చరిత్రలో మణిపూర్ సినిమా సీన్

1972 లో మణిపూర్ రాష్ట్రం ఏర్పడడం, మొదటి మణిపురి సినిమా నిర్మించడం రెండూ ఒకేసారి జరిగిపోయాయి. ఆ మొదటి మణిపురి సినిమా అదృష్టవశాత్తూ సబ్ టైటిల్స్ తో యూట్యూబ్ లో అందుబాటులో వుంది. 54 నిమిషాల ఈ తొలి మణిపురి సినిమా జాతీయ చలనచిత్రోత్సవాల్లో రాష్ట్రపతి పతకం కూడా అందుకుంది.

Advertisement
Update:2023-08-18 11:44 IST

తీవ్రవాదం సినిమాలని నిర్బంధిస్తే సినిమాలకి స్వాతంత్ర్యం వచ్చినట్టయింది... స్వాతంత్ర్యమే కాదు, దాంతో పాటూ జాతీయ అంతర్జాతీయ అవార్డులూ దర్జాగా సొంతమవుతాయని రుజువైంది. ప్రభుత్వాలు సినిమాలని నియంత్రిస్తే ఆందోళన, తీవ్రవాదులు నియంత్రిస్తే అదో క్రమశిక్షణ అన్నట్టుంది ఇంఫాల్ వుడ్ గా పేర్కొనే మణిపూర్ సినిమా సీన్. తీవ్రవాదుల నియంత్రణ వాళ్ళ భావ వ్యాప్తికి కాదు, మణిపురి సంస్కృతీ పరిరక్షణకి. మణిపూర్ స్వతంత్ర దేశమన్న మౌలిక పోరాటంలో వేళ్ళూనిన ఆత్మ గౌరవ కాంక్ష. తత్ఫలితంగా మణిపురీ సినిమాలు ఈశాన్య భారతపు మణి మకుటాలయ్యాయి.

1947 లో దేశానికి స్వాతంత్ర్యం లభించినప్పటికీ మణిపూర్ సంస్థానం విలీనం కాలేదు. 1948 లో విలీనమైంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన తీవ్రవాద చరిత్ర ఇక్కడ్నుంచీ మొదలవుతుంది. 1972 నుంచి మణిపూర్ సినిమా నిర్మాణాల ప్రారంభం, బాలీవుడ్ ప్రభావం, 2000 లో తీవ్రవాదులు విధించిన బాలీవుడ్ సినిమాల నిషేధం, స్థానిక మణిపూర్ సినిమాల ఊపు, తీవ్రవాదులు మణిపూర్ సాంస్కృతికో ద్యమాన్ని చేపట్టి సినిమాల్ని శాసించడం, ఆ మేరకు మణిపూర్ సినిమాలు గుణాత్మకంగా నిర్మాణమవడం మొదలైనవి ఒక చరిత్రగా కనిపిస్తాయి.

2000 లో మణిపూర్ లో తీవ్రవాదులు బాలీవుడ్ సినిమాలని నిషేధించడంతో మణిపురీ సినిమాలకి స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటివరకూ బాలీవుడ్ సినిమాల ప్రభావంతో పెడ ధోరణులు పట్టి పోయి, సొంత సాంస్కృతిక వారసత్వాన్ని మర్చిపోయిన ప్రజలు, బాలీవుడ్ సినిమాల నిషేధంతో పద్ధతి మార్చుకున్నారు. బాలీవుడ్ సినిమాలు ఏలిన రెండు దశాబ్దాల కాలం ఏడాదికి ఒకటీ ఆరా నిర్మాణమయ్యే మణిపురీ సినిమాలు, నిషేధం తర్వాత ఏకంగా ఏడాదికి డెబ్బై సినిమాల స్థాయికి చేరుకున్నాయి. అయితే తీవ్రవాద చర్యతో బాలీవుడ్ సినిమాల నుంచి ఇంఫాల్ వుడ్ కి స్వేచ్ఛ లభించినా, ఆ వెంటనే అది తీవ్రవాద నిర్బంధంలో కెళ్ళిపోయింది. ఒకటే షరతు : ఇక నుంచి మణిపురీ సినిమాలు పరిపుష్టమైన మణిపురీ విలువలకి అద్దం పట్టాలి. ఈమేరకు సినిమాల మీద నిఘా వుంటుంది, సెన్సార్ వుంటుంది. దాదాపు ముప్ఫై తీవ్రవాద సమూహాల ఒకే మాట, పెడదోవ పట్టారో తుపాకీ తూటా తప్పదు. దీంతో సినిమాలు క్రమశిక్షణతో మణిపురీ జీవితపు దర్పణాలుగా మెరుపులు మెరిపించ సాగాయి.

