శంకర్ కి కొత్త ఊపిరి పోస్తున్న చారిత్రక మూవీ!

తమిళ దర్శకుడు శంకర్ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో కనపడుతున్నారు. ఇంత ఆత్మవిశ్వాసం ఈ పదేళ్ళలో లేదు.

Advertisement
Update:2022-09-12 12:13 IST

తమిళ దర్శకుడు శంకర్ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో కనపడుతున్నారు. ఇంత ఆత్మవిశ్వాసం ఈ పదేళ్ళలో లేదు. తన సినిమాల సక్సెస్ కి మూల కారకుడుగా వుంటూ వచ్చిన రచయిత సుజాత 2012 లో మృతి చెందినప్పట్నుంచీ, శంకర్ తీసిన సినిమాలు ఫ్లాప్ అవుతూ వచ్చాయి. తగిన కథల్లేక, సుజాత స్థానాన్ని భర్తీ చేసే రచయితలూ లేక, తీసిన సినిమాలకే సీక్వెల్సూ రీమేకులూ తలపెడుతూ అతి పెద్ద గందరగోళంలో పడ్డ శంకర్, ఇప్పుడు సరైన దారిలో పడ్డారు. ఒక నవలని సినిమాగా తీయాలనుకోవడం. అదీ చారిత్రక కథ కావడం. ఒక వైపు మణిరత్నం చారిత్రక నవలతో 'పొన్నియిన్ సెల్వన్'' తీస్తూంటే, తను కూడా ఆయన మార్గంలో తన కెరీర్ కి కొత్త దారి కనుక్కోవడమే ఆత్మ విశ్వాసానికి కారణం.

చరిత్రని సినిమాగా తీస్తే గౌరవం పెరుగుతుంది, తమిళ చరిత్రని తెరకెక్కిస్తే తమిళుల గత వైభవం ప్రపంచానికి తెలుస్తుంది. తమిళ ఆత్మాభిమానాన్ని సంతృప్తి పరుస్తుంది. పైగా గత చరిత్ర తెలుసుకోవడానికి అనేక సమాజాలకి చారిత్రక సినిమా అనేది వొక పాపులర్ జ్ఞాన కేంద్రంగా ఆకర్షిస్తుంది. ఇందువల్ల ఈ సెకెండ్ ఇన్నింగ్స్ ని సద్వినియోగం చేసుకుంటే శంకర్ కలకాలం గుర్తుండి పోతారు.

ఇంతకీ ఏమిటా శంకర్ తీసే చారిత్రక సినిమా అంటే, అదొక కళ్ళు తిరిగే వెయ్యికోట్ల మెగా ప్రాజెక్టు. వెయ్యి కోట్లతో సినిమా తీసే అవసరముందా అంటే ప్రకటనలదేముంది ఎంతైనా చెప్పుకోవచ్చని గుసగుసలు. మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్' బడ్జెట్ 500 కోట్లు అవుతున్నప్పుడు దాన్ని రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు. ఇరవై ఏళ్ళ క్రితం అమీర్ ఖాన్ 'లగాన్' తీసినప్పుడు, ఆ డబ్బుతో పది వూళ్ళకి తాగు నీటి సౌకర్యం కల్పించవచ్చని విమర్శలు వచ్చాయి. అప్పట్లో సినిమా నిర్మాణానికి 20 కోట్లు అంటేనే కొత్త. అందుకని అలాటి విమర్శలొచ్చాయి. ఇప్పుడు ఎన్ని వందల కోట్లు పెడితే అంత గొప్పగా చూస్తున్నారు. దానికి రెట్టింపు టికెట్ ధర పెట్టినా రొట్టెకి డబ్బుల్లేని వాడు కూడా ఆనందం అనుభవిస్తున్నాడు.

