Kollywood: కోలీవుడ్ బ్యాన్ నటీనటులకి వర్తించదట!
ఇటీవల కోలీవుడ్ (తమిళ) సినిమాల్లో తమిళేతర నటుల్ని బ్యాన్ చేస్తున్నట్టు తమిళ సినిమా పరిశ్రమకి చెందిన టెక్నికల్ వర్కర్ల సంస్థ ఫెఫ్సీ (ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా) ప్రకటించడం టాలీవుడ్ నటీనటుల్లో కోపాన్ని పెంచింది.
ఇటీవల కోలీవుడ్ (తమిళ) సినిమాల్లో తమిళేతర నటుల్ని బ్యాన్ చేస్తున్నట్టు తమిళ సినిమా పరిశ్రమకి చెందిన టెక్నికల్ వర్కర్ల సంస్థ ఫెఫ్సీ (ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా) ప్రకటించడం టాలీవుడ్ నటీనటుల్లో కోపాన్ని పెంచింది. అయితే తెలుగు నటుల్ని బ్యాన్ చేయడం లేదని మళ్ళీ చెప్పడంతో టాలీవుడ్ నెమ్మదించింది. ఇవి కేవలం పుకార్లని, చెన్నైలో ఫెఫ్సీ ప్రధాన కార్యదర్శి స్వామినాథన్ నిన్న స్పష్టం చేశారు. తమ సంస్థకు అలాంటి అధికారాలు లేనందున తమిళ సినిమాల్లో నటించకుండా ఏ భాషా నటుల్నీ నిషేధించలేమని చెప్పారు.
గత శుక్రవారం నాడు తమిళ సినిమాల్లో తమిళ నటులకి మాత్రమే అవకాశాలు కల్పిస్తే సరిపోతుందని ప్రకటించడమే గాక మరో నాలుగు షరతులు కూడా పెట్టారన్న వార్త చక్కర్లు కొట్టింది. 1. తమిళ సినిమాల షూటింగ్ తమిళనాడులో మాత్రమే జరపాలి, 2. ఎంతో అవసరమైతే తప్ప షూటింగ్ బయటి రాష్ట్రంలో లేదా బయటి దేశంలో జరపకూడదు, 3. షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కాకపోయినా లేదా నిర్ణయించిన బడ్జెట్ కి మించినా తగిన కారణాలతో నిర్మాతలు వ్రాతపూర్వకంగా తెలియజేయాలి, 4. దర్శకుడే కథా రచయిత అయితే కథా హక్కుల విషయంలో ఏదైనా సమస్య వస్తే అతనే బాధ్యత వహించాలి.
ఇలా మొత్తం అయిదు నిబంధనలు విధించినట్టు, వీటిని ఉల్లంఘిస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామనీ ఫెఫ్సీ నాయకత్వం ప్రకటించింది. ఇతర భాషా పరిశ్రమలకి చెందిన నటీనటులతో తమిళ సినిమాలు తీస్తూంటే స్థానిక ఫెఫ్సీ సభ్యులు పనిని పొందలేకపోతున్నారని తెలిపింది. అయితే తమిళేతర నటుల్ని బ్యాన్ చేసినట్టు వచ్చిన వార్తలు వొట్టి పుకార్లని కొట్టి వేసింది.
అయితే మిగిలిన నిబంధనలపై తమిళ నిర్మాతలు మండిపడ్డారు. తమిళనాడులో షూటింగ్ కి లొకేషన్స్ అనుకూలంగా లేకపోవడంతో, మౌలిక సదుపాయాల లేమితో, అనుమతుల్లో జాప్యంతో, తాము బయటి రాష్ట్రాలకి వెళ్తున్నామని నిర్మాతలు తెలిపారు.
తెలుగు రాష్ట్రాలు, విదేశాలు షూటింగ్ కి అనుకూలంగా వున్నాయని ఫెఫ్సీ తీసుకున్న నిర్ణయంపై ఘాటుగా స్పందించారు.