1972 లో మణిపూర్ రాష్ట్రం ఏర్పడడం, మొదటి మణిపురి సినిమా నిర్మించడం రెండూ ఒకేసారి జరిగిపోయాయి. ఆ మొదటి మణిపురి సినిమా అదృష్టవశాత్తూ సబ్ టైటిల్స్ తో యూట్యూబ్ లో అందుబాటులో వుంది. 54 నిమిషాల ఈ తొలి మణిపురి సినిమా జాతీయ చలనచిత్రోత్సవాల్లో రాష్ట్రపతి పతకం కూడా అందుకుంది.

బాలీవుడ్ సినిమాల నిషేధంతో 2000-2003 మధ్య ఏడాదికి 70 ప్రాంతీయ సినిమాలు చొప్పున నిర్మించిన మణిపూర్, ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధిక సినిమాలు నిర్మించే రాష్ట్రంగా పేరు తెచ్చుకుంది. అయితే 2003 నాటికి ఏడాదికి ఏడు సినిమాల స్థాయికి ఉత్పత్తి పడిపోయి, 2003 నుంచి 2018 వరకూ పదిహేను సంవత్సరాల కాలంలో మొత్తం ఏడు సినిమాలు మాత్రమే నిర్మించగల్గే హీన దశకి పడిపోయింది ఇంఫాల్ వుడ్. 2019-21 మధ్య 9 సినిమాలే నిర్మించింది. 2022-23 లో శూన్య స్థితికి చేరుకుంది. బాలీవుడ్ సినిమాల ప్రభావంతో స్థానిక సినిమాలకీ గతి. తీవ్రవాదులు థియేటర్లలో బాలీవుడ్ సినిమాల్ని నిషేధించగల్గారు గానీ ఇంటర్నెట్ లో కాదు. ఇంటర్నెట్ లో ప్రజలు తిరిగి బాలీవుడ్ సినిమాల్ని రుచి మరిగాక దీన్నాపడం ఎవరి వల్లా కాలేదు. దీంతో ప్రాంతీయ మణిపురీ సినిమా అనాధ అయింది.

మణిపురి ప్రజలు స్వాభావికంగా కళాకారులు. మణిపురి కళల్ని సజీవంగా వుంచాలని ఆశించే అంకితభావం గల వాళ్ళు. ఇది సినిమాల్లో కూడా ప్రతిబింబిస్తూపోయారు. కానీ 2000 నుంచీ కొత్త తరం దర్శకులు యాక్షన్, లవ్, కామెడీలకి అరువు కళలు తెచ్చుకుని, సొంత కళల్ని అడవులు పట్టించారు. అయితే ఒక విషయంలో మాత్రం నిబద్ధతతో వున్నారు. సంస్కృతి పేరిట తీవ్రవాదుల్ని సంతోషపెట్టడానికి అనాదిగా వస్తున్న తమ ఉమ్మడి కుటుంబ వ్యవస్థకి కట్టుబడే వున్నారు. తీస్తున్న అరువు కళల సినిమాల్లో తమ కుటుంబ విలువల్ని గొప్పగానే చూపించుకున్నారు. అసలు తీసిన మొట్ట మొదటి మణిపురి సినిమా కూడా ఉమ్మడి కుటుంబం గురించే, కుటుంబ విలువల గురించే.

తొలి మణిపురీ సినిమా

‘మాతం – గి మణిపూర్’ ఆ మొదటి మణిపూర్ చలన చిత్రం. ఈ టైటిల్ కి అర్ధం నేటి మణిపురి అని. అయితే రాష్ట్రావతరణం నాటికీ (1972) మణిపూర్ ఎలా వుండేదో చిత్రించడమే గాక, చెదిరిన ఒక ఉమ్మడి కుటుంబ కథ చెప్పారు. గంటలోపు నిడివిగల ఈ కథ చాలా బలమైనదని అప్పట్లో ప్రశంసలందాయి. దీన్ని కె. మన్మోహన్ నిర్మిస్తే, దేవ్ కుమార్ బోస్ అనే బెంగాలీ దర్శకత్వం వహించాడు. అంటే తొలి మణిపురి సినిమాకి దర్శకుడు బెంగాలీ అన్నమాట. ఆరంబం సమరేంద్ర రాసిన ‘తీర్థ్ జాతర’ అనే నాటకం ఆధారంగా ఈ సినిమా నిర్మించారు. ఇందులో నటీనటులు మణిపురి నాటక రంగ కళాకారులే. అరింబం శ్యాంశర్మ సంగీత మిచ్చాడు.

