Chiranjeevi: ఈ ఏడాది ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ
Chiranjeevi Indian Film Personality of the Year మెగాస్టార్ చిరు మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ఈ ఏడాది ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ అవార్డ్ కు ఎంపికయ్యారు.
మెగాస్టార్ చిరంజీవికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డును ప్రదానం చేయనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును ప్రకటించారు.
దాదాపు నాలుగు దశాబ్దాల కెరీర్‌లో, చిరంజీవి ప్రధానంగా తెలుగు చిత్ర పరిశ్రమలో 150కి పైగా చిత్రాలలో నటించారు. తనకు ఈ అవార్డ్ దక్కడంపై చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూనే, తనపై ప్రేమ చూపిస్తున్న అభిమానులందరికీ థ్యాంక్స్ చెప్పారు.
చిరంజీవి ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపిక అవ్వడంపై టాలీవుడ్ హర్షం వ్యక్తం చేస్తోంది. దాదాపు ప్రముఖ నటీనటులంతా చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
"గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో భాగంగా భారత ప్రభుత్వం ప్రకటించిన ఈ పురస్కారం అన్నయ్య కీర్తి కిరీటంలో చేరిన మరొక వజ్రం. ఈ ఆనంద సమయంలో నా మార్గదర్శి అన్నయ్య చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. నాలుగు దశాబ్దాలుపైబడిన అన్నయ్య సినీ ప్రస్థానం, తనను తాను మలచుకొని
ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థానం సంపాదించుకోవడం నాతో సహా ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. " అంటూ నటుడు, చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్ స్పందించారు.