NagaChaitanya | రేసింగ్ టీమ్ దక్కించుకున్న చైతూ
NagaChaitanya - ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ లో భాగమయ్యాడు నాగచైతన్య. హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ టీమ్ ను దక్కించుకున్నాడు.
టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య.. కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టాడు. చైతుకి ఆటో మైబైల్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కారు రేసింగ్స్, ఫార్ములా వన్ అంటే చాలా ఇష్టం. అలాగే ఆయన తనకు ఎంతో ఇష్టమైన రేసింగ్ కార్లను, మోటార్ సైకిల్స్‌ను కూడా సేకరిస్తుంటాడు. ఈ విషయాన్ని ఆయన పలు సందర్భాల్లో బయటపెట్టాడు కూడా.
అలాంటి ఇష్టమైన రంగంలోకి చైతన్య అడుగు పెట్టాడు. ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ (ఐఆర్ఎఫ్)లో పోటీ పడే హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ఫ్రాంచైజీని నాగచైతన్య సొంతం చేసుకున్నాడు. దీని వల్ల ఆయన ఐఆర్ఎఫ్ నిర్వహించే ఫార్ములా-4లో భాగమయ్యాడు. దీనికి సంబంధించిన రేసులు చెన్నై ఇంటర్నేషనల్ సర్క్యూట్ లో రేపట్నుంచి ప్రారంభం కానున్నాయి.
"ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ అనేది నా అభిరుచిని చూపించడానికి చక్కని వేదికగా భావిస్తున్నాను. హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్‌ను సొంతం చేసుకోవటం ఎంతో ఆనందంగా ఉంది. ఫ్యాన్స్‌కు ఐఆర్ఎఫ్ అనేది మరచిపోలేని అనుభూతినిస్తుందనటంలో సందేహం లేదు. అలాగే దీంతో ఇండియన్ మోటార్ స్పోర్ట్స్ నెక్ట్స్ రేంజ్‌కి చేరుకుంటుంది. న్యూ టాలెంట్ బయటకు వస్తుంది" అని అన్నాడు చైతూ.
ఇండియన్ రేసింగ్ లీగ్‌లో పాల్గొంటున్న 6 టీమ్స్‌లో హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ఒకటి. ఇందులో నాగచైతన్య భాగం కావటం అనేది స్పీడ్ గేమ్‌కి మరింత ఆకర్షణగా మారింది. ఇంకా ఇందులో అర్జున్ కపూర్, జాన్ అబ్రహం, మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీ భాగమయ్యారు.