Pawan Chiranjeevi: పవన్ రాజకీయాలపై చిరు రియాక్షన్
Pawan Chiranjeevi: పవన్ కల్యాణ్ రాజకీయాలకు సరిగ్గా సరిపోతాడని మరోసారి తన అభిప్రాయాన్ని వెల్లడించారు చిరంజీవి. ఎప్పటికైనా పవన్ కల్యాణ్, రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఎదుగుతారనేది చిరు అభిప్రాయం.
చిరంజీవి రాజకీయాలు వదిలేశారు, సినిమాలతో బిజీ అయ్యారు. పవన్ కల్యాణ్ సినిమాలు తగ్గించారు, రాజకీయాలతో బిజీ అవుతున్నారు. తమ్ముడి రాజకీయాలపై అన్నయ్య పలుమార్లు స్పందించారు. ఈసారి ఇంకాస్త ఎక్కువగా రియాక్ట్ అయ్యారు. ప్రస్తుత రాజకీయాలకు తమ్ముడు సరిగ్గా సరిపోతాడని అన్నారు అన్నయ్య చిరంజీవి.
"రాజకీయాల్లో రాణించడం చాలా కష్టం. రాణించాలంటే సెన్సిటివ్ గా ఉండకూడదు. బాగా రాటుదేలాలి. మొరటుగా తయారవ్వాలి. ఎన్నో మాటలు అనాలి, అనిపించుకోవాలి. నాకు అవసరమా ఇదంతా. పవన్ మాత్రం తగినవాడు. అంటాడు, అనిపించుకుంటాడు. పవన్ లాంటి వాళ్లకు రాజకీయాలు సరిపోతాయి. మీరంతా అతడికి సహాయసహకారాలు అందించి, ఆశీర్వదించాలి. పవన్ ను ఏదో ఒకరోజు అత్యున్నతమైన స్థానంలో చూస్తాం."
ఇలా ప్రస్తుత రాజకీయాలపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూనే, పవన్ కల్యాణ్ సరిగ్గా సరిపోతాడని అభిప్రాయపడ్డారు చిరంజీవి. ఓ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి, ఇలా పవన్ రాజకీయాలపై సూటిగా స్పందించారు.
భవిష్యత్తులో తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఒక్క శాతం కూడా లేదని తేల్చిచెప్పారు చిరంజీవి. తను మనసులో ఏదైనా అనుకుంటే కచ్చితంగా సాధిస్తానని, కానీ ఒక్క రాజకీయాల విషయంలో మాత్రం వెనక్కి తగ్గాల్సి వచ్చిందని చిరంజీవి పరోక్షంగా వ్యాఖ్యానించారు.