ఆర్ఆర్ఆర్ ఆస్కార్‌కు నామినేట్ అయితే.. నిర్మాతపై రూ.50 కోట్ల వరకు భారం..!
ఒకవేళ 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమా ఆస్కార్‌కి నామినేట్ అయ్యిందనుకోండి.. దీని క్యాంపెయిన్ కోసం, P&A (ప్రింట్స్ అండ్ అడ్వర్టైజింగ్) కోసం ఆ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య భారీగా ఖర్చు భరించాల్సి ఉంటుంది.
అవునండీ.. ఇది నిజమే.. జక్కన్న దర్శకత్వంలో రూపొంది ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులను అలరించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్‌కు నామినేట్ అయితే మాత్రం.. ఆ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్యకు రూ.50 కోట్ల వరకు వ్యయం అవుతుంది. అదెలా అంటారా.. అయితే ఇది చదవి తెలుసుకోండి.
తమ అభిమాన నటులు రామచరణ్.. ఎన్టీఆర్.. అల్లూరి సీతారామరాజుగా, కొమురం భీంగా వారి నటనతో అదరగొట్టిన ఆర్ఆర్ఆర్ మూవీ ఘన విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులను అలరించింది. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ మూవీకి ఆస్కార్ ఇవ్వాలంటూ.. సోషల్ మీడియాలో అభిమానులు తెగ ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ఆస్కార్‌కి ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో నామినేట్ అవుతుంది.. అవ్వాలి.. అంటూ ట్వీట్లలో పేర్కొంటున్నారు.
వారి కోరిక మేరకే.. ఒకవేళ 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమా ఆస్కార్‌కి నామినేట్ అయ్యిందనుకోండి.. దీని క్యాంపెయిన్ కోసం, P&A (ప్రింట్స్ అండ్ అడ్వర్టైజింగ్) కోసం ఆ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య భారీగా ఖర్చు భరించాల్సి ఉంటుంది. ఆస్కార్ కోసం సెపరేట్ పబ్లిసిటీ క్యాంపెయిన్ చేయాల్సి ఉంటుంది. ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అక్కడి ఫిల్మ్ మేకర్స్‌కి, సెలెక్టివ్ ఆడియన్స్ కోసం షో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
గతంలో అత్యధిక ఆస్కార్ అవార్డ్స్ అందుకున్న 'పారసైట్' సినిమా ఆస్కార్ క్యాంపెయిన్ కోసం 5 మిలియన్ డాలర్లు (అంటే.. దాదాపు రూ.40 కోట్లు) ఖర్చు చేసింది. P&A కోసం ఓవరాల్‌గా 17 నుంచి 18 మిలియన్ డాలర్లు (అంటే దాదాపు రూ.120 కోట్లు) ఖర్చు పెట్టింది.
నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వెట్రిమారన్ డైరెక్ట్ చేసిన 'విసారనై'(2016) సినిమా 89వ అకాడమీ అవార్డ్స్‌కి ఇండియా నుంచి అఫీషియల్ ఎంట్రీగా సెలెక్ట్ అయ్యింది కానీ నామినేట్ అవ్వలేదు. కేవలం సెలెక్ట్ అయిన తర్వాత నామినేట్ అవ్వడానికి అవసరమైన క్యాంపెయిన్ కోసమే.. సినిమా బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టామని వెట్రిమారన్ చాలాసార్లు చెప్పడం గమనార్హం. 'విసారనై' ప్రొడ్యూసర్ అయిన హీరో ధనుష్ ఖర్చు వెనకాడకుండా ప్రమోషన్స్ చేశాడు కానీ సినిమా మాత్రం ఆస్కార్‌ని నామినేట్ అవ్వలేదు.
ఒకవేళ 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమా గనుక ఆస్కార్‌కి నామినేట్ అయితే.. నిర్మాతలు తక్కువలో తక్కువగా రూ.30 నుంచి రూ.50 కోట్ల వరకూ ఖర్చు చేయాల్సి ఉంటుంది. తన సినిమా వరల్డ్ ఆడియన్స్‌ని రీచ్ అవుతుంది అంటే, అది తన నెక్స్ట్ సినిమాకి హెల్ప్ అవుతుంది అంటే ఎంత దూరమైనా వెళ్లే రాజమౌళి.. 'ఆర్ఆర్ఆర్' సినిమా నామినేట్ అయితే చాలు ఖర్చుకి వెనకాడకుండా ప్రయత్నాలు చేస్తాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఓ సినిమా ఆస్కార్స్‌కి నామినేట్ అయితే.. ఎన్ని పాట్లు పడాలో చూపిస్తూ మలయాళీ డైరెక్టర్ సలీమ్ అహ్మద్.. `అండ్ ద ఆస్కార్ గోస్ టు` అనే మూవీ కూడా తీయడం విశేషం. సినిమా రంగంలోకి అడుగుపెట్టక ముందు ఈ దర్శకుడు ట్రావెల్ ఏజెంట్‌గా పనిచేశాడు. ఆ తరుణంలో ఆయనకి ఎదురైన కొన్ని సంఘటనల ఆధారంగా ఓ కథ రాసుకుని మొదటి సినిమాగా తీశాడు. ఆ సినిమా కథ పేరు 'ఆడమిండె మగన్ అబు (ఆడమ్ కొడుకు అబు)'. హజ్ యాత్రకి వెళ్లాలని తపించిన ఓ పేద అత్తరు సాయిబు కథే ఈ చిత్రం. విడుదలైన తర్వాత మంచి టాక్ సొంతం చేసుకుని ఎన్నో జాతీయ, స్థానిక అవార్డులు పొందింది. అలాగే.. ఈ సినిమాని ఎన్నో అంతర్జాతీయ వేదికల మీద కూడా ప్రదర్శించారు. అంతేకాకుండా.. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఈ సినిమా ఆస్కార్ గుమ్మం వరకూ వెళ్లింది. అక్కడ ఈ మూవీని ప్రమోషన్ చేయడానికి ఈ దర్శకుడు పడిన పాట్లే ఇతివృతంగా ఈ సినిమాని తీశాడు. మిన్నల్ మురళీ చిత్రంతో తెలుగులోనూ పాపులారిటీ సాధించిన టొవినో థామస్ ముఖ్యపాత్రలో నటించాడు. ఆ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకోవడం విశేషం.