వచ్చేస్తున్నారు కన్నడ హీరోయిన్లు...

ఇలా కొత్త తరం కన్నడ హీరోయిన్లుగా ఇప్పుడు రశ్మికా మందన్న, పూజా హెగ్డే టాప్ రేంజికి వచ్చేశారు.

Advertisement
Update:2022-09-01 13:25 IST

తెలుగులో హిందీ హీరోయిన్ల జోరు తగ్గిందా? ఇప్పుడు తగ్గిందనే చెప్పొచ్చు. మొన్నటి దాకా తమన్నా భాటియా, కాజల్ అగర్వాల్, తాప్సీ, సాక్షీ ఖన్నా, రకుల్ ప్రీత్ సింగ్ వంటి హిందీ హీరోయిన్లు తెలుగులో టాప్ స్టార్లు అయ్యారు. ఇంకా వెనక్కి వెళితే సోనాలీ బెంద్రే, కత్రినా కైఫ్, అమీషా పటేల్, యామీ గౌతమ్, ఛార్మీ కౌర్, శిల్పాశెట్టి, ప్రీతీ జింటా, భూమికా చావ్లా, ఇలియానా డిసౌజా... ఇలా తెలుగులో హిందీ హీరోయిన్ల హవా కొనసాగింది.

ఇప్పుడు వీళ్ళంతా కనుమరుగైపోయారు. మరెలా? 10 కోట్ల మంది తెలుగు వాళ్ళ నుంచి తెలుగు హీరోయిన్లు రారు. వస్తే చిన్న చిన్న హీరోయిన్లుగా వచ్చి వెళ్ళుపోతూంటారు. తెలుగుకి హీరోయిన్లు బయటి నుంచి రావాల్సిందే. హిందీ హీరోయిన్లు వచ్చి తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని దోచుకుని వెళ్ళిపోయాక, హృదయాలకి గాలం వేస్తూ కన్నడ హీరోయిన్లు వచ్చేశారు. వెళ్ళిపోయిన హిందీ హీరోయిన్లకి తగ్గకుండా ఉధృతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో.

కర్ణాటక నుంచి కన్నడ సినిమాలొస్తే తెలుగు ప్రేక్షకులు చూడలేరు గానీ, కన్నడ హీరోయిన్లు వస్తే ఫ్యాన్ ఫాలోయింగ్ కి ఏమాత్రం లోటు లేకుండా పరిపూర్ణ హృదయాలతో స్వాగతిస్తారు. పూర్వం తెలుపు - నలుపు సినిమాల కాలంలో బి. సరోజా దేవి, రాజశ్రీ, జయంతి, పండరీ బాయి మొదలైన నటీమణులని తెలుగులో పాపులర్ హీరోయిన్లుగా మార్చేశారు తెలుగు ప్రేక్షకులు. ఆ తర్వాత యమున, ఆమని, సౌందర్య, అనూష్కా శెట్టి లని కూడా ఆదరించారు. మాలాశ్రీ, రక్షిత, ప్రణీతా సుభాష్, హరిప్రియ వంటి చిన్న హీరోయిన్లనీ సక్సెస్ చేసి పంపించారు. ఎవర్నీ ఐరన్ లెగ్ గా చూడలేదు.

ఇప్పుడు వస్తున్న కన్నడ హీరోయిన్లని లెక్కించాలంటే పెద్ద లిస్టే రాయాలి- తాజాగా 'కేజీఎఫ్' హీరోయిన్ శ్రీనిధీ శెట్టి 'కోబ్రా' తో వచ్చిన సంఘటన సహా. 'కోబ్రా' తెలుగు కాకపోయినా త్వరలో తెలుగులోకి కూడా ఆమె వచ్చేస్తుంది.

ఇలా కొత్త తరం కన్నడ హీరోయిన్లుగా ఇప్పుడు రశ్మికా మందన్న, పూజా హెగ్డే టాప్ రేంజికి వచ్చేశారు. ఏ కన్నడ హీరోయిన్ నీ ఐరన్ లెగ్ గా చూడని తెలుగు ప్రేక్షకులు, పూజా హెగ్డే కి ఐరన్ లెగ్ మెడల్ ఇచ్చేశారు. ఈమె ఏ తెలుగు స్టార్ తో నటించినా ఆ సినిమా ఫ్లాపే. అయినా ఈమెకి సినిమాలేం తగ్గలేదు. అయితే 'పుష్ప' లో నటించిన రశ్మికా మందన్న మాత్రం పానిండియా క్రేజీ హీరోయినై పోయింది.

తెలుగు ఇప్పుడు హాట్ ఫేవరెట్‌గా మారిన రష్మిక, నాగశౌర్యతో కలిసి నటించిన 'ఛలో' తో తెలుగులోకి అడుగుపెట్టింది. ఆ వెంటనే 'గీత గోవిందం' తో స్టార్ అయిపోయింది. ఇందులో విజయ్ దేవరకొండతో ఆమె రోమాన్స్ కి పులకించిపోయారు ప్రేక్షకులు. తిరిగి విజయ్ దేవరకొండ తోనే 'డియర్ కామ్రేడ్'లో నటించింది. అది ఫ్లాపయినా భారీ స్థాయిలో ఫ్యాన్స్ ని సంపాదించుకుంది.

