ఓటీటీలోకి 'దేవర'.. ఎప్పుడంటే?
నవంబర్ 8 నుంచి అందుబాటులో ఉండనున్నట్లు పేర్కొన్న నెట్‌ఫ్లిక్స్
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్‌లో వచ్చిన 'దేవర' మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి కలెక్షన్లను రాబట్టింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోనూ అభిమానులను అలరించడానికి సిద్ధమైంది. ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అన్ని ఎన్నోరోజులు ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్ పెడుతూ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రసారం కానున్నది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ సంస్థ వెల్లడించింది. నవంబర్ 8 నుంచి అందుబాటులో ఉండనున్నట్లు పేర్కొన్నది. తెలుగు తెరపై జాన్వీకపూర్ మొదటిసారి కనిపించిన ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్, శ్రుతి మరాఠే, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్ కీలక పాత్రల్లో నటించారు.
కథ ఏమిటంటే?
ఏపీ, తమిళనాడు సరిహద్దు రత్నగిరి ప్రాంతమది. సముద్రాన్ని ఆనుకొని ఉన్న ఓ కొండపై ఉండే నాలుగు ఊళ్లను కలిపి ఎర్ర సముద్రం అని పిలుస్తుంటారు. ఆ పేరు వెనక బ్రిటిష్ కాలం నుంచి చరిత్ర ఉంటుంది. ఆ నాలుగు ఊళ్ల అవసరాల కోసం దేవర (ఎన్టీఆర్), భైర (సైఫ్ అలీఖాన్) వాళ్ల అనుచరులతో కలిసి ఎర్ర సముద్రం గుండా ప్రయాణించే నౌకలపై ఆధారపడుతుంటారు. ఆ నౌకల్లో అక్రమ ఆయుధాల్ని దిగుమతి చేసుకుంటుంది మురుగ (మురళీశర్మ) గ్యాంగ్. సంద్రానికే ఎదురెళ్లి ఒడ్డుకు చేరుస్తున్న ఆ ఆయుధాలు తమకే ముప్పు తీసుకొస్తున్నాయని గ్రహించిన దేవర.. ఇక ఆ పనులు చేయకూడదని నిర్ణయానికి వస్తాడు. బతకడానికి ఎన్నో మార్గాలున్నాయి, చేపలు పట్టడంపై దృష్టి సారిద్దామని చెబుతాడు. కానీ భైర అందుకు అంగీకరించడు. దాంతో వారిద్దరి మధ్య అంతర్యుద్ధం ప్రారంభమౌతుంది. దేవరను అడ్డు తప్పించి సంద్రాన్ని శాసించాలని భైర భావిస్తాడు. దేవర మాత్రం తాను అజ్ఞాతంలో ఉంటూ సంద్రం ఎక్కాలంటేనే భయపడేలా చేస్తుంటాడు. ఆ భయం ఎన్ని తరాలు కొనసాగింది? అజ్ఞాతంలో ఉన్న దేవర కోసం ఆయన కొడుకు వర (ఎన్టీఆర్) ఏం చేశాడు? వరను ఇష్టపడిన తంగం (జాన్వీకపూర్) ఎవరు అన్న విషయాలు తెలియాలంటే సినిమా చూడాలి.