అసిస్టెంట్ ఎడిటర్ చెప్పాడని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారంట
చిన్న సినిమాగా వస్తోంది కళాపురం. అయినప్పటికీ ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తామంటున్నారు మేకర్స్. దీనికి వాళ్లు చెబుతున్న లాజిక్ ఫన్నీగా ఉంది. అదేంటో మీరే చదవండి
సినీ జనాల మాటలు ఒక్కోసారి భలే గమ్మత్తుగా ఉంటాయి. సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు వీళ్లు ఇచ్చుకునే కవరింగులు ఫన్నీగా అనిపిస్తాయి. ఇది కూడా అలాంటిదే. ఇది కళాపురం అనే సినిమా సంగతి.
అంతా చిన్న ఆర్టిస్టులతో, తక్కువ బడ్జెట్ లో తీస్తున్న కామెడీ సినిమా ఇది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి సినిమాల్ని ఎవరైనా నేరుగా ఓటీటీలో విడుదల చేసుకుంటారు. కానీ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయాలనేది ఈ సినిమా నిర్మాతల కోరిక. దాన్ని వాళ్లు ఎలా సమర్థించుకున్నారో మీరే చదవండి..
'కళాపురం ఎడిట్ వెర్షన్ చూసినప్పుడు అసిస్టెంట్ ఎడిటర్ నాకు ఫోన్ చేసి.. సినిమా చాలా బావుందని చెప్పాడు. సినిమాను థియేటర్స్‌లోనే రిలీజ్ చేయమని నాతో అన్నాడు. అలా కళాపురం మూవీని ఆగస్ట్ 26న థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నాం. సబ్ టైటిల్స్ ఉన్న సినిమాను చూసి ముంబై నుంచి వచ్చిన వాళ్లే ఎంజాయ్ చేశారు. రేపు థియేటర్స్‌లో అందరినీ మెప్పిస్తుంది.. నవ్విస్తుంది'
చూశారుగా.. ఇది కళాపురం నిర్మాతల వెర్షన్. అసిస్టెంట్ ఎడిటర్ (మెయిన్ ఎడిటర్ కూడా కాదు) చెప్పాడని కళాపురం సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారట. దాదాపు 50వేలు తీసుకొని పనిచేసే అసిస్టెంట్ ఎడిటర్ చెప్పాడని, 50 లక్షలు ఖర్చుపెట్టి థియేట్రికల్ రిలీజ్ కు వెళ్తున్నారన్నమాట.
విడుదలకు ముందే ఓ సినిమాను జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. జాతిరత్నాలు టైపులో ఏ మేజిక్ అయినా జరగొచ్చు. ఈ ఆశ ప్రతి నిర్మాతకు ఉంటుంది. కాబట్టి థియేట్రికల్ రిలీజ్ కు వెళ్తున్నారు. ఇందులో తప్పు లేదు. కానీ దాన్ని కవర్ చేయడం కోసం చెప్పే లాజిక్ మాత్రం హాస్యాస్పదంగా ఉంది.