Madhubala: కామెడీ పాత్రలు కావాలి
Madhubala: మంచి కామెడీ పాత్రలు ఉంటే చేస్తానంటోంది మధుబాల. ఈ విషయంలో తనకు భాషా బేధం లేదంటోంది. ఏ లాంగ్వేజ్ అయినా కామెడీ రోల్స్ దొరికితే చాలంటోంది.
సీనియర్ నటి మధుబాల తన మనసులో మాట బయటపెట్టింది. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించిన ఈ భామ, ఇప్పుడు క్యారెక్టర్ రోల్స్ చేస్తోంది. అయితే రెగ్యులర్ గా చేసే తల్లి పాత్రలు లాంటివి కాకుండా మంచి స్టఫ్ ఉన్న పాత్రలు చేయాలని ఉందని, మరీ ముఖ్యంగా కామెడీ రోల్స్ చేస్తానని చెబుతోంది.
"నేను బయట చాలా ఫన్నీగా ఉంటాను. ప్రేమ దేశంలో సినిమాలో నా పాత్ర కామెడీ యాంగిల్‌లో ఉండదు. కానీ తమిళ్‌లో నేను స్వీట్ కార్న్ కాఫీ అనే వెబ్ సిరీస్‌లో ఫుల్ కామెడీ రోల్ చేశాను. నేను మామూలుగానే సరదాగా ఉంటాను. ఆ వెబ్ సిరీస్ చూశాక.. అందరూ నా కామెడీ టైమింగ్ బాగుందని అన్నారు. నాకు ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ చేయాలని ఉంది."
హీరోయిన్ గా తను కొనసాగినప్పుడు ఎలాంటి పోటీ వాతావరణం ఉందో, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుల మధ్య కూడా అలాంటి పోటీ వాతావరణమే ఉందంటోంది మధుబాల. క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎక్కువమంది ఉన్నారని, చాలా మంచి నటీనటులు ఉండడంతో పోటీ తీవ్రంగా ఉందంటోంది.
ఈ విషయంలో తను మాత్రం కర్మ సిద్ధాంతాన్నే నమ్ముతానంటోంది మధుబాల. తనకు రాసిపెట్టి ఉంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయని, తను వెంపర్లాడడం మానేశానని చెబుతోంది.