సినీ కార్మికుల వేతనాలు పెరిగాయి

ఎట్టకేలకు సినీ కార్మికులు తాము అనుకున్న డిమాండ్ ను సాధించుకున్నారు. వీళ్ల వేతనాలు పెరిగాయి. పెరిగిన వేతనాల్ని ఫిలిం ఛాంబర్ పెద్దలు వెల్లడించారు. అయితే ఇక్కడ కూడా కొన్ని చిక్కుముడులున్నాయి.

Advertisement
Update:2022-09-16 08:22 IST

నాలుగేళ్లుగా జీతాలు పెరగని కారణంగా సినీకార్మికులంతా గతంలో ఓసారి మెరుపు సమ్మె చేసిన సంగతి తెలిసిందే. దీంతో నిర్మాతలు ఈ అంశంపై చర్చించారు. అదే టైమ్ లో ఇతర సమస్యలు కూడా చుట్టుముట్టడంతో ఒకేసారి అన్ని సమస్యల్ని పరిష్కరించుకునేందుకు పలు కమిటీలు వేసిన సంగతి తెలిసిందే. అలా సినీ కార్మికుల వేతనాలపై వేసిన కమిటీ, ఎట్టకేలకు తన సూచనల్ని ఫిలిం ఛాంబర్ కు పంపించింది. తుది సమావేశంలో ఆ సూచనల్ని ఫిలిం ఛాంబర్ ఆమోదించింది.

తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ మధ్య జరిగిన చర్చలు సఫలీకృతం అయ్యాయి. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి 2018 లో చేసిన ఒప్పందాన్ని అనుసరించి ఆ వేతనాల మీద పెద్ద సినిమాలకు పనిచేసే కార్మికులకు 30శాతం, చిన్న సినిమాలకు పని చేసే కార్మికులకు 15 శాతం వేతనాలు పెంచేందుకు అంగీకరించింది.

పెంచిన వేతనాలు ఈ ఏడాది జులై 1 నుంచి అమల్లోకి వస్తాయి. అంతేకాదు.. ఇక్కడే మరో చిన్న మెలిక కూడా పెట్టింది మండలి. మధ్యలో మరోసారి కార్మికులు వేతనాల పెంపు గురించి డిమాండ్ చేయకుండా.. ఇప్పుడు పెంచిన వేతనాలు 2025, జులై 30 వరకు అమల్లో ఉంటాయని కూడా ప్రకటించింది.

అంటే.. 2025 వరకు మళ్లీ వేతనాలు పెంచేది లేదని పరోక్షంగా వెల్లడించింది మండలి. ఇదేమంత పెద్ద అభ్యంతరకరం కాదు. అభ్యంతరం వ్యక్తం చేసే అంశం ఒకటే. ఏది చిన్న సినిమా? ఏది పెద్ద సినిమా? ఓ పెద్ద సినిమాకు పని చేసినప్పటికీ, తమది చిన్న సినిమా అని చెప్పి 15శాతం పెంపుతోనే నిర్మాతలు సరిపెట్టే ప్రమాదం ఉంది. దీనిపై మండలి క్లారిటీ ఇవ్వలేదు.

ఏది చిన్న సినిమా, ఏది పెద్ద సినిమా అనే అంశాన్ని చలన చిత్ర వాణిజ్య మండలి, ఎంప్లాయిస్ ఫెడరేషన్ లతో కూడిన కమిటీ ఎప్పటికప్పుడు సినిమా ప్రాతిపదికన నిర్ణయిస్తుందట. దీనిపై మాత్రం అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది.

Tags:    
Advertisement

Similar News