2012 లో ‘ఫ్రైడ్ ఫిష్, చికెన్ సూప్ అండ్ ఏ ప్రీమియర్ షో’ అన్న టైటిల్ తో మణిపూర్ సినిమా చరిత్రని వర్తమాన దృశ్యంతో మిళితం చేసి ఒక అపూర్వ సృష్టి చేసింది దర్శకురాలు మమతా మూర్తి. తీవ్రవాదులు ఏ బాలీవుడ్ సినిమాలనైతే నిషేధించారో ఆ బాలీవుడ్ నుంచే సరాసరి మణిపూర్ వచ్చి సినిమా తీసింది దర్శకురాలు. తీవ్రవాద ప్రభావిత మణిపురీ సినిమా తీరు తెన్నుల్నే డాక్యూ డ్రామాగా రికార్డు చేయదల్చుకుంది. ఇందుకుగాను కళలు/సంస్కృతి విభాగంలో జాతీయ ఉత్తమ చలన చిత్రం అవార్డు, ముంబాయి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో అంతర్జాతీయ జ్యూరీ అవార్డు, ఆ తర్వాత కేరళ సైన్స్ చిత్రోత్సవాల్లో ఉత్తమ చిత్రం అవార్డూ పొందింది.

ఇది సినిమాలో సినిమా. ‘21 వ శతాబ్దపు కుంతి’ అనే పేరుతో మణిపురీ సినిమా బృందం సినిమా తీసి ప్రదర్శించే కథ. కథతో చరిత్ర. ఈ బృందం తీసే సినిమా కుంతీదేవి గురించి కాదు. సినిమాలో సినిమాగా ఉదాహరణకి వాడుకున్న ‘21 శతాబ్దపు కుంతి’ అనే సినిమా నిర్మాణ ప్రక్రియ. స్థూలంగా కుంతీదేవి సంతానంలో ఇద్దరు తూర్పు పడమర (తీవ్రవాది- సైనికుడు) లయ్యే కాన్సెప్ట్. దర్శకురాలు మణిపూర్ లో ఈ సినిమా నిర్మాణ ప్రక్రియ ఎలా వుంటుందో చూపిస్తూ, మధ్యమధ్యలో మణిపూర్ సినిమా - రాజకీయ- తీవ్రవాద చరిత్ర, దాని పరిణామ క్రమం రికార్డు చేస్తూ వుంటుంది, వాటి తాలూకు క్లిప్పింగ్స్ వేస్తూ. మణిపూర్ సినిమాల విషయానికొస్తే, నేటి డిజిటల్ సినిమాల దగ్గర్నుంచి, వెనక్కి చరిత్రలో 1891 లో జరిగిన మొదటి మ్యాజిక్ లాంతరు అనే ప్రక్రియతో వేసిన ‘సినిమా’ ప్రదర్శన చూపిస్తుంది. రాజకీయాలకి వస్తే 1891 లోనే వేరే దేశంగా వున్న మణిపూర్ లో జరిగిన బ్రిటిష్ పోరాటం దగ్గర ఎత్తుకుంటుంది. బ్రిటన్ ప్రతినిధిగా వున్న ఫ్రాంక్ గ్రిమ్ వుడ్, మణిపూర్ రాజవంశంలో తిరుగుబాటుని అణిచివెయ్యడానికి పూనుకుంటాడు. అతడి భార్య ఎథెల్ సెయింట్ క్లెయిర్ గ్రిమ్ వుడ్ ని ఈ సందర్భంగా మణిపూర్ హీరోయిన్ గా పేర్కొన్నారు.

ఇలా 1948 లో మణిపూర్ సంస్థానం విలీనం, దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన తీవ్రవాద చరిత్ర, 1972 నుంచి మణిపూర్ సినిమా నిర్మాణాల ప్రారంభం, బాలీవుడ్ ప్రభావం, బాలీవుడ్ సినిమాల నిషేధం, స్థానిక మణిపూర్ సినిమాల వృద్ధి...ఇలా చూపించుకుంటూ వస్తుంది దర్శకురాలు.

ఈ డాక్యూ డ్రామాని వీక్షించడం మంచి సినిమాటిక్ అనుభవం, ఎడ్యుకేషన్. దీని నిర్మాత మధుశ్రీ దత్తా, కెమెరా హోదమ్ టామీ సింగ్, ఎడిటింగ్ రిఖవ్ దేశాయ్, సంగీతం అర్జున్ సేన్, దర్శకత్వం మమతా మూర్తి. దీన్ని యూట్యూబ్ లో యాభై రూపాయలు చెల్లించి చూడొచ్చు.


Full View


Tags:    
Advertisement

Similar News