మళ్లీ తెరపైకి ఓదెల రైల్వే స్టేషన్
హెబ్బా పటేల్ ప్రధాన పాత్ర పోషించిన సినిమా ఓదెల రైల్వే స్టేషన్. ఈ సినిమాకు ఎట్టకేలకు మోక్షం దొరికింది. నేరుగా ఓటీటీలో రిలీజ్ అవ్వబోతోంది
అప్పుడెప్పుడో లాక్ డౌన్ టైమ్ లో బాగా వినిపించిన పేరు ఓదెల రైల్వేస్టేషన్. హెబ్బా పటేల్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమా అప్పట్నుంచి ఇప్పటివరకు విడుదలకు నోచుకోలేదు. ఎట్టకేలకు ఈ సినిమా మరోసారి తెరపైకొచ్చింది.
దర్శకుడు సంపత్ నంది అందించిన కథ, స్క్రీన్ ప్లేతో హెబ్బా పటేల్, వశిష్ట సింహ, సాయి రోనక్, పూజిత పొన్నాడ ప్రధాన పాత్రల్లో తెరకెక్కింది ఓదెల రైల్వే స్టేషన్. అశోక్ తేజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. కెకె రాధామోహన్ ఈ సినిమాను నిర్మించారు. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ 26న విడుదలకు సిద్ధమైంది. అయితే థియేటర్లలో రిలీజ్ అవ్వడం లేదు. 'ఆహా' యాప్ లో నేరుగా స్ట్రీమింగ్ కు వస్తోంది.
ఓదెల రైల్వేస్టేషన్ సినిమా ఓ క్రైమ్ థ్రిల్లర్. డీవోపీ సౌందర్ రాజన్, మ్యూజిక్ డైరక్టర్ అనూప్ రూబెన్స్ లాంటి సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు పనిచేశారు. హెబ్బా పటేల్ ఈ సినిమా కోసం చాలా కష్టపడిందట. కరోనా టైమ్ లో 50 రోజుల్లో ఈ సినిమాని పూర్తి చేశారు. కోవిడ్ సెకండ్ వేవ్ వలన రిలీజ్ కొంచెం ఆలస్యం అయ్యింది. ఇప్పుడిలా నేరుగా ఓటీటీలోకి వస్తోంది.
గతంలో రాధామోహన్ నిర్మించిన ఒరేయ్ బుజ్జిగా సినిమా కూడా ఆహాలోనే వచ్చింది. ఇప్పుడు ఓదెల రైల్వేస్టేషన్ కూడా ఆహాలోనే స్ట్రీమింగ్ కు వస్తోంది. ఈ సినిమాపై హెబ్బా పటేల్ చాలా హోప్స్ పెట్టుకుంది. ఈ మూవీ తర్వాత తనకు మరిన్ని మహిళా ప్రాధాన్యం ఉన్న పాత్రలు వస్తాయని ఆశగా ఎదురుచూస్తోంది. అలా తన కెరీర్ స్పాన్ ను ఇంకాస్త పెంచుకోవాలని చూస్తోంది ఈ ముద్దుగుమ్మ.