మోసపూరిత సంస్థలకు సహకరించ వద్దు.. అమితాబ్‌కు వీసీ సజ్జనార్ సూచన
దేశ ఆర్థిక వ్యవస్థను, సమాజంలోని సామాజిక వ్యవస్థను నాశనం చేసే ఇలాంటి కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండొద్దని రిక్వెస్ట్ చేశారు.
మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీలకు, మోసపూరిత వ్యాపారం చేసే సంస్థలకు సహకరించ వద్దని బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌కు తెలంగాణ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ సూచించారు. తాజాగా ఒక థియేటర్‌లో 'ఆమ్వే' సంస్థకు చెందిన యాడ్ ప్రదర్శించగా.. అందులో అమితాబ్ ఉన్న ఫొటోను జత చేసి కీలక సూచనలు చేశారు. అమితాబ్ సహా సెలెబ్రిటీలందరూ 'ఆమ్వే' లాంటి సంస్థలకు దూరంగా ఉండాలని ఆయన కోరారు. ఈ మేరకు శుక్రవారం ఒక ట్వీట్ చేశారు.
దేశ ఆర్థిక వ్యవస్థను, సమాజంలోని సామాజిక వ్యవస్థను నాశనం చేసే ఇలాంటి కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండొద్దని రిక్వెస్ట్ చేశారు. ఆమ్వేకి బిగ్‌బీ ప్రచారం చేస్తుండటంతో ఆ ట్వీట్‌కు ఆయనను కూడా ట్యాగ్ చేశారు. అంతే కాకుండా ఇలాంటి ప్రకటనలపై ఒక నిఘా ఉంచాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు, మంత్రి అనురాగ్ ఠాకూర్, పీఎంవో కార్యాలయానికి, ప్రధాని నరేంద్ర మోడీకి, హోం మంత్రిత్వ శాఖకు, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేకు, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు కూడా సూచించారు. ఆ ట్వీట్‌లో వారిని కూడా ట్యాగ్ చేశారు.
మల్టీలెవెల్ మార్కెటింగ్ కంపెనీలపై వీసీ సజ్జనార్ సైబరాబాద్ కమిషనర్‌గా ఉన్నప్పటి నుంచి కఠినంగా వ్యవహరిస్తున్నారు. గతంలో క్యూనెట్ వంటి సంస్థలకు సంబంధించిన యాడ్స్‌లో నటించవద్దని సానియా మీర్జాకు కూడా ట్వీట్ చేశారు. ఆయన పోలీస్ కమిషనర్‌గా పని చేసే సమయంలో ఇలాంటి మల్టీలెవెల్ మార్కెటింగ్ కంపెనీలపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఇక ఆమ్వే సంస్థపై పలు ఆరోపణలు ఉన్నాయి. పైకి ఆరోగ్య, సౌందర్య ఉత్పత్తులు అమ్ముతున్నట్లు ప్రకటనలు గుప్పించినా.. అది చేసేది మల్టీ లెవెల్ మార్కెటింగే.
అమెరికాకు చెందిన ఈ కంపెనీపై గతేడాది ఏప్రిల్‌లో ఈడీ అధికారులు పలు అభియోగాలతో కేసు నమోదు చేశారు. ఈ సంస్థకు చెందిన రూ.757 కోట్ల విలువైన ఆస్తులను కూడా సీజ్ చేసింది. గొలుసు కట్టు స్కీమ్స్‌లో ప్రజలను చేర్పించి.. వారితో బలవంతంగా ఉత్పత్తులను అమ్మించడం, కొనిపించడం చేస్తోందని ఈడీ ఆరోపించింది.