తండ్రి నుంచే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను
ఎదురుతిరిగినందుకు తట్టుకోలేక ఆయన షూటింగ్ ప్రదేశానికి వచ్చి అందరి ముందు కొట్టేవాడన్న నటి ఖుష్బూ
తన తండ్రి వల్ల లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పిన విషయం విధితమే. తాజాగా ఆమె మరోసారి ఇదే విషయాన్ని తెలిపారు. ఆయన వల్ల తన కుటుంబం ఎన్నో సమస్యలు చూసిందన్నారు. తన తల్లి, సోదరులను ఆయన చిత్రహింసలు పెట్టేవాడని తెలిపారు. తనపై జరుగుతున్న లైంగికదాడి గురించి బైటికి చెబితే ఎక్కడ తన వాళ్లను ఇంకా నరకయాతన పెడుతాడోనని భయపడి తను చాలాకాలం ఈ దారుణాన్ని బైటపెట్టలేదని ఆమె విరించారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాతే తాను ధైర్యంగా బదులివ్వడం నేర్చుకున్నానని అన్నారు. ఆయనకు ఎదురుతిరిగిన సందర్భాలు ఉన్నాయన్నారు. అది తట్టుకోలేక ఆయన షూటింగ్ ప్రదేశానికి వచ్చి అందరి ముందు కొట్టేవాడని చెప్పారు.
చిన్నతనంలోనే నేను లైంగిక దాడిని ఎదుర్కొన్నా. నా తండ్రే నాపై ఈ దారుణానికి పాల్పడ్డాడు. నా తల్లి, సోదరులను చిత్రహింసలు పెట్టేవాడు. బెల్టు, చెప్పులు, కట్టె.. ఇలా చేతికి ఏది దొరికితే దానితో కొట్టేవాడు. కొన్నిసార్లు అమ్మను మరీ దారుణంగా హింసించేవాడు. ఆమె తలను గోడకు కొట్టేవాడు. చిన్నతనంలోనే నేను ఇలాంటి దారుణమైన వేధింపులు చూశాను. నాపై జరుగుతున్న దాడి గురించి బైటికి చెబితే వాళ్లను ఇంకెంత నరకయాతనకు గురిచేస్తాడోనని భయపడ్డాను. అందుకే మొదట్లో ఏమీ మాట్లాడలేక ఎన్నో దారుణాలు భరించాను. చెన్నైకి వచ్చి నా కాళ్లపై నిలబడిన తర్వాత నాలో ఆత్మస్థైర్యం పెరిగింది. ఆ తర్వాతే ఆయనకు ఎదురుతిరగడం మొదలుపెట్టాను. దాన్ని ఆయన తట్టుకోలేకపోయాడు. షూట్‌కు వచ్చి అందరిముందు నన్ను బాగా కొట్టేవాడు. ఉబిన్ అనే ఒక హెయిర్‌డ్రెస్సర్ నాకెంతో సాయం చేసింది. నాతో ఆయన ప్రవర్తన సరిగ్గా లేదని ఆమె గుర్తించిది. నా నుంచి విషయం తెలుసుకుని ధైర్యం చెప్పింది. అలా మొదటిసారి 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు లైంగిక వేధింపుల గురించి బైటికి వచ్చి మాట్లాడాను. ఆ తర్వాత ఆయన మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయాడు. ఎక్కడి వెళ్లాడో మాకు తెలియదు. నేను కనుక్కోవాలనుకోలేదు. ఆ తర్వాత ఎప్పుడూ ఆయనను కలవలేదు. గత ఏడాది ఆయన చనిపోయాడని తెలిసినవాళ్లు చెప్పారని ఖుష్బూ తెలిపారు.