ఫెఫ్సీ అనేది తమిళ సినిమా పరిశ్రమలోని వివిధ సాంకేతిక శాఖలకి చెందిన 24 యూనియన్‌ల సమాఖ్య. తమిళ సినిమాల్లో పనిచేసే 24 సాంకేతిక శాఖలకి చెందిన వేలాది మంది కార్మికుల ప్రయోజనాలకి తాము ప్రాతినిధ్యం వహిస్తున్నామని, వారి ప్రయోజనాలని కాపాడతామనీ ప్రధాన కార్యదర్శి స్వామినాథన్ తెలిపారు.
సినిమాల్లో పనిచేస్తున్నప్పుడు రోజువారీ వేతన కార్మికుల్ని పంచుకోవడంపై ముంబైకి చెందిన లైట్ ఎన్ లైట్ కంపెనీతో తమకు కొన్ని సమస్యలు వున్నాయని చెప్పారు. కార్మికుల్ని 40-50 శాతం నిష్పత్తిలో పంచుకోవాలని కోరామనీ, దీనిపై ఒక సంవత్సరం సమయం ఇచ్చినా స్పందించలేదనీ తెలియజేశారు. తమిళ సినిమా పరిశ్రమలో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన చీఫ్ టెక్నీషియన్లపై కూడా ఎలాంటి ఆంక్షలు విధించలేదని అన్నారు. తమిళ డ్యాన్సర్లు, ఫైటర్లు తెలుగు సినిమాల్లో ఫిఫ్టీ -ఫిఫ్టీ నిబంధనల క్రింద పనిచేస్తున్నారని, టాలీవుడ్ డాన్సర్లు, ఫైటర్లు కూడా చెన్నై రావచ్చని, తమ సమస్యల్లా రోజువారీ కూలీ కార్మికుల గురించేననీ, అలాగే నిర్మాతలతో షూటింగ్ సమస్యల గురించి మాత్రమేనని చెప్పి పుకార్లకి తెర దించారు.
కోలీవుడ్ సినిమాల్లో తమిళేతర నటులెందరో నటిస్తున్నారు. దేశంలోని అతిపెద్ద పరిశ్రమల్లో కోలీవుడ్ ఒకటి. దేశం అంతటా వున్న కళాకారులు తమిళ సినిమాల్లో పనిచేస్తున్నారు. మలయాళీ నటీనటులు తమిళ సినిమాల్లో ముఖ్యమైన భాగం. ‘బాహు
బలి’ తర్వాత పెరిగిన పాన్-ఇండియన్ సినిమా మార్కెట్‌లో విదేశీ నటులు కూడా తమిళంలో నటిస్తున్నారు. ఇక సూపర్ స్టార్స్ సినిమాలకైతే విదేశాల్లో షూటింగ్ జరపడం ఎలాగూ తప్పదు.
ఫెఫ్సీ ప్రకటన, పుకార్లు ఏదైతేనేం వీటికి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన సోషల్ మీడియాల్లో వెల్లువెత్తుతోంది. తమిళ సినిమాల్ని తమిళనాడులో మాత్రమే ప్రదర్శించాలని, ఎంతో అవసరముంటే మాత్రమే పానిండియా లేదా ఓవర్సీస్ విడుదలకి వెళ్ళాలని, సినిమా టిక్కెట్లని కూడా తమిళ ప్రజలకి మాత్రమే విక్రయించాలనీ, తమిళేతర వ్యక్తులు సినిమా చూడాలన్న తమ తపనని వివరిస్తూ సంబంధిత అధికారులకి దరఖాస్తు చేయాలనీ, దాని గురించి వివరించే చట్టపరమైన అఫిడవిట్ ని కూడా ఫైల్ చేయాలనీ, క్లియరెన్స్ పొందిన తర్వాత మాత్రమే, సినిమా టిక్కెట్లు పొందేందుకు తమిళేతర వ్యక్తులు అర్హులవుతారనీ... ఇలా రకరకాలుగా జోకులేస్తున్నారు.