నార్త్ లో మార్కెటింగ్ లోపిస్తే సౌత్ సినిమాలు గల్లంతే?

ప్రభాస్ నటించిన తాజా పానిండియా మూవీ 'సాలార్' హిందీ వెర్షన్ ఈ రోజుకి అంటే విడుదలైన రెండో వారానికి నార్త్ లో రూ. 132 కోట్లు బాక్సాఫీసు సంపాదించింది.

Advertisement
Update:2024-01-07 12:00 IST

ప్రభాస్ నటించిన తాజా పానిండియా మూవీ 'సాలార్' హిందీ వెర్షన్ ఈ రోజుకి అంటే విడుదలైన రెండో వారానికి నార్త్ లో రూ. 132 కోట్లు బాక్సాఫీసు సంపాదించింది. కానీ డిసెంబర్ 29 న విడుదలైన కన్నడ మూవీ 'కాటేరా' కర్నాటకలో ఒక్క వారంలోనే రూ. 104 కోట్లు సంపాదించింది. 'కాటేరా' కన్నడ వెర్షన్ తో 'సాలార్' హిందీ వెర్షన్ ని ఎలా పోలుస్తారనొచ్చు. కానీ 2022 లో 'కేజీఎఫ్ 2' హిందీ వెర్షన్ నార్త్ లో లైఫ్ టైమ్ బాక్సాఫీసు రూ. 400 కోట్లు సంపాదించింది. ఈ రేంజికి 'సాలార్' హిందీ వెర్షన్ నార్త్ లో చేరుకోగలదా? అనుమానమే. ఎందుకంటే 'సాలార్' కి నార్త్ లో జరగాల్సిన స్థాయిలో మార్కెటింగ్ జరగలేదు. ప్రమోషన్స్ జరగలేదు. దీనికంటే ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' కి అదిరిపోయే స్థాయిలో మార్కెటింగ్, ప్రమోషన్స్ జరిగాయి. ఆ సినిమా ఫ్లాపయ్యిందనేది వేరే విషయం. పూరీజగన్నాథ్- విజయ్ దేవరకొండ కాంబినేషన్లో 'లైగర్' కూడా ఫ్లాపయ్యింది. కానీ దానికి నార్త్ లో దిమ్మదిరిగే మార్కెటింగ్ చేశారు. రిలీజ్ కి ముందు మార్కెటింగ్ తోనే విజయ్ దేవరకొండకి నార్త్ లో లక్షలకొద్దీ ఫ్యాన్స్ ఏర్పడ్డారు.

2023 లో సౌత్ నుంచి వెళ్ళే పానిండియా సినిమాలకి గత సంవత్సరం మార్కెటింగ్ విషయంలో పూర్తిగా అలసత్వం కనబర్చారు. 'సాలార్' విషయంలోనైతే మరీ దారుణం. విడుదలకి పది రోజులే వున్నా ప్రమోషన్స్ చేపట్టకుండా నిమ్మకు నీరెత్తినట్టున్నారు. ప్రభాస్ తన మునుపటి సినిమాలైన 'సాహో', 'రాధే శ్యామ్' 'ఆదిపురుష్' వంటి వాటిని ప్రమోట్ చేయడానికి శాయశక్తులా ప్రయత్నించాడు. ‘సాలార్‌’తో జనాల్లో ఎక్కడా కనిపించలేదు. వీటన్నింటికీ మించి షారుఖ్ ఖాన్ 'డుంకీ' విడుదలైన వారాంతంలోనే 'సాలార్' విడుదలవుతోందంటే, మంచి బిజినెస్‌ రావాలంటే నార్త్‌ మార్కెట్‌లో టీమ్‌ దూకుడు పెంచాలి.

కానీ టీమ్ అంతా సైలెంట్ గానే వుండాలని నిర్ణయించుకున్నారు. అవుట్‌పుట్‌పై టీమ్ చాలా నమ్మకంతో వుంది గనుక సినిమాని ప్రమోట్ చేయకూడదని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఈ వ్యూహం కరెక్టేనా? దీనిపై ట్రేడ్ నిపుణులేం చెబుతున్నారో తర్వాత చూద్దాం. 'సాలార్' విడుదల తేదీ చాలాసార్లు మారుతూ వచ్చినప్పుడు ప్రేక్షకులు దీనిపై దృష్టి పెట్టడం మానేస్తారు. ఫైనల్ గా విడుదల చేస్తున్నప్పుడు హడావిడి చేయకపోతే ప్రేక్షకులకేం తెలుస్తుంది? బాలీవుడ్ సినిమాలు తీయడమే మానేసింది, నార్త్ జనాలకి సౌత్ పానిండియాలే పాన్ మసాలా- ఆస్వాదించక ఏం చేస్తారు- మార్కెటింగ్ అవసరం లేదు, ప్రమోషన్స్ అవసరం లేదన్నట్టు బిగ్ బ్రదర్ ధోరణి పెంచుకుంటే నష్టమే జరుగుతుంది.

