ఎంత హిట్టయితే అంత పిండుకోవచ్చు!

మలయాళం స్మాల్, మీడియం బడ్జెట్ సినిమాలు ఎంత హిట్టయితే అంత ఓటీటీల నుంచి ఆదాయం గ్యారంటీ అంటున్నారు. మలయాళం అనే కాదు ఇంకే భాషలో చిన్న సినిమాల కైనా ఇదే వర్తిస్తుంది.

Advertisement
Update:2024-05-28 15:03 IST

మలయాళం స్మాల్, మీడియం బడ్జెట్ సినిమాలు ఎంత హిట్టయితే అంత ఓటీటీల నుంచి ఆదాయం గ్యారంటీ అంటున్నారు. మలయాళం అనే కాదు ఇంకే భాషలో చిన్న సినిమాల కైనా ఇదే వర్తిస్తుంది. కానీ ఇతర భాషల్లో స్మాల్, మీడియం బడ్జెట్ సినిమాల పరిస్థితి వేరు. అవి హిట్టవుతున్న దాఖలాలు లేవు. తెలుగులో హిట్టయ్యే ప్రసక్తే లేదు. చిరునామా లేకుండా ఎటు పోతున్నాయో కూడా తెలీదు. ఒకవేళ థియేట్రికల్ గా ఫ్లాపయిన వీటిని ఓటీటీలకి బేరం పెడితే వచ్చే హక్కుల ఆదాయం అంతంత మాత్రమే. ఇది కూడా అన్ని చిన్న సినిమాలకీ సాధ్యం కాదు. అయితే హిట్టయితే మాత్రం ఓటీటీల నుంచి డబ్బులే డబ్బులు!

సూపర్ హిట్టయిన మలయాళం సినిమాలు రూపాయికి పావలా వంతున ఓటీటీల నుంచి కళ్ళ జూస్తున్నాయి. ఇవే సినిమాలని విడుదలకి ముందు ఓటీటీలకి అమ్మి అడ్వాన్సులు తీసుకునే పరిస్థితి వుండదు. అది స్టార్ సినిమాలకే సాధ్యమవుతుంది. విడుదలైన చిన్న సినిమా హిట్టయితేనే ఓటీటీలు ఓకే అంటాయి. ఒకవేళ ఇవే చిన్న సినిమాలు మామూలు రేంజిలో హిట్టయితే ఓటీటీలకి ఫర్వాలేదు. వూహించని రేంజిలో హిట్టయితే మాత్రం చమురు బాగా వదులుతుంది! అప్పుడు ప్రీ రిలీజ్ అగ్రిమెంట్ ఎందుకు చేసుకోలేదా అని బాధపడడమే మిగులుతుంది.

మలయాళం ‘ప్రేమలు’, ‘మంజుమ్మల్ బాయ్స్’ లతో జరిగింది ఇదే. తమిళం ‘లవర్’ తో కూడా ఇదే జరిగింది. వీటిని థియేట్రికల్ విడుదలకి ముందు ఓటీటీలకి అమ్మే ప్రయత్నం చేయలేదు. ఎలాగూ చిన్న సినిమాలకి ప్రీ రిలీజ్ ఓటీటీ అగ్రిమెంట్లు వుండవు కాబట్టి. కానీ థియేట్రికల్ విడుదలతో వందల కోట్లు కలెక్షన్లు రావడంతో పంట పండింది. రూ. 3 కోట్లతో తీసిన ‘ప్రేమలు’ రూ. 130 కోట్లు వసూలు చేసింది. రూ. 20 కోట్లతో తీసిన ‘మంజుమ్మల్ బాయ్స్’ రూ. 242 కోట్లు వసూలు చేసింది. రూ.5 కోట్లతో తీసిన ‘లవర్’ రూ. 15 కోట్లు వసూలు చేసింది.

అంటే వీటి ఓటీటీ రేట్లు థియేట్రికల్ కలెక్షన్స్ లో 25 శాతంగా లెక్కకడితే ఎంత వస్తుందో అంచనా వేసుకోవచ్చు. ‘ప్రేమలు’ కి రూ. 33.5 కోట్లు, ‘మంజుమ్మల్ బాయ్స్’ కి రూ. 60 కోట్లు, ‘లవర్’ కి రూ. 3.75 కోట్లు. ఇవే గనుక ప్రీ రిలీజ్ అగ్రిమెంట్లు జరిగి బార్గెయినింగ్ పవర్ ఓటీటీల చేతిలో వుంటుంది కాబట్టి లక్షల్లోనే అగ్రిమెంట్లు జరిగి వుండేవి.

అయితే ప్రీ రిలీజ్ అగ్రిమెంట్లు జరిగిన చిన్న సినిమాలు థియేట్రికల్ రిలీజ్ లో ఫ్లాపయితే లాభపడతాయి. ఓటీటీల నుంచి రావాల్సిన పేమెంట్ ఎటూ పోదు కాబట్టి. ఇలా థియేటర్లలో విడుదలకి ముందు డీల్‌ని లాక్ చేసి, ఆపై ఫ్లాపయితే అవి ఖచ్చితంగా ప్రయోజనకర స్థితిలోనే వుంటాయి. బాక్సాఫీసు హిట్టయిన చిన్న సినిమాలకి చెల్లించడానికి ఓటీటీలు ఎల్లప్పుడూ సిద్ధంగా వుంటాయి, ప్రత్యేకించి తమ టార్గెట్ ప్రేక్షకులు దానితో కనెక్ట్ అవుతారని భావిస్తే.

చిన్న సినిమాలని ఒక భాషలో తప్ప వివిధ భాషల్లో నిడుదల చెయ్యరు. ఒక భాషలో హిట్టయిన వీటిని ఇతర భాషల్లో చూసేందుకు ఓటీటీలు డబ్బింగ్ వెర్షన్లు స్ట్రీమింగ్ చేసి వ్యూస్ పెంచుకుంటాయి. డిస్నీ+ హాట్‌స్టార్ ‘మంజుమ్మల్ బాయ్స్’ ని మలయాళం తో బాటు హిందీ, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో ప్రసారం చేస్తోంది.

చిన్న సినిమాలు వందల కోట్లు వసూలు చేయడం చాలా అరుదు. కనీసం పది కోట్లు బాక్సాఫీసు వసూలు చేసే స్థాయిలో తీసినా ఆపైన రెండు మూడు కోట్లు ఓటీటీల నుంచి రాబట్టుకోవచ్చు. ఇది కూడా జరగడం లేదు. నాసి సినిమాలు ఓ అయిదారు ఆటలు ఖాళీ థియేటర్లలో వేసి తీసేసి, రిలీజ్ చేశామన్న తృప్తి మిగుల్చుకోవడమే. వీటి టైటిల్ రిజిస్ట్రేషన్ కయ్యే ఖర్చులకి కూడా కలెక్షన్లు రావు.

Tags:    
Advertisement

Similar News