తెలుగులో విరగదీస్తున్న ‘ప్రేమలు’ జోరు!

యువ నటులతో రూ. 3 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన రోమ్-కామ్ ప్రేమలు’ వసూళ్ళలో ఆశ్చర్యకరమైన విజేతగా నిలుస్తుందని ఎవరూ ఊహించి వుండరు.

Advertisement
Update:2024-03-16 16:15 IST

యువ నటులతో రూ. 3 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన రోమ్-కామ్ ప్రేమలు’ వసూళ్ళలో ఆశ్చర్యకరమైన విజేతగా నిలుస్తుందని ఎవరూ ఊహించి వుండరు. నస్లెన్ గఫూర్, మమితా బైజూ, శ్యామ్ కుమార్ నటించిన గిరీష్ ఎడి దర్శకత్వం వహించిన ‘ప్రేమలు’ మలయాళంలో ఇప్పటికే థియేటర్లలో 26 రోజులు పూర్తి చేసుకుంది. నిన్నటితో ప్రపంచవ్యాప్తంగా రూ.90 కోట్లు వసూలు చేసిందని బాక్సాఫీసు రిపోర్టులు చెబుతున్నాయి. ఒక్క ఇండియా నుంచే ఈ సినిమా రూ. 70 .5 కోట్లు కొల్లగొట్టింది. భావనా స్టూడియోస్ బ్యానర్‌పై ఫహద్ ఫాసిల్- దిలీష్ పోతన్ నిర్మించిన ఈ సినిమా థియేటర్ రన్ పూర్తయ్యే సమయానికి బంపర్ హిట్ అవుతుందని అంచనా. మలయాళంలో తొలిరోజు రూ.9 లక్షలు మాత్రం వసూలు చేసిన ఇది మొదటి వారం తర్వాత రూ. 12.6 కోట్లు వసూలు చేసింది. దీనికి వచ్చిన విపరీతమైన మౌత్ పబ్లిసిటీ ఈ సక్సెస్ కి ప్రధాన కారణమని భావిస్తున్నారు.

రెండవ వారంలో మరింత దూసుకుపోతూ రూ. 14.85 కోట్లు వసూలు చేసింది. ఇదిలా వుంటే, ‘ప్రేమలు’ తెలుగు వెర్షన్ పంపిణీ హక్కుల్ని ఎస్ఎస్ రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ పొందారు. మార్చి 8 న విడుదలైన తెలుగు వెర్షన్ కూడా హిట్టయ్యింది. దీనికి ముందు రెండు వారాల్లో విడుదలైన తెలుగు సినిమాలు వరుసగా ఫ్లాప్ అవగా, ఇది మాత్రం పెద్ద హిట్టయిపోయింది. మార్చి 8 న దీంతో బాటు విడుదలైన విశ్వక్ సేన్ ‘గామి’, గోపీ చంద్ ‘భీమా’ లని తలదన్నే విధంగా రెండో వారంలోకి ప్రవేశించింది. ‘గామి’ తొలి వారాంతం రూ. 22 కోట్లు గ్రాస్ తో బ్రేక్ ఈవెన్ తో గట్టెక్కిపోయినా, ఆ తర్వాత డ్రాప్ అయిపోయింది. ‘భీమా’ బీసీ సెంటర్లలలో మంచి పనితీరు కనబర్చినా, రెండో వారంలో నష్టాల్లోపడింది. కానీ ‘ప్రేమలు’ ఈ వారం 15 వ తేదీ తాజాగా విడుదలైన ‘షరతులు వర్తిస్తాయి’, ‘లంబసింగి’, ‘రజాకార్’, ‘తంత్ర’ లని సైతం పక్కకు నెట్టేసి గట్టి హిట్ అన్పించుకుంది.

సినిమాలో చూస్తే ఏమీ లేదు. కానీ సినిమా విరగదీసి ఆడుతోంది. హైదరాబాద్‌లో తీసిన మలయాళం సినిమా అన్న పబ్లిసిటీ తో తెలుగు మార్కెట్ లోకి వస్తే, తీరా అందులో హైదరాబాద్ నామమాత్రంగా వుంటే, తెలుగు ప్రేక్షకులు ప్రశ్నించకుండా చూస్తున్నారు. ఒక ఐటీ ప్రొఫెషనల్‌తో ప్రేమలో పడే నిరుద్యోగ యువకుడి చుట్టూ కథ తిరుగుతుంది. కథ ఆహ్లాదకరమైన వాతావరణంలో, హాస్య ప్రధానంగా, టీనేజర్ల హృదయాల్ని తాకే విధంగా సహజ ధోరణిలో వుండడంతో సక్సెస్ బాట పట్టింది. ‘తన్నీర్ మథన్ దీనంగల్’ (2019), సూపర్ శరణ్య (2022) విజయాల తర్వాత దర్శకుడు గిరీష్ ఏడీకి ఇది మూడో సినిమా.

ఇదిలా వుంటే, ఫిబ్రవరిలో విడుదలైన మూడు మలయాళం సినిమాలు- భ్రమయుగం, మంజుమ్మెల్ బాయ్స్, ప్రేమలు- మూడూ బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్టయ్యాయి. మమ్ముట్టి నటించిన బ్లాక్ అండ్ వైట్ ప్రయోగాత్మక పీరియడ్ హార్రర్ థ్రిల్లర్ ‘భ్రమయుగం’ తెలుగు డబ్బింగ్ మాత్రం ఫ్లాప్ అయింది. ‘ప్రేమలు’ హిట్టయ్యింది. అలాగే యువ జీవితాల సర్వైవల్ డ్రామా ‘మంజుమ్మెల్ బాయ్స్’ ని కూడా తెలుగులో విడుదల చేస్తే సక్సెస్ అయ్యే అవకాశముంది. రూ. 5 కోట్లతో తీసిన ‘మంజుమ్మెల్ బాయ్స్’ ఇప్పటికే మలయాళంలో 100 కోట్ల రూపాయల మార్కుని నమోదు చేసింది. రూ. 27 కోట్లతో తీసిన ‘భ్రమయుగం’ మలయాళం రూ. 80 కోట్లు, ‘ప్రేమలు’ రూ. 106 కోట్లూ ఇప్పటి వరకు వసూలు చేశాయి.

తెలుగులో సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో హైదరాబాద్‌లోని మల్టీప్లెక్సుల్లో ఆధిపత్యం చెలాయించింది. గత రాత్రి షోలలో ఇతర విడుదలల కంటే ముందుంది. స్క్రీనింగ్‌ల సంఖ్యతో బాటు వసూళ్ళూ పెరుగుతున్నందున, ఇది మూడు వారాల స్థిరమైన రన్‌ ని పొందగలదని భావిస్తున్నారు. ఇది బ్రేక్ ఈవెన్ ని కూడా దాటేసి లాభాల్లోకి ప్రవేశించింది. ఫుల్ రన్ లో రూ. 10 కోట్లు రాబట్టుకోగలదని అంచనా వేస్తున్నారు.

తెలుగు సినిమాలు మలయాళంలో అల్లు అర్జున్ వుంటే తప్ప ఆడవు. మలయాళం సినిమాలు తెలుగులో అడవు. రీమేక్ చేయాల్సిందే. అలాటిది ‘ప్రేమలు’ తెలుగు డబ్బింగ్ సూపర్ హిట్టవడమన్నది యూత్ కోసం తెలుగు సినిమాలు ఎలా తీయాలో ఒక దారి చూపుతున్నట్టుగా వుంది.


Full View


Tags:    
Advertisement

Similar News