2022 లో హిందీ రాష్ట్రాల్లో చవి చూసిన విజయాలకి పూర్తి భిన్నంగా, 2023 లో సౌత్ నుంచి ప్రత్యేకించి తెలుగు, తమిళ సినిమాలు పానిండియా బాక్సాఫీస్ అప్పీలు విషయంలో క్షీణ దశ చూశాయి. 'ట్రిపులార్', 'కేజీఎఫ్ 2', 'కాంతారా'వంటి వాటికి భిన్నంగా నార్త్ లో మార్కెటింగ్ విషయంలో గానీ, ప్రమోషన్ల విషయంలో గానీ నిర్మాతలు బడ్జెట్లు కేటాయించలేదని నార్త్ ఎగ్జిబిటర్లు వాపోతున్నారు. రజనీకాంత్, విజయ్, అజిత్ వంటి స్టార్లు నార్త్ లో ప్రమోషన్స్ ని అసలే చేపట్టరు. వాళ్ళ సినిమాలు వాటి అదృష్టాన్ని బట్టి నార్త్ లో ఆడాల్సిందే. ఎగ్జిబిటర్లు తమ ఖర్మ అనుకుని సినిమాల్ని వచ్చిన కాడికి కలెక్షన్స్ తో ఆడించుకోవాల్సిందే.

మీడియా కన్సల్టింగ్ సంస్థ ఓర్మాక్స్ ప్రకారం, తమిళ సినిమాల మొత్తం బాక్సాఫీసు వాటా 2022 లో 16% వుంటే, 2023లో 17% వుంది. తెలుగు, మలయాళ సినిమాలు 2022 తో పోలిస్తే వరుసగా 3% , 2% తగ్గాయి. 2022లో 8% వాటా వున్న కన్నడ సినిమాలు 2023 లో 2% కి పడిపోయాయి. నార్త్ లో బ్రాండ్స్ ని సృష్టించడంలో సౌత్ నిర్మాతలు స్థిరంగా పనిచేయాలని ఓర్మాక్స్ కోరుతోంది. నార్త్ లో ప్రేక్షకులకి చాలా ఛాయిస్ లున్నాయని, వీటి మధ్య సౌత్ సినిమాలు దృష్టి నాకర్షించడానికి గట్టి కృషి చేయాల్సిందేననీ బీహార్‌ కి చెందిన ఒక ఎగ్జిబిటర్ సూచించాడు.

కంటెంట్ బలంగా వుందని నమ్మి సినిమాలని విడుదల చేయడం సరైంది కాదనీ, ఎంత బలమైన కంటెంట్ వున్నా మార్కెటింగ్‌ ద్వారా, డిస్ట్రిబ్యూషన్‌ ద్వారా ప్రేక్షకుల్లో తగినంత అవగాహన కల్పించాల్సిందేననీ అతను చెప్పాడు. రజనీకాంత్ నటించిన 'జైలర్', విజయ్ నటించిన 'లియో' వంటి కొన్ని తమిళ విడుదలలు హిందీ మార్కెట్ లో మంచి కలెక్షన్సే రాబట్టినా, ప్రమోషన్స్ లేకుండా ప్రతీ సారీ ఇలాగే జరగాలని లేదన్నాడు. ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ దూకుడుగా ముందుకు సాగాల్సిందేనన్నాడు.

పోతే, హిందీలో ఎనిమిది వారాల ఓటీటీ విండో డిమాండ్ కారణంగా నార్త్ లో మల్టీప్లెక్స్ విడుదలలు లేకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తోంది. అయితే, మాస్ మార్కెట్ సినిమా విషయానికి వస్తే ఉత్తరాదిలో తగినంత స్పేస్ వుందని, సౌత్ సినిమాలకి హిందీలో టీజర్, ట్రైలర్, సాంగ్స్ విడుదల చేయడం, స్క్రీన్ కౌంట్ ఫిక్స్ చేయడం వంటి సాధారణ వ్యూహాలతో అద్భుత ఫలితాల్ని పొందవచ్చనీ ట్రేడ్ నిపుణులు నొక్కిచెప్తున్నారు. పట్టణ స్థాయి సింగిల్ స్క్రీన్ ప్రేక్షకుల్ని లక్ష్యంగా సోషల్ మీడియా ప్రమోషన్లు కూడా చేపట్టాలంటున్నారు. సౌత్ సినిమాలకి డబ్బింగ్ వెర్షన్‌లతో సహా శాటిలైట్, డిజిటల్ హక్కుల్ని విక్రయించడం సులభమనీ, అయితే థియేటర్‌లకి ప్రేక్షకుల్ని రప్పించడం పూర్తిగా వేరే మార్కెటింగ్ వ్యూహమనీ విశ్లేషిస్తున్నారు. రజనీకాంత్ తోబాటు అల్లు అర్జున్, యష్, జూనియర్ ఎన్టీఆర్ వంటి కొంతమంది స్టార్లు మాత్రమే ఉత్తర భారత ప్రేక్షకులకి తెలుసనీ ట్రేడ్ నిపుణులు గుర్తు చేస్తున్నారు.

మార్కెటింగ్, ప్రమోషన్లు చేపట్టకుండా 'సాలార్' విషయంలోలాగా, మా సినిమా బంగారం- అని నమ్మికూర్చుంటే, ప్రమోషన్లతో అదరగొట్టి 'డంకీ' లాంటి బాలీవుడ్ సినిమాలు 'సాలార్' సొమ్ములు దోచుకుని వెళ్ళిపోతాయని గ్రహించాలి. విడుదలకి ముందు 'సాలార్' ముందు 'డంకీ' వీక్ అనుకున్నది కాస్తా నార్త్ లో రెండు వారాల్లో రూ. 247 కోట్లతో పీక్ కెళ్ళిపోయింది!

Tags:    
Advertisement

Similar News