బాలల సినిమా పండుగ ఇక లేనట్టే?

అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు (ఐసీఎఫ్ఎఫ్ఐ) ఈ సంవత్సరం కూడా జాడలేదు. నవంబర్ 14న తొలి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినాన్ని బాలల దినోత్సవంగా ఎలా జరుపుతూ వస్తున్నారో అలా రెండేళ్ళకోసారి నవంబర్ 14 న ప్రారంభించి వారం రోజులు ఘనంగా అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాల్ని హైదారాబాద్ లో నిర్వహిస్తూ వచ్చారు.

Advertisement
Update:2022-11-15 13:02 IST

బాలల సినిమా పండుగ ఇక లేనట్టే?

అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు (ఐసీఎఫ్ఎఫ్ఐ) ఈ సంవత్సరం కూడా జాడలేదు. నవంబర్ 14న తొలి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినాన్ని బాలల దినోత్సవంగా ఎలా జరుపుతూ వస్తున్నారో అలా రెండేళ్ళకోసారి నవంబర్ 14 న ప్రారంభించి వారం రోజులు ఘనంగా అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాల్ని హైదారాబాద్ లో నిర్వహిస్తూ వచ్చారు. చివరిసారిగా 2017 లో నిర్వహించారు. ఆ తర్వాత 2019, 2021 లలో జరగాల్సిన బాలల సినిమా పండుగ రద్దవుతూ వస్తోంది. రెండుసార్లు రద్దు అయ్యాక, ఈ సంవత్సరమైనా తిరిగి ప్రారంభించి ద్వైవార్షిక ఉత్సవాలని గాడిలో పెడతారని ప్రపంచమంతా ఎదురు చూస్తూంటే, ప్రభుత్వం తరపు నుంచి ఏ సమాచారం లేదు.

ఈ పండుగని నిర్వహించాల్సింది చిల్డ్రెన్స్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎఫ్ఎస్ఐ). దీని ప్రస్తుత పరిస్థితిని చూస్తూంటే బాలల సినిమా పండుగ భవిష్యత్తునే అనుమానించాల్సి వస్తోంది. ఈ సంస్థ ఇప్పుడు స్వయం ప్రతిపత్తి హోదానే కోల్పోయింది. 2022 జనవరిలో నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎఫ్‌డిసి) లో విలీనమై పోయింది. కనీసం దీని తరపున సమాచారమివ్వగల ప్రతినిధి కూడా లేకుండా అస్తిత్వాన్ని కోల్పోయింది.

చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా 1955లో పండిత్ హృదయ్ నాథ్ కుంజ్రూ అధ్యక్షుడిగా సమాచార- ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వయంప్రతిపత్తి గల సంస్థగా స్థాపించారు. అప్పటి నుంచి ఫీచర్ ఫిలింలు, షార్ట్ ఫిలింలు, యానిమేషన్‌లు, టెలివిజన్ ఎపిసోడ్‌లు, డాక్యుమెంటరీలూ పిల్లల కోసం నాణ్యమైన కంటెంట్ తో నిర్మించి, పంపిణీ చేయడం, ప్రదర్శించడం కొనసాగిస్తూ వస్తోంది.

అంతేగాక జాతీయ, అంతర్జాతీయ బాలల సినిమాలని యువ భారతీయ ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశ్యంతో దేశంలో ప్రతి రెండు సంవత్సరాల కొకసారి అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు నిర్వహిస్తూ వస్తోంది. ఈ చిత్రోత్సవాలు 1995 వరకు వివిధ రాష్ట్రాల్లోని నగరాల్లో జరిగే రొటేషన్ ఈవెంట్ గా ఇది వుండేది.

అయితే అంతర్జాతీయ విమానయాన సౌకర్యంతో బాటు, పెద్ద సంఖ్యలో వెండి తెరలు, వేదికలు అన్నీ ఒకే చోట అందుబాటులో వున్నందున 1997 నుంచీ 2017 వరకూ హైదరాబాద్‌లో నిర్వహిస్తూ వచ్చారు. ఉత్సవాలు జరిగే ఆ వారం రోజులూ జాతీయ, అంతర్జాతీయ సినిమా కళాకారులతో బాటు, దేశం నలు మూలల నుంచి వచ్చే బాల బాలికలతో జంటనగరాలు కళకళ లాడేవి. థియేటర్లు క్రిక్కిరిసిపోయేవి. ప్రధాన ప్రదర్శనా కేంద్రం గా ఐమాక్స్ వుండేది. ఇక అంతర్జాతీయ బాలల సినిమా పండుగకి హైదరాబాద్‌ శాశ్వత గమ్యస్థానంగా మారిపోయింది.

రెండేళ్ళకోసారి చాచా నెహ్రూ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 14 నుంచి 20 వరకు 7 రోజుల పాటు క్రమం తప్పకుండా జరిగే అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు 2019 లో, 2021 లో రద్దయి పోయాయి. 2019 నవంబర్/డిసెంబరులో తెలంగాణా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు పండుగ రద్దయ్యింది. 2020, 2021 లలో కోవిడ్ మహమ్మారి వంటి ఇతర కారణాల వల్ల రద్దయ్యింది. 2022 జనవరిలో పండుగ నిర్వహించే చిల్డ్రెన్స్ ఫిలిమ్స్ సోఐటీ (ఎన్‌ఎఫ్‌డిసి) లో విలీనం కావడంతో మూగబోయి కూర్చుంది.

విచిత్రమేమిటంటే, ఇదే ఎన్‌ఎఫ్‌డిసి ఈ సంవత్సరం గోవాలో యథాప్రకారం అంతర్జాతీయ చిత్రోత్సవాలు జరిపింది. నవంబర్ 14 న బాలల సినిమా పండుగ జరుపడానికి ఏం అడ్డొచ్చిందో మరి. హైదరాబాద్ లో ఎందుకు జరపాలి, గుజరాత్ కి మార్చుకుందామనుకుంటున్నారేమో తెలీదు. ప్రస్తుతం గుజరాత్ లో ఎన్నికలు లేకపోతే ఇదే జరిగేదేమో- మహారాష్ట్ర ప్రాజెక్టుల్ని గుజరాత్ కి తరలించుకుని పోయినట్టు. బాలల సినిమా పండుగ చిహ్నం బంగారు ఏనుగు ప్రస్తుతం అమాయకంగా దిక్కులు చూస్తోంది.

Tags:    
Advertisement

Similar News