కీర్తి సురేశ్ పెళ్లి ముహూర్తం ఫిక్స్
వచ్చే నెలలోనే గోవాలో వెడ్డింగ్ జరుగుతుందన్న నటి
నటి కీర్తి సురేశ్ పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. వచ్చే నెలలోనే ఆమె వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు ఆమె శుక్రవారం స్వయంగా వెల్లడించారు. కీర్తి తన కుటుంబసభ్యులతో కలిసి ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆమెకు రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఈ సందర్భంగా పెళ్లి ముచ్చట బైటపెట్టారు. వచ్చే నెలలోనే తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారు. గోవాలో వెడ్డింగ్ జరుగుతుందన్నారు. అలాగే తాను నటిస్తున్న హిందీ మూవీ కూడా వచ్చే నెలలో రిలీజ్ కానున్నదని, అందుకే స్వామి వారి దర్శనం కోసం వచ్చానని తెలిపారు.
కీర్తి సురేశ్ ప్రస్తుతం 'బేబీ జాన్' బిజీగా ఉన్నారు. ఈ మూవీతో ఆమె బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. వరుణ్ ధావన్ హీరోగా ఇది తెరకెక్కుతున్నది. కోలీవుడ్‌లో రిలీజైన 'తెరీ' రిమేక్‌గా ఈ సినిమా సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరోవైపు కీర్తిసురేశ్ ఇటీవల తన రిలేషన్‌షిప్ స్టేట్ గురించి ఆసక్తికర విషయాన్ని బైటపెట్టారు. తన ఫ్రెండ్ ఆంటోనీతో ప్రేమలో ఉన్నట్లు ప్రకటించారు. ఆయనతో దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. సుమారు 15 ఏళ్ల తమ ఫ్రెండ్‌షిప్ ఇకపై జీవితాంతం కొనసాగనున్నదని తెలిపిన సంగతి తెలిసిందే.