నాడు మల్టీ స్టార్లు - నేడు గెస్ట్ స్టార్లు
వినోద రంగం బహు ముఖాలుగా విస్తరిస్తూ వినోద సాధనమంటే సినిమా అనే గుత్తాధిపత్యానికి సవాలు విసురుతున్నప్పుడు సినిమాలు కొత్త మనుగడ ఫార్ములాలు వెతుక్కోక తప్పడం లేదు.
వినోద రంగం బహు ముఖాలుగా విస్తరిస్తూ వినోద సాధనమంటే సినిమా అనే గుత్తాధిపత్యానికి సవాలు విసురుతున్నప్పుడు సినిమాలు కొత్త మనుగడ ఫార్ములాలు వెతుక్కోక తప్పడం లేదు. స్మార్ట్ ఫోన్స్ దగ్గర్నుంచీ టీవీ, కంప్యూటర్, లాప్ టాప్ మొదలైన సాధనాల్లో ప్రపంచ వినోద రంగాన్నంతా గుప్పెట పట్టిన ప్రేక్షకులు, సినిమాల కోసం థియేటర్లకి కదిలి రావడమంటే మాటలు కాదు. ఒకప్పుడు టీవీ సీరియల్స్ ప్రారంభమైనప్పుడు థియేటర్లలో సెకెండ్ షోలకి జనాలుండే వారు కాదు. ఇప్పుడు ఓటీటీలతో దానికి మించిన పరిస్థితి వుంది.
ఏకైక వినోద సాధనంగా సినిమా వున్నప్పుడు అవసరం లేకపోయినా ప్రేక్షకులకి ఉదారంగా అదనపు వినోద మివ్వడానికి మల్టీ స్టారర్ సినిమాలు తీశారు. ఇద్దరు స్టార్లు, ముగ్గురు స్టార్లు కలిసి నటించి ప్రేక్షకులకి ఫుల్ మీల్స్ అందించారు. ఒక స్టారే నటిస్తే అది ప్లేట్ మీల్స్. ప్రేక్షకులు రెండూ ఆరగించారు. సినిమాలు లాభపడ్డాయి.
అయితే ఇప్పుడు సినిమాల్ని దాటి వినోద రంగం సోషల్ మీడియాలో షార్ట్స్ వరకూ ఆక్టోపస్ లా విస్తరించాక- తెలివైన దర్శకులు ప్రేక్షకులకి తగ్గట్టుగా అదే షార్ట్స్ ని సినిమాల్లో జొప్పించి సమానత్వం సాధిస్తున్నారు. ఇప్పుడు ప్రేక్షకుల దృష్టి సినిమాల మీదికి మళ్ళించేందుకు మల్టీ స్టారర్లు తీయనవసరం లేదు. మల్టీ స్టారర్లు అంటే ఇద్దరు ముగ్గురు స్టార్లతో పూర్తి నిడివి పాత్రలు, వాటికి పూర్తి స్థాయి భారీ పారితోషికాలు. అంతే గాకుండా ఈ మల్టీ స్టారర్స్ తో ఫ్యాన్స్ తో గొడవ. మా స్టార్ పాత్ర తగ్గించారని ఒకరు గొడవకి దిగితే, మా స్టార్ క్యారక్టర్ నిలువునా కోశారని ఇంకొకరు తగాదా. ‘ఆర్ ఆర్ ఆర్’ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ పాత్రలతో ఇదే గొడవ జరిగింది. ఈ గొడవ కృష్ణ- శోభన్ బాబు మల్టీ స్టారర్స్ కాలం నుంచీ వుంది.
అందుకని ఈ ప్రేక్షకులకి ఫుల్ మీల్స్, ప్లేట్ మీల్స్ కాకుండా, బఫే పెట్టేస్తే కిమ్మనకుండా ఆరగించిపోతారని, కొత్త సినిమా మనుగడ ఫార్ములా కనిపెట్టారు దర్శకులు. ఈ ప్రేక్షకులు ఎవరికి వాళ్ళే సోషల్ మీడియా స్టార్లు. ఫేస్ బుక్ లో, యూట్యూబ్ లో, ఇన్ స్టాలో తామే నటిస్తూ కామెడీ షార్ట్స్ పోస్టు చేసుకుని ఓ రేంజి హీరోలుగా, ఇంకో రేంజి స్టార్లు గా ఫీలవుతున్నారు. వీళ్ళకి తగ్గట్టే సినిమాల్లో షార్ట్స్ క్రియేట్ చేస్తే సరిపోతుంది. ఈ షార్ట్స్ తో సినిమాలో ప్రతీ అరగంటకో స్టార్ కనిపించి పోతూంటాడు. బఫే డిన్నర్ లో ఎవరికి కావాల్సింది వారు వడ్డించుకున్నట్టు, ఏ స్టార్ ని ఆ స్టార్ ఫ్యాన్స్ కాసేపు ఎంజాయ్ చేసి వెళ్ళి పోతారు. పాత్ర కోశారని, పాటలు పెట్టలేదనీ గొడవలుండవు.
