బింబిసారలో యాక్షన్ ఆశించొద్దంటున్న కల్యాణ్ రామ్
బింబిసార సినిమాలో భారీ కత్తియుద్ధాల్లాంటివి ఆశించొద్దని ముందుగానే క్లారిటీ ఇస్తున్నాడు హీరో కల్యాణ్ రామ్.
మగధీరలో వందమందిని చంపే యాక్షన్ సీన్ ఉంది. బాహుబలిలో యుద్ధాలకు కొదవలేదు. ఇలాంటి హై-ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాల్ని బింబిసారలో ఆశించొద్దని చెబుతున్నాడు హీరో కల్యాణ్ రామ్. ఇది యాక్షన్ సినిమా కాదని, ఓ ఫాంటసీ సినిమా అని చెబుతున్నాడు.
"ఒక రాజు కథ అంటే యుద్దాలతో భారీ యాక్షన్ సీక్వెన్స్ ఊహించుకుంటారు ఎవరైనా. కానీ ఇందులో అలాంటివి డిజైన్ చేయలేదు. సినిమాలో బింబిసారుడి కథ మాత్రమే చూపించాం. కాకపోతే విఠలాచార్య గారి సినిమాలో కనిపించే దెయ్యాలు, భూతాలు వంటి కొన్ని ఫాంటసీ ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ కాబట్టి యుద్ధాలకు పెద్దగా స్కోప్ లేదు."
ఇలా బింబిసారుడిపై లేనిపోని అంచనాలు తగ్గించే ప్రయత్నం చేశాడు కల్యాణ్ రామ్. ఇక సినిమాలో రాజుగా కనిపించేందుకు బాహుబలి సినిమాను బెంచ్ మార్క్ గా తీసుకున్నాడట కల్యాణ్ రామ్. రాజు ఎలా ఉండాలో బాహుబలి సినిమాలో ప్రభాస్ చూపించాడని, దానికి తగ్గకుండా తన గెటప్ ను డిజైన్ చేయించుకున్నానని తెలిపాడు.
ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి వస్తోంది బింబిసార సినిమా. క్యాథరీన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు వశిష్ఠ దర్శకుడు.