30 నగరాల్లో దేవానంద్ సినిమాల పండుగ!
లెజెండరీ స్క్రీన్ ఐకాన్ దేవానంద్ 100 వ పుట్టిన రోజుని పురస్కరించుకుని ‘దేవానంద్ @100 - ఫరెవర్ యూత్‌ఫుల్’ పేరిట రెండు రోజుల చలన చిత్రోత్సవాల్ని నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది.
లెజెండరీ స్క్రీన్ ఐకాన్ దేవానంద్ 100 వ పుట్టిన రోజుని పురస్కరించుకుని ‘దేవానంద్ @100 - ఫరెవర్ యూత్‌ఫుల్’ పేరిట రెండు రోజుల చలన చిత్రోత్సవాల్ని నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఫిలిం హెరిటేజ్ ఫౌండేషన్ (ఎఫ్ హెచ్ ఎఫ్) ఈ శత జయంతి ఉత్సవాల్ని నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. సెప్టెంబర్ 23, 24 తేదీల్లో దేశ వ్యాప్తంగా 30 నగరాల్లోని 55 సినిమా హాళ్ళలో రెండు రోజుల పాటు వేడుకలు నిర్వహించనున్నారు. దేవానంద్ శత జయంతి సెప్టెంబర్ 26 న. ఎవర్ గ్రీన్ రోమాంటిక్ స్టార్ దేవానంద్ నటించిన క్లాసిక్స్ , ‘హమ్ దోనో’, ‘తేరే ఘర్ కే సామ్నే’, ‘సిఐడి’, ‘గైడ్’ సినిమాలు ఈ చిత్రోత్సవాల్లో భాగంగా వుంటాయి.
నేషనల్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ ఎఫ్ డి సి), నేషనల్ ఫిలిం ఆర్కైవ్ ఆఫ్ ఇండియా (ఎన్ ఎఫ్ ఏ ఐ) ల సహకారంతో ఫిలిం హెరిటేజ్ ఫౌండేషన్ ఈ పండుగని చేపట్టింది. కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ నిధులు అందిస్తోంది. ఈ చలనచిత్రోత్సవాలకి వేదికని అందించేందుకు పీవీఆర్- ఐనాక్స్ మల్టీప్లెక్స్ గ్రూపు ముందుకొచ్చింది.
దేవానంద్ నటించిన సూపర్ హిట్స్ సిఐడి (1956), గైడ్ (1965), జ్యువెల్ థీఫ్ (1967), జానీ మేరా నామ్ (1970) ప్రింట్ల పునరుద్ధరణని నేషనల్ ఫిలిం హెరిటేజ్ మిషన్‌లో భాగంగా చేపట్టారు. దేవానంద్ నట వైభవాన్ని కొత్త తరానికి చాటి, తద్వారా దేవానంద్ పై వ్యామోహాన్ని మళ్ళీ పుంజుకునేలా చేసేందుకు సరికొత్త పునరుద్ధరణలతో పై నాలుగు సినిమాల్ని ట్రెండీగా మార్చేందుకు కృషి చేస్తున్నారు.
సినిమా నిర్మాత, ఆర్కైవిస్ట్ శివేంద్ర సింగ్ దుంగార్‌పూర్ స్థాపించిన ఫిలిం హెరిటేజ్ ఫౌండేషన్ (ఎఫ్ హెచ్ ఎఫ్) ఫెస్టివల్ కోసం పై నాలుగు సినిమాలని ఎంపిక చేసింది. ‘సిఐడి’ (1956), ‘గైడ్’ (1965), ‘జువెల్ థీఫ్’ (1967) ‘జానీ మేరా నామ్’ (1970) నాల్గూ అతిపెద్ద మ్యూజికల్ హిట్స్ కావడంతో పండుగ ప్రేక్షకుల్ని అలరించగలవు. న్యూఢిల్లీ, ముంబాయి, హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, ట్రివేండ్రం, కొచ్చి, అహ్మదాబాద్, లక్నో, కోల్‌కతా, గౌహతి, ఇండోర్, జైపూర్, నాగ్‌పూర్, గ్వాలియర్, రూర్కెలా, మొహాలీ వంటి నగరాల్లోని ప్రేక్షకులు ఈ సినిమా పండుగలో భాగం అయ్యేందుకు అవకాశం లభిస్తోంది. పెద్ద స్క్రీన్స్ పై ప్రదర్శనకి అనువుగా 4కె రిజల్యూషన్‌లో ఈ పునరుద్ధరణ (రీ మాస్టరింగ్) జరిగింది. అనేక నగరాల్లో విస్తరించి వున్న వందలాది మంది పునరుద్ధరణ కళాకారులు, సాంకేతిక నిపుణులు, గ్రేడర్లు, సౌండ్ ఇంజనీర్లు రీ మాస్టరింగ్ లో పాలుపంచుకున్నారు.