ఆ తర్వాత మహేష్ బాబుతో 'సరిలేరు నీకెవ్వరు' తో ఇంకింత తెలుగులో సెటిలైపోయింది. నితిన్ తో నటించిన 'భీష్మ' కూడా హిట్టయింది. ఇక తెలుగులో తను గోల్డెన్ లెగ్‌గా మార్కు లేయించుకుని, పూజా హెగ్డే ఐరన్ లెగ్ ని బీట్ చేసింది. అల్లు అర్జున్‌తో 'పుష్ప' లో శ్రీవల్లిగా మాస్ హీరోయిన్ గా నటించాక ఆలిండియా సెలెబ్రిటీ ఐపోయింది.

రశ్మిక తర్వాత నాని సరసన 'జెర్సీ' తో తెలుగు తెరకి పరిచయమైన శ్రద్ధా శ్రీనాథ్ ఈ జాబితాలోకి చేరింది. తెలుగులో కేవలం రెండు సినిమాలే చేసింది తను. ధనుష్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా వున్న మరో కన్నడ కథానాయిక నభా నటేష్ తెలుగులో సుధీర్ బాబుతో 'నన్ను దోచుకుందువటే' తో అడుగు పెట్టింది. తర్వాత పూరీ జగన్నాధ్ తీసిన 'ఇస్మార్ట్ శంకర్' తో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది. తెలుగులో 'కిరాక్ పార్టీ" రీమేక్‌లో కనిపించిన సంయుక్తా హెడ్గే, కళ్యాణ్ దేవ్ సరసన 'సూపర్ మచ్చి' లో నటించిన రచితా రామ్ కూడా కన్నడ అంగనలే.

ఇక తెలుగులో రానున్న 'గుర్తుందా శీతా కాలం' తో కావ్యా శెట్టి రాబోతోంది. ఇంకో కన్నడ కథానాయిక శ్రీలీల కూడా 'పెళ్లి సందడి' తో తెలుగులోకి ప్రవేశించింది. ఇలా చిన్నా పెద్దా కన్నడ హీరోయిన్లు తెలుగు వైపు దృష్టి సారిస్తున్నారు.

ఇక్కడ భారీ బడ్జెట్‌లు, ఎక్కువ రెమ్యునరేషన్, ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ వుండడంతో తమ శాండల్ వుడ్ నుంచి టాలీవుడ్ కి మకాం మార్చేస్తున్నారు. సాధారణంగా మరొక ప్రాంతీయ భాషా చిత్ర పరిశ్రమలో నటీనటులని అంగీకరించడానికి కొంత సమయం పడుతుంది. అయినప్పటికీ తెలుగు ప్రేక్షలు చాలా త్వరగా కన్నడ హీరోయిన్లని అభిమానించడంతో మార్గం సులువై పోయింది.

తెలుగులోకే కాదు, ఇంకా ఇతర భాషల్లోకి కూడా ప్రయాణం కడుతున్నారు కన్నడ హీరోయిన్లు. ఆషికా రంగనాథ్ ఇతర భాషల నుంచి ఆఫర్లు కుంటున్న తాజా కన్నడ హీరోయిన్లలో ఒకత్తె. తను కబడ్డీ ప్లేయర్‌గా నటించే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో తమిళ సినిమాల్లోకి అడుగుపెడుతోంది.

హర్షికా పూనాచా గత సంవత్సరం భోజ్‌పురి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి, అక్కడ 'సనమ్ మేరే హమ్ రాజ్' అనే మూడో సినిమాతో బిజీగా వుంది. సోనాల్ మాంటెరో అనే ఇంకో నటి, ఇటీవలే సరోజినీ నాయుడు జీవితం ఆధారంగా రానున్న హిందీ సినిమాలో ఎంపికైంది. ఈమె సరోజినీ నాయుడు చిన్నప్పటి వెర్షన్‌ అంటే - 19 - 35 ఏళ్ల మధ్య ప్రాయాన్ని నటిస్తోంది.

ఇలా కన్నడ హీరోయిన్లు ఎక్కడెక్కడికో వెళ్తున్నారు. ఇతర చలన చిత్ర పరిశ్రమల్లో ఆకర్షణీయ పాత్రల్ని పోషించే ఆఫర్లు ప్రాంతీయ అడ్డంకుల్ని వేరు చేస్తున్నాయి. రాష్ట్ర సరిహద్దులు దాటి తమకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరుచుకునే అవకాశాల్ని చేజిక్కించుకుంటున్న కొత్త బ్రిగేడ్ కన్నడ టాలెంట్స్ వీళ్ళు.

Tags:    
Advertisement

Similar News