చేతులు కలిపిన యూవీ-మైత్రీ?
టాలీవుడ్ లో రెండు పెద్ద సంస్థలు చేతులు కలిపాయి. మైత్రీ మూవీ మేకర్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు ఇకపై కలిసి సినిమాలు నిర్మిస్తాయి.
చాలామంది హీరోలకు అడ్వాన్సులు ఇచ్చింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. అదే విధంగా చాలా మంది దర్శకులకు అడ్వాన్స్ ఇచ్చింది యూవీ క్రియేషన్స్ సంస్థ. అటు మైత్రీ మూవీ మేకర్స్, ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటోందనే రూమర్లు కూడా వినిపించాయి. ఈ క్రమంలో మైత్రీ-యూవీ కలిశాయి. ఇకపై కలిసి సినిమాలు నిర్మించడంతో పాటు డిస్ట్రిబ్యూషన్ కూడా చేయబోతున్నాయి.
త్వరలోనే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పుష్ప-2 సెట్స్ పైకి రాబోతోంది. ఈ మూవీకి యూవీ క్రియేషన్స్ సంస్థ ఫండింగ్ అందించబోతోంది. అటు యూవీ క్రియేషన్స్ సంస్థ దగ్గర రామ్ చరణ్ కాల్షీట్లు ఉన్నాయి. ఆ మేరకు చరణ్ కోసం దర్శకుడ్ని సెట్ చేయబోతోంది మైత్రీ.
ఇక డిస్ట్రిబ్యూషన్ లో కూడా ఈ రెండు సంస్థలు కలిసి పనిచేయబోతున్నాయి. యూవీకి ఏపీలో డిస్ట్రిబ్యూషన్ బెల్ట్ ఉంది. ఇప్పుడు తెలంగాణలో మైత్రీ సంస్థ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ తెరవబోతోంది. ఇలా ఓ అవగాహన ప్రకారం ఈ రెండు పెద్ద నిర్మాణ సంస్థలు పనిచేయబోతున్నాయి.