వెయ్యి కోట్ల బడ్జెట్ తో సూర్య కథానాయకుడుగా శంకర్ 'వేల్పారీ' అనే చారిత్రాత్మకం తీస్తున్నట్టు ప్రకటన వెలువడింది. వీలైనన్ని ఎక్కువ భాషల్లో దీన్ని విడుదల చేయాలని ప్లాను. క్రీపూ 600-300 నాటి చరిత్ర ఇది. అప్పటి చిన్న రాజ్యమైన పరంబుని ఎంతో గొప్పవాడుగా పేరు తెచ్చుకున్న రాజు 'పారీ' పరిపాలించేవాడు. రాజ్యం చుట్టూ వున్న సుమారు 300 గ్రామాల ప్రజలు అతడ్ని ప్రశంసించే వారని చెబుతారు. అతను కళల్ని, సాహిత్యాన్నీ ప్రోత్సహించేవాడు. ఆ కాలాన్ని సంగం శకం అంటారు. సంగం శకం చివరి రాజులలో ఒకడైన పారీ దాతృత్వం గురించి కూడా గొప్పగా చెప్పుకుంటారు. ఇలాటి రాజు మీదికి చెర, చోళ, పాండ్యన్ రాజులు యుద్ధాని కెళ్ళారు. ఈ యుద్ధానికి కారకుడు కూడా పారీయేనని చెప్పుకుంటారు.

ఈ చరిత్రని నవలగా రాసింది ప్రస్తుత పార్లమెంటు సభ్యుడు, తమిళనాడు అభ్యుదయ రచయితల, కళాకారుల సంఘం అధ్యక్షుడు ఎస్ వెంకటేశన్. దీనికి ముందు రాసిన 'కావల్ కొట్టం' అనే చారిత్రక నవలకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 'వేల్పారీ' నవల రాయడానికి ఆరేళ్ళు పట్టింది. దీనికోసం పశ్చిమ కనుమల్లోని గిరిజన ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించాడు. తమిళ రాజు పారీ పాలించే చిన్న రాజ్యమైన పరంబు మీదికి ఏకంగా చేర, చోళ, పాండ్యన్ త్రయం యుద్ధం చేయడానికి కారణమేమిటో ఈ నవలలో చెప్పాడు వెంకటేశన్. శంకర్ కోసం దీన్ని చిత్రానువాదం చేసే పనిని ఇప్పటికే ప్రారంభించాడు వెంకటేశన్.

ఇప్పుడు శంకర్ దీన్ని సూర్యతో ఎంత గొప్పగా తీస్తాడనేది చూడాల్సి వుంది. తనకి ఎవరితోనూ పోలిక వుండేది కాదు. మణిరత్నంతో కూడా. మణిరత్నం తీసే సినిమాలు వేరు, తన సినిమాలు వేరేగా వుండేవి. అలాంటిది ఇప్పుడు 'పొన్నియిన్ సెల్వన్' చారిత్రాత్మకంతో మణిరత్నం సవాలు విసురుతున్నట్టే. ఇప్పటికే దీని మెగా క్వాలిటీని ట్రైలర్ చూసి అంతర్జాతీయ మీడియా ఆకాశాని కెత్తేస్తోంది. దానిదేముంది, ఇది సెప్టెంబర్ 30 న విడుదలవుతోంది...శంకర్ సినిమా పూర్తవడానికి ఏడాది పైనే పడుతుంది...

అప్పటికి మణిరత్నం మూవీ పోటీకి వుండదనుకుంటే, అప్పటికి రెండో భాగం వచ్చి ఎదుట నిలబడ వచ్చు.

శంకర్ ఇప్పుడు నిర్మాణంలో వున్న రెండు సినిమాలు పూర్తి చేయాల్సి వుంది. కమల్ హాసన్ తో 'ఇండియన్ 2', రాంచరణ్ తో 'ఆర్సీ15'. ఇవి పూర్తయ్యాకే 'వేల్పారీ' ప్రారంభమవుతుంది.

Tags:    
Advertisement

Similar News