'ఆస్కార్' కు చెల్లో షో ఎంపికపై ఎన్.శంకర్ విస్మయం

ఉమ్మడి రాష్ట్రంలో నంది అవార్డ్స్ కమిటీ చైర్మన్ గా పనిచేసిన అనుభవంతో ఆర్ఆర్ఆర్ ఆస్కార్ నామినేషన్స్ కు ఎంపిక కాకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది.

Advertisement
Update:2022-09-22 14:01 IST

ఈ ఏడాది ఆస్కార్ కి వెళ్లే చిత్రాల్లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్, అలాగే బాలీవుడ్ చిత్రం ది కశ్మీర్ ఫైల్స్ సినిమాలు కచ్చితంగా ఉంటాయని జోరుగా ప్రచారం జరిగింది. కానీ అందరికీ షాక్ ఇస్తూ ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గుజరాతీ చిత్రం చెల్లో షోని ఆస్కార్ నామినేషన్స్ కి ఎంపిక చేసింది. దీనిపై పలువురు సినీ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేశారు. ఆర్ఆర్ఆర్ ని కాదని చెల్లో షోని ఎంపిక చేసేంత ఆ సినిమాలో ఏముంది? అని ప్రశ్నించారు. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కూడా చెల్లో షో ఎంపికపై పెదవి విరిచారు.

కాగా తాజాగా ఈ విషయమై ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ స్పందించారు. 'నేను ఇండియన్ ఆస్కార్ నామినేట్ కమిటీకి జ్యూరీ సభ్యుడిగా, నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కమిటీకి వైస్ చైర్మన్ గా, గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు కమిటీకి జ్యూరీ సభ్యుడిగా పని చేశా. ఉమ్మడి రాష్ట్రంలో నంది అవార్డ్స్ కమిటీ చైర్మన్ గా పనిచేసిన అనుభవంతో ఆర్ఆర్ఆర్ ఆస్కార్ నామినేషన్స్ కు ఎంపిక కాకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది.

చెల్లో షో వంటి సినిమాలు ఇప్పటికే సౌత్ లో ఎన్నో వచ్చాయి. ఆర్ఆర్ఆర్ లో దేశభక్తి, మంచి కథనంతో పాటు గొప్ప నిర్మాణ విలువలు ఉన్నాయి. ఈ సినిమాను కాదని ఆస్కార్ నామినేషన్స్ కు చెల్లో షో ని ఏ కోణంలో ఎంపిక చేశారో తెలియడం లేదు' అని ఆయన విస్మయం వ్యక్తం చేశారు.

ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆర్ఆర్ఆర్ ని ఆస్కార్ నామినేషన్స్ కు పంపక పోయినప్పటికీ అమెరికాలో ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన వేరియన్స్ ఫిల్మ్ సంస్థ మాత్రం ఆర్ఆర్ఆర్ ని పరిశీలించాలని అకాడమీని కోరింది. అన్ని కేటగిరీలకు సంబంధించి ఓటింగ్ నిర్వహించేలా ప్రణాళికలు రచిస్తోంది. ఒకవేళ ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ నామినేషన్స్ లభిస్తే ఇతర దేశం నుంచి అర్హత పొందిన తొలి భారతీయ చిత్రంగా ఈ సినిమా నిలిచే అవకాశం ఉంది.

Tags:    
Advertisement

Similar News