Bholaa Shankar | చిరంజీవి సూచనలతో మ్యూజిక్ చేసిన స్వరసాగర్
Bholaa Shankar - కెరీర్ లో తొలిసారి భోళాశంకర్ లాంటి పెద్ద సినిమాకు సంగీతం అందించే ఛాన్స్ అందుకున్నాడు మహతి స్వరసాగర్. ఆ సినిమా గురించి మహతి ఏమంటున్నాడో చూద్దాం.
మణిశర్మ వారసుడిగా కెరీర్ ప్రారంభించాడు, అతడి తనయుడు మహతి స్వరసాగర్. వస్తూనే ఛలో రూపంలో అతిపెద్ద మ్యూజికల్ హిట్టిచ్చాడు. వరుసగా అవకాశాలు అందుకున్నాడు. అయితే కెరీర్ లో తొలిసారి ఓ పెద్ద సినిమాకు వర్క్ చేసే అవకాశం అందుకున్నాడు. అదే భోళాశంకర్.
చిరంజీవి లాంటి పెద్ద హీరో సినిమాకు కెరీర్ స్టార్టింగ్ లోనే మ్యూజిక్ అందించే ఛాన్స్ అందుకున్నాడు మహతి స్వరసాగర్. దీనిపై అతడు తాజాగా స్పందించాడు. చాలా ఒత్తిడి ఎదుర్కొన్నానని చెబుతూనే, తనకు చిరంజీవి ఇచ్చిన సూచనలు బాగా పనిచేశాయని అన్నాడు.
"ఈ సినిమా ట్రావెల్‌లో చిరంజీవిగారు చాలా ఐడియాలు ఇచ్చారు. ఆయన్ను కలవడమే గొప్ప అనుభవం. ఈ జర్నీలో చాలా టెన్షన్ పడ్డా. చాలా ట్యూన్స్ చేశా, ఒప్పుకుంటారో లేదో అనే ఆలోచన ఉండేది. అలా తొలిసారి ఓరోజు సెట్ లో కలిసి ట్యూన్ వినిపించా. విన్నాక చెవిలో తుప్పు వదిలించావ్! అనే ప్రశంస చిరంజీవి నుంచి వచ్చింది. దాంతో మరింత ధైర్యం వచ్చింది. అలా ఒక్కో ట్యూన్ పూర్తిచేసుకుంటూ ముందుకుసాగాను."
ఇక చిరంజీవి లాంటి పెద్ద నటుడికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించడం కూడా సవాల్ అనిపించిందన్నారు స్వరసాగర్. అయితే ఈ విషయంలో తన తండ్రి మణిశర్మ సూచనలు, సలహాలు బాగా ఉపయోగపడ్డాయని తెలిపారు.
"బ్యాక్‌గ్రౌండ్ అనేది సందర్భానుసారంగా చేయాలి. చిరంజీవి పాటలంటే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. డాన్స్ మూమెంట్స్ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. వేదాళం సినిమా చూశా. అందులో అనిల్ ఇచ్చిన సంగీతం అద్భుతంగా ఉంది. దాన్నుంచి చిరంజీవికి నేను ఏమి చేయగలను అనే దానిపై ఎక్కువగా ఫోకస్ పెట్టాను. అలా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాను. అది చాలా బాగా వచ్చింది."
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పరంగా చిరంజీవి ఇంట్రో సీన్ కు ర్యాప్ థీమ్ తో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడట. అది తన బెస్ట్ వర్క్ అంటున్నాడు మహతి స్వరసాగర్.