శ్రీవిష్ణు సరసన మరో కొత్త హీరోయిన్
శ్రీవిష్ణు మరో కొత్తమ్మాయికి ఛాన్స్ ఇచ్చాడు. తాజాగా స్టార్ట్ చేసిన కొత్త సినిమాలో హీరోయిన్ గా ఓ మలయాళీ ముద్దుగుమ్మను తీసుకున్నాడు.
తన సినిమాలతో ప్రతిసారి ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేస్తుంటాడు శ్రీవిష్ణు. ఇదే విషయంపై ప్రశ్నిస్తే, తన కథలకు, పాత్రలకు కొత్త హీరోయిన్లు మాత్రమే సెట్ అవుతారని సమాధానం ఇచ్చాడు. ఇప్పుడీ ఆనవాయితీని కొనసాగిస్తూ, మరో ముద్దుగుమ్మను తెలుగు తెరపైకి తీసుకొస్తున్నాడు ఈ నటుడు.
శ్రీ విష్ణు కొత్త సినిమా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఇటీవలే ప్రారంభమైంది. రామ్ అబ్బరాజు 'వివాహ భోజనంబు' సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. అనిల్ సుంకర సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్టైన్మెంట్స్తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నాడు.
ఈ చిత్రంలో శ్రీవిష్ణు సరసన హీరోయిన్ గా నటించడానికి రెబా మోనికా జాన్ అనే అమ్మాయిని ఎంపిక చేశారు. రెబా మోనికా గతంలో మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో సినిమాలు చేసింది. ఆమెకిదే తొలి తెలుగు సినిమా. అలా తన సినిమాతో మరో కొత్తమ్మాయిని టాలీవుడ్ కు తీసుకొస్తున్నాడు శ్రీవిష్ణు.
గోపీసుందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి రాబోతోంది. కామెడీ జానర్ లో వస్తున్న సినిమా ఇది.