ఈ సినిమాలు ఒక స్టార్ ప్రధాన కథగా వుంటాయి. వీటిలో ఇతర స్టార్లు అతిధి పాత్రలు (గెస్ట్ రోల్స్) పోషిస్తారు. కాబట్టి వీళ్ళు గెస్ట్ స్టార్లు. నిజానికి గెస్ట్ స్టార్లు పాత సినిమాల్లోనూ కనిపిస్తారు. ‘ఊర్వశి’లో సంజీవ్ కుమార్, ‘బంగారుబాబు’ లో శివాజీ గణేశన్ లాంటి స్టార్లు అతిధి పాత్రలు పోషించారు.
ఇప్పుడిదే జరుగుతోంది. రణబీర్ కపూర్ నటించిన ‘బ్రహ్మాస్త్ర’ లో షారూఖ్ ఖాన్; కమల హాసన్ నటించిన ‘విక్రమ్’ లో సూర్య, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్; చిరంజీవి నటించిన ‘గాడ్‌ఫాదర్’లో సల్మాన్ ఖాన్; అడివి శేష్ ‘హిట్ 2’ లో నాని; విశ్వక్ సేన్ ‘ఓరి దేవుడా’లో వెంకటేష్; అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ లో నాగ చైతన్య; మణిరత్నం ‘పోన్ని యిన్ సెల్వన్’ లో విజయ్ సేతుపతి, ఫాహధ్ ఫాజిల్; రజనీకాంత్ ‘జైలర్’ లో మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, శివరాజ్ కుమార్, సునీల్; షారూఖ్ ఖాన్ ‘జవాన్’ లోదీపికా పడుకొనే, సంజయ్ దత్ ... ఇలా గెస్ట్ స్టార్లతో నిండిపోతున్నాయి నేటి స్టార్ సినిమాలు.
గెస్ట్ పాత్రల్లో దర్శకులు కూడా కనిపించారు. సస్పెన్స్ బ్రహ్మ ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ తీసిన 53 సినిమాల్లో 40 సినిమాల్లో ఎక్కడో ఒక చోట కనిపించి మాయమైపోతాడు. డాక్టర్ డి రామానాయుడు కూడా తను తీసిన కొన్ని సినిమాల్లో ఇదే చేశారు. ఇక బాలీవుడ్ దర్శకుడు సుభాష్ ఘాయ్ అయితే తన సినిమాల్లో ఒక పాటలో కనిపించి అదృశ్యమైపోతాడు. ఇప్పుడు ‘జవాన్’ లో దర్శకుడు అట్లీ కూడా ఒక పాటలో కనిపిస్తాడు. ‘గాడ్ ఫాదర్’ లో దర్శకుడు పూరీ జగన్నాథ్ దీ గెస్ట్ రోల్.
ఇంకా చెప్పుకుంటే 2012 నాటి బ్రిటిష్ మూవీ ‘రన్ ఫర్ యువర్ వైఫ్’ లో 80 మంది నటీ నటులు గెస్ట్ రోల్స్ లో కనిపిస్తారు! హాలీవుడ్ దర్శకులు క్వెంటిన్ టరాంటినో, రోమన్ పోలాంస్కీ, మార్టిన్ స్కార్సెస్ లు కూడా తమ సినిమాల్లో ఒక సీన్లో కనిపించి పోతారు.
నిజానికి ఒక స్టార్ మీద ఆధారపడి పూర్తి నిడివి సినిమాని మార్కెట్లోకి నిలబెట్ట లేని పరిస్థితి నేటిది. మల్టీ స్టారర్లు తీస్తే పాత్ర చిత్రణలతో, బడ్జెట్ తో, ఫ్యాన్స్ తో సమస్య. ఒక స్టార్ సినిమాలో ఒకరు నుంచి ఇద్దరు ముగ్గురు ఇతర స్టార్స్ ని రెండు మూడు సీన్ల గెస్ట్ రోల్స్ లో చూపిస్తే, వెరైటీతో సినిమాకి నిండుదనం వస్తుంది, ఇది బఫే అనుకుని ఫ్యాన్స్/ ప్రేక్షకులూ నిర్మొహమాటంగా, బేషరతుగా ఆరగించి పోతారు. సినిమాల మనుగడకి సాధ్యమైనన్ని విద్యలు దర్శకులకి తప్పవు. ఈ రోజుల్లో సినిమా అనేది రైటింగ్ కాదు, మేకింగ్!