ఇదివరకు ఎఫ్ హెచ్ ఎఫ్ 'బచ్చన్ బ్యాక్ టు ది బిగినింగ్', 'దిలీప్ కుమార్-హీరో ఆఫ్ హీరోస్' సినిమా పండుగల్ని విజయవంతంగా నిర్వహించిన తర్వాత, దేవానంద్ శతజయంతికి దేవానంద్ చలనచిత్ర జీవితంలో మైలురాళ్ళ వంటివైన పై నాలుగు సినిమాల ప్రదర్శన ఆయనకి చిరస్మరణీయ నివాళి కాగలవు.
దేవానంద్ ని ‘ది గ్రెగరీ పెక్ ఆఫ్ ఇండియా’ అని పిలిచేవారు. గ్రెగరీ పెక్ (1916-2003) ఆస్కార్ అవార్డు పొందిన ఆ నాటి ప్రసిద్ధ హాలీవుడ్ స్టార్. 1940-70 మధ్య కాలంలో 55 సినిమాల్లో నటించాడు. ‘రోమన్ హాలిడే’, ‘గన్స్ ఆఫ్ నవరోన్’, ‘మెకెన్నాస్ గోల్డ్’ వంటి ప్రసిద్ధ సినిమాల్లో నటించాడు. 1950ల నాటి సినిమాల్లో చూస్తే గ్రెగరీ పెక్ కి దేవానంద్ పోలికలు వుంటాయి. దేవానంద్ ని దేశీయ సినిమాకి శాశ్వత లెజెండ్‌గా మార్చిన పై నాల్గు హిందీ సినిమాల్ని చూసే అవకాశం వర్తమాన ప్రేక్షకులకి కలగడం నిజంగా అదృష్టం.
తన తండ్రి 100 వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎఫ్‌హెచ్‌ఎఫ్ ఫెస్టివల్ ని నిర్వహించడం సంతోషంగా వుందని దేవానంద్ కుమారుడు సునీల్ ఆనంద్ పేర్కొన్నాడు. సునీల్ ఆనంద్ ని 1984 లో ‘ఆనంద్ ఔర్ ఆనంద్’ ద్వారా దేవానంద్ పరిచయం చేశారు. 1988 లో మరో సినిమా నటించిన తర్వాత హీరోగా ఆకట్టుకోలేక సునీల్ ఆనంద్ విరమించుకున్నాడు.
దేవానంద్ నటుడే గాక నిర్మాత, దర్శకుడు, రచయిత కూడా. నవకేతన్ బ్యానర్ స్థాపించి 35 సినిమాలు తన దర్శకత్వంలో నిర్మించి నటించారు. వీటిలో 18 సూపర్ హిట్టయ్యాయి. 1946 లో ‘హమ్ ఏక్ హై’ తో నట జీవితం ప్రారంభించి, 2011 లో తన దర్శకత్వంలో ‘చార్జి షీట్’ వరకూ 100 కి పైగా సినిమాలు నటించారు. ‘హరేరామ హరేకృష్ణ’, ‘గ్యాంబ్లర్’, ప్రేమ్ పూజారీ’, ‘తేరే మేరే సప్నే’, ‘అమీర్ గరీబ్’ నటించిన కొన్ని ప్రముఖ సినిమాలు.
దేవానంద్ తో నటించిన ప్రసిద్ధ హీరోయిన్లయితే మామూలుగా లేరు. మీనా కుమారి, సురయ్యా, మధుబాల, వహీదా రహెమాన్, హేమమాలిని, నూతన్, సాధన, మాలాసిన్హా, ఆశా పరేఖ్, ముంతాజ్ మొదలైన వారు కనిపిస్తారు. ఇక దర్శకుడుగా దేవానంద్ పరిచయం చేసిన హీరోయిన్లు జీనత్ అమన్, టీనా మునిమ్, టబు, రిచా శర్మ, ఏక్తా మొదలైన వారు.
దేవానంద్ సినిమాల్లో ధరించే జాకెట్‌లు, రంగురంగుల కాస్ట్యూమ్స్ కొత్త ఫ్యాషన్ ట్రెండ్స్ ని సెట్ చేసేవి. ఆయన హెయిర్‌స్టయిల్ ని కూడా అభిమానులు కాపీ కొట్టేవారు. దేవానంద్ ఈజీగా హాలీవుడ్‌కి వెళ్ళొచ్చు. వాస్తవానికి, ఒక ప్రసిద్ధ హాలీవుడ్ కాస్టింగ్ ఏజెన్సీ ఆయన కోసం హాలీవుడ్ ప్రాజెక్ట్స్ ని తెచ్చింది కూడా. కానీ మాతృభూమి భారతదేశంలోనే వుండాలని ఆయన నిర్ణయించుకున్నారు.
ఫిలిమ్ ఫేర్ అవార్డులతో బాటు జాతీయ అవార్డులు, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డూ పొందిన ధరమ్ దేవ్ పిషోరీమల్ ఆనంద్, తన సున్నిత, సునిశిత నటనతో ప్రపంచ ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్రవేసి 88వ యేట, 2011 సెప్టెంబర్ 26న సెలవు తీసుకున్నారు. పండుగ టిక్కెట్లని www.pvrcinemas.com లో కొనుగోలు చేయవచ్చు.