మలయాళ ‘జైలర్’ కథ సు(దు)ఖాంతం!

ఆగస్టు 18న 85 థియేటర్లలో విడుదలైన సక్కీర్ ‘జైలర్’ నిన్న సోమవారం మూడు రోజులకి కలిపి 37 లక్షలు మాత్రమే వసూలు చేసింది. దీన్ని 5 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు.

Advertisement
Update:2023-08-21 15:40 IST

కేరళలో తమిళ ‘జైలర్’, మలయాళ ‘జైలర్’ పరస్పరం ఢీకొనే పరిస్థితి మొత్తానికి పరిష్కారమై ప్రశాంత వాతావరణం ఏర్ప‌డింది. ఆగస్టు 10న రజనీకాంత్ నటించిన ‘జైలర్’ విడుదలని వ్యతిరేకిస్తూ, అదే రోజు తన సినిమా విడుదల చేసుకుంటున్న మలయాళ ‘జైలర్’ దర్శకుడు కోర్టు కెక్కిన వివాదం తెలిసిందే. మలయాళ దర్శకుడు సక్కీర్ మదతిల్ ‘జైలర్’ టైటిట్‌ని తను ముందుగా రిజిస్టర్ చేయించినందున, రజనీ ‘జైలర్’ టైటిల్‌ని మార్చమని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ని అభ్యర్థించాడు. కానీ, సన్ పిక్చర్స్ అభ్యర్థనని తిరస్కరించి అదే టైటిల్ తో విడుదలకి సిద్ధమైంది. దీనిపై దర్శకుడు సక్కీర్ మద్రాసు హైకోర్టుని ఆశ్రయించాడు. అయితే మనసు మార్చుకుని విడుదల వాయిదా వేసుకున్నాడు.

వాయిదా వేయడానికి కేరళలో రజనీ ‘జైలర్’ కి భారీగా థియేటర్లు బుక్కైపోవడమే కారణమని చెప్తున్నారు. దీంతో విధిలేక దర్శకుడు సక్కీర్ తన ‘జైలర్’ ని 18 తేదీన విడుదల చేస్తున్నట్టు ప్రకటించాడని మీడియా కథనం. 18వ తేదీ విడుదల సందర్భంగా ఫేసు బుక్ లో పోస్టు కూడా చేశాడు. ‘మలయాళ ‘జైలర్’ ఈ రోజు కేరళతో పాటు గల్ఫ్ దేశాల్లో విడుదలవుతోంది. అందరూ తప్పక చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ సినిమా చాలా కాలంగా సాగుతున్న పోరాటం. నా సినిమాకు మీరే, ప్రేక్షకులే సూపర్‌స్టార్లు’ అని పేర్కొన్నాడు.

విశేషమేమిటంటే, సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్’ క్లయిమాక్స్ షూటింగ్ కేరళలోనే జరిగింది. కేరళలోని చలకుడిలో మార్చి నెలలో క్లయిమాక్స్ దృశ్యాలు చిత్రీకరించారు. కేరళలోనే క్లయిమాక్స్ ముగించుకుని, కేరళలో ఆగస్టు 10 న విడుదలవుతూ సక్కీర్ నెత్తిన పిడుగులు కురిపించింది. నిజానికి రజనీ ‘జైలర్’ టైటిల్ 2022లోనే వార్తల్లో వుంది. 2022 ఆగస్టులో ఫస్ట్ లుక్ కూడా లాంచ్ చేశారు. అప్పుడు మేల్కొనకుండా సక్కీర్ ఏం చేస్తున్నట్టు? ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లతో బాక్సాఫీసు తుపాను సృష్టిస్తున్న రజనీ ‘జైలర్’ కేరళలో 50 కోట్ల వసూళ్ళు దాటిపోయింది.

ఆగస్టు 18న 85 థియేటర్లలో విడుదలైన సక్కీర్ ‘జైలర్’ నిన్న సోమవారం మూడు రోజులకి కలిపి 37 లక్షలు మాత్రమే వసూలు చేసింది. దీన్ని 5 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. దీని నిర్మాత ఎస్.కె.మహమ్మద్. ధ్యాన్ శ్రీనివాసన్, దివ్యా పిళ్ళై, మనోజ్ కె జయన్, ఉన్ని రాజా, బిను అద్మాలి మొదలైనవారు నటించిన ఈ మూవీపై వెలువడ్డ రివ్యూలు సంతృప్తికరంగా లేవు.

ఇది 1956-57 మధ్య కాలంలో సాగే ఒక జైలర్ కథ. జైలులో ఐదుగురు కరుడు గట్టిన నేరస్తుల్ని మంచి మనుషులుగా మార్చే జైలర్ కథ. సినిమాలో టైటిల్స్ ప్రారంభంకాక ముందే పేలవమైన కథనంతో నిరాశని సృష్టిస్తుందని రివ్యూలు వచ్చాయి. యువ జైలర్ శాంతారామ్ అసాధారణ ప్రయోగం ద్వారా నేరస్తుల్ని మార్చడానికి సాహసోపేతమైన పథకాన్ని రూపొందిస్తాడని, అయితే ఉద్దేశ్యపూర్వకంగా కథా కాలం 1950 ల మధ్యలో వుంచారనీ, కథాంశం సమకాలీన నేపథ్యంలో సమానంగా వృద్ధి చెందే అవకాశం వున్నప్పటికీ, పీరియాడిక్‌ ఫిలిమ్ గా తీయడం కథనాన్ని సుసంపన్నం చేయలేదని రివ్యూల్లో రాశారు. గ్రామంలో భూస్వామ్య దొర ఉనికి ఈ కాలపు చిత్రీకరణకి దివ్యంగా నిలుస్తుందనీ, అయితే అరకొర పరిజ్ఞానంతో, బలహీన దర్శకత్వంతో - 124 నిమిషాల రన్‌టైమ్‌తో, ప్రేక్షకుల ఆసక్తిని నిలుపుకోవడానికి లేదా భావోద్వేగాల్ని రేకెత్తించడానికి చాలా తిప్పలుపడ్డారనీ, రివ్యూల్లో అసంతృప్తి వ్యక్తమైంది.

టైటిల్ వివాదం ఎలాగో సుఖాంతమైనా, సినిమాలో అసలు విషయం దగ్గరికొచ్చేసరికి అరకొర కలెక్షన్స్ తో కథ దుఖాంతమైంది! 

Tags:    
Advertisement

Similar News