‘గుణ’ రీరిలీజ్ పై హైకోర్టు స్టే!

1991 లో కమల్‌హాసన్‌ నటించిన ‘గుణ’ సినిమా రీ-రిలీజ్‌పై మద్రాసు హైకోర్టు స్టే విధించింది.

Advertisement
Update:2024-07-11 14:29 IST

1991 లో కమల్‌హాసన్‌ నటించిన ‘గుణ’ సినిమా రీ-రిలీజ్‌పై మద్రాసు హైకోర్టు స్టే విధించింది. సంతాన భారతి దర్శకత్వంలో రూపొందిన ‘గుణ’ ఇప్పటికీ అభిమానుల్ని పాపులర్ మూవీగా అలరిస్తోంది. ఇటీవల సూపర్ హిట్టయిన ‘మంజుమ్మల్ బాయ్స్’ మలయాళం మూవీ లో ‘గుణ’ ప్రస్తావన, ‘గుణ’ లో సూపర్ హిట్టయిన ఇళయరాజా స్వరపర్చిన పాట ‘కన్మణి అన్బోడు కదలన్’ ని సినిమాలో ఉపయోగించడం చూసి ప్రేక్షకుల్లో ‘గుణ’ పై ఉత్సాహం పెల్లుబికింది. ఈ పాటని సినిమాలో ఉపయోగించడంపై ఇళయరాజా కోర్టు కెళ్ళిన విషయం తెలిసిందే. 1991 లో ‘గుణ’ సినిమాని కొడైకెనాల్ సమీపంలోని గుహల్లో తీశారు. దీంతో ఈ గుహలు పెద్ద పర్యాటక కేంద్రంగా మారి, గుణ గుహలుగా ప్రసిద్ధిపొందాయి. వీటిలో జరిగిన ఒక ప్రమాద కథతోనే ‘మంజుమ్మల్ బాయ్స్’ తీశారు. ఇది రూ. 250 కోట్ల రికార్డు కలెక్షన్లు సాధించింది. ఈ విజయంతో ‘గుణ’ సినిమాని థియేటర్లలో మళ్ళీ విడుదల చేయాలనే డిమాండ్ ప్రేక్షకుల్లో నెలకొంది.

కానీ ఆనాడు ‘గుణ’ సగటు బాక్సాఫీసు రన్ తోనే సరిపుచ్చుకుంది. తెలుగులో ఇదే టైటిల్ తో విడుదలైంది. ‘గుణ’ తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు, ఫిలిమ్ ఫేర్ అవార్డు, రెండు సినిమా ఎక్స్ ప్రెస్ అవార్డులు గెలుచుకుంది. ఇప్పుడు ‘మంజుమ్మల్ బాయ్స్’ ఘనవిజయంతో ‘గుణ’ కొచ్చిన డిమాండ్ చూసి ప్రపంచ వ్యాప్తంగా రీరిలీజ్ చేసేందుకు పిరమిడ్ ఆడియో గ్రూప్ ప్లాన్ కూడా చేసింది.

అయితే రీరిలీజ్ చేయకుండా, దాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించకుండా పిరమిడ్ ఆడియో ఇండియాని మద్రాసు హైకోర్టు నిరోధించింది. ప్రస్తుతం కాపీరైట్ కి తను హక్కుదారుడ్నని ఘనశ్యామ్ హేమ్‌దేవ్ వేసిన పిటిషన్‌పై జస్టిస్ పి వేల్మురుగన్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. హేమ్‌దేవ్ సినిమా పూర్తి హక్కులకు తానే పూర్తి యజమాని అని కోర్టుకి విన్నవించాడు. సినిమాపై వాణిజ్య పరంగా ఆర్జించిన లాభాలను సరెండర్ చేసేలా పిరమిడ్ ని, ఎవర్‌గ్రీన్ మీడియాని ఆదేశించాలని కోరాడు.

ఈ వ్యాజ్యాన్ని విచారించిన మద్రాసు హైకోర్టు ‘గుణ’ సినిమాని థియేటర్లలో మళ్ళీ విడుదల చేయడంపై మధ్యంతర నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై జూలై 22లోగా స్పందించాలని పిరమిడ్ ని, ఎవర్‌గ్రీన్ మీడియాని హైకోర్టు ఆదేశించింది.

‘త్రిభువన్ మిశ్రా సీఏ టాపర్’ వెబ్ సిరీస్ కి నోటీసులు?

నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారమవుతున్న ‘త్రిభువన్ మిశ్రా సీఏ టాపర్’ వెబ్ సిరీస్ నిర్మాతకి లేదా దర్శకుడుకి ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) లీగల్ నోటీసులు పంపే అవకాశముంది. ఈ వెబ్ సిరీస్ చార్టర్డ్ అకౌంటెంట్లకి, సీఏ విద్యార్ధులకీ తీవ్ర ఆగ్రహం తెప్పించేలా వుందని ఫిర్యాదు. వృత్తి ప్రతిష్టని దెబ్బతీసే లక్ష్యంతో వున్న సిరీస్‌కి సంబంధించిన బాధ్యులపై న్యాయపరమైన చర్యలు తప్పవని అంటున్నారు. సీఎంపీ ఛైర్మన్, సీఏ డాక్టర్ రోహిత్ రుత్వాటియా అగర్వాల్ ఈ మేరకు సోషల్ మీడియా వేదిక x లో ట్వీట్ చేశారు.

‘ఇలాంటివి అస్సలు ఆమోదయోగ్యం కాదు. పరువు నష్టం విషయంలో మాది జీరో టాలరెన్స్ పాలసీ’ అని ఆయన అన్నారు. ఈ వెబ్ సిరీస్ పిచ్చితనంతో, సిగ్గులేనితనంతో చిత్రీకరణలు చేసిందని, ఈ రోజుల్లో చార్టర్డ్ అకౌంటెంట్లు ప్రతి ఒక్కరికీ సాఫ్ట్ టార్గెట్ అనీ, కేవలం మా పరువు తీయడానికీ, డబ్బు సంపాదించడానికీ వీటికి పాల్పడుతున్నారని విమర్శించారు.

బ్యాంకుల సంక్షోభం కారణంగా సీఏ టాపర్ త్రిభువన్ మిశ్రా సెక్స్ వర్క్ ని చేపట్టే కథతో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. ఇందులో మానవ్ కౌల్, తిలోత్తమా షోమ్, సుభ్రజ్యోతి బరాత్ నటించారు. దర్శకత్వం పునీత్ కృష్ణ. 


Full View


Tags:    
Advertisement

Similar News