST

అక్షయ్ కుమార్ శివుడి పాత్ర నటించిన, సెన్సార్ లో వివాదాస్పదంగా మారిన ‘ఓ ఎం జీ -2’ (ఓ మైగాడ్-2) మూవీకి కట్స్ లేకుండా ‘ఏ’ సర్టిఫికేట్ మంజూరు చేస్తామన్న సెన్సార్ బోర్డు ప్రతిపాదనకి నిర్మాతలు ఒప్పుకున్నట్టు వచ్చిన అప్డేట్ కి బదులుగా, 27 కట్స్ తోనే ‘ఏ’ - పెద్దలకు మాత్రమే సర్టిఫికేట్ జారీ చేసినట్టు ధృవీకరించిన తాజా అప్డేట్ వస్తోంది. కట్సే గాకుండా అక్షయ్ కుమార్ శివుడి పాత్రని శివుడి దూతగా మార్చి వేసేందుకు కూడా నిర్మాతలు అంగీరించినట్టు తెలుస్తోంది. ఈ సినిమా సర్టిఫికేషన్ విషయంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సూచించిన సవరణలు ఈ కింది విధంగా వున్నాయి...

ఈ సినిమాపై ఆడియో పరంగా, విజువల్స్ పరం మొత్తం 27 కట్‌ లున్నాయి. అక్షయ్ కుమార్ పోషించిన శివుడి పాత్రని సవరించడం ప్రధాన మార్పుల్లో ఒకటి. శివుడి బదులుగా శివుడి దూతగా మార్చారు. దీనికి 'నందీ మేరే భక్త్...జో ఆగయా ప్రభూ' (శివుడి భక్తుడు నంది వచ్చేశాడు ప్రభూ) డైలాగుని చేర్చారు. నాగ సాధువుల ఆచ్ఛాదన లేని శరీర ముందు భాగపు షాట్స్ ని తొలగించారు. 'భగవాన్ కో భక్తి...మహిళాయే నహీ దేఖ్ సక్తీ' (భగవానుణ్ణి మహిళలు భక్తితో చూడలేరు) డైలాగుని 'ఓ లాల్ షర్ట్ వాలే భయ్యా...బాబా కా ధ్యాన్ కర్తే రహే' (ఓ ఎర్ర షర్టు భయ్యా... బాబాని ధ్యానిస్తూ వుండు) గా మార్చారు.

సినిమా ప్రారంభంలో డిస్ క్లెయిమర్ లో మార్పులు చేసి, దానికి వాయిసోవర్ వేశారు. పాఠశాల పేరుని 'సవోదయ్' గా మార్చారు. 'వహా మధిరా చడేహై' (మద్యం మత్తు ఎక్కింది) డైలాగులో ఆల్కహాల్, విస్కీ, రమ్ పదాల్ని తొలగించారు. హై కోర్టుకి సంబంధించి 'హై కోర్టు... మజా ఆయేగా' డైలాగు అసభ్యంగా, పరువు నష్టం కలిగించేదిగా వుందని భావించి తొలగించారు. ఈ డైలాగులో విజువల్స్ ని కూడా తొలగించారు. కోర్టు ఆవరణలో జడ్జి సెల్ఫీ దిగుతూ కనిపించే సన్నివేశంలో విజువల్ కట్స్ వేశారు.

బిల్‌బోర్డు మీద కన్పించే మూడ్ ఎక్స్ కండోమ్ పోస్టర్ ని తొలగించారు. ఎలుకల విషం వున్న సీసా లేబుల్‌లో 'ఎలుక' అనే పదాన్ని బ్లర్ చేశారు. ఇక ఒక ముఖ్యమైన సంభాషణలో శివలింగం, శ్రీ భగవద్గీత, ఉపనిషత్తు, అథర్వవేదం, ద్రౌపది, పాండవులు, కృష్ణుడు, గోపికలు, రాసలీల ప్రస్తావనల్ని తొలగించారు. 'మై టాంగ్ క్యూ అడావూ' (నేను కాలెందుకు అడ్డం పెట్టాలి) డైలాగులో మార్పులు చేశారు. అక్షయ్ కుమార్ పాత్ర ధ్యానం, స్నానం చేస్తున్న దృశ్యాల్లో మార్పులు చేశారు. అక్షయ్ పాత్ర త్రాగుడు సీన్లని తొలగించారు. 'బడే బాల్ దేఖ్ కర్' (పెద్ద జుట్టు చూసి), 'సత్యం శివం సుందరం', 'హమారా దేశ్...పీచే నహీ హై' (మన దేశం వెనుకబడి లేదు), 'స్త్రీ కి యోనీ...' వంటి మరెన్నో డైలాగుల్ని మార్చారు. కొన్ని అసభ్య హావభావాల్ని సెన్సార్ చేశారు.

పంకజ్ త్రిపాఠీ అసహజ సెక్స్ గురించి సెక్స్ వర్కర్‌ని ప్రశ్నించే సన్నివేశంలో, డైలాగులు మాత్రమే కాకుండా విజువల్స్ కూడా సవరించారు. అదేవిధంగా, హస్తప్రయోగం గురించి మాట్లాడే డాక్టర్ ప్రకాష్ కొఠారీ పాత్ర విజువల్స్ ని, డైలాగ్స్ నీ రెండింటినీ తగిన విధంగా సవరించారు. హస్తప్రయోగం గురించిన డైలాగులో, 'హరామ్' ఉర్దూ పదాన్ని 'పాప్' గా మార్చారు. కొన్ని డైలాగుల్లో 'లింగం' ప్రస్తావనని కూడా అదే సవరించారు. వైరల్ వీడియోలో లైంగిక చర్యలో బాలుడి విజువల్స్ లో NCPCR (నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్) మార్గదర్శకాల ప్రకారం చాలా మార్పులు చేశారు. లైంగిక చర్యలకి సంబంధించి సినిమాలో పేర్కొన్న అంశాలకి డాక్యుమెంటరీ సాక్ష్యాల్ని సమర్పించాలని నిర్మాతల్ని కోరారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మొదట ఉజ్జయిని పుణ్య క్షేత్రం నేపథ్యం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో, ఉజ్జయిని పేరు తొలగించి కల్పిత ప్రదేశంలో జరిగినట్టు మార్పు చేశారు. మహంత్ వంటి అధికార స్థానాల్లో వున్న కొంతమంది వ్యక్తులకి సంబంధించిన అన్ని విజువల్స్ ని, మౌఖిక సూచనల్ని తొలగించారు.

మొత్తం మీద ఇలా 13 నిమిషాల సినిమా సెన్సార్ అయింది. ఈ కట్స్ ని అంగీకరించిన తర్వాత, నిర్మాతలకి సెన్సార్ సర్టిఫికేట్ మంజూరు చేశారు. ఇటీవల రామాయణం ఆధారంగా తీసిన 'ఆదిపురుష్' కి ఉదారంగా సర్టిఫికేట్ ఇచ్చేసి తీవ్ర విమర్శల పాలైన కేంద్రీయ సెన్సార్ బోర్డు, 'ఓ మై గాడ్ 2' తో అదే పొరపాటు చేయకుండా కఠినంగా వ్యవహరించింది. అక్షయ్ కుమార్-పంకజ్ త్రిపాఠీ -యామీ గౌతమ్ లు నటించిన ఈ సినిమా ఆగస్టు 11న థియేటర్లలో విడుదలవుతోంది.

Tags:    
Advertisement

Similar News