చిరు సార్.. మీరు తాతైనా ఎవర్ గ్రీన్ హీరోనే.. రోజా ట్వీట్

మెగాస్టార్ చిరంజీవి, రోజా కలిసి చాలా సినిమాల్లో నటించారు. అందువల్ల వారిద్దరి మధ్య సత్సంబంధాలే ఉన్నాయి.

Advertisement
Update:2023-06-21 21:47 IST

చిరు సార్.. మీరు తాతైనా ఎవర్ గ్రీన్ హీరోనే.. రోజా ట్వీట్

మెగాస్టార్ చిరంజీవి, రోజా కలిసి చాలా సినిమాల్లో నటించారు. అందువల్ల వారిద్దరి మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. రోజా మంత్రి అయిన తర్వాత కూడా చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. అయితే ఇటీవల మంత్రి రోజా పవన్ కళ్యాణ్ ను విమర్శించే క్రమంలో మెగా ఫ్యామిలీ మొత్తాన్ని కలిపి తిట్టారు. మెగా బ్రదర్స్ ఏనాడు ప్రజలకు చిన్న సహాయం కూడా చేసింది లేదని చెప్పారు. వారు రాష్ట్రానికి, ప్రజలకు, కనీసం వారి సొంత జిల్లా ప్రజలకు కూడా ఏమీ చేయలేదు కాబట్టే సొంత నియోజకవర్గాల నుంచి పోటీ చేసి చిత్తుచిత్తుగా ఓడిపోయారని విమర్శించారు. మెగా ఫ్యామిలీలో ఎవరికీ రాజకీయ భవిష్యత్తు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, రోజా చేసిన వ్యాఖ్యలు చిరంజీవిని కూడా బాధపెట్టాయి. రోజా పేరు ఎత్తకుండానే చిరు ఆమెను విమర్శించారు. 'నన్ను తిడితేనే వాళ్లకి గుర్తింపు లభిస్తుంది. అడ్డదారిలో గుర్తింపు కోరుకునేవారు నన్ను, నా ఫ్యామిలీని తిడుతుంటారు. నేను ఎవ్వరికీ సహాయ కార్యక్రమాలు చేయడం లేదని అంటున్నారు. నా గురించి అందరికీ తెలుసు. అది వారికి కూడా తెలుసు' అంటూ రోజాకు చిరు గట్టిగానే జవాబు ఇచ్చారు.

ఈ వ్యవహారం తర్వాత చిరంజీవి, రోజా మధ్య కొంత దూరం అయితే పెరిగింది. అయితే ఇప్పుడు రోజా ఆ దూరాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేశారు. నిన్న రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఆడబిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. పెళ్లయిన 11 ఏళ్లకు పాప జన్మించడంతో చాలామంది సెలబ్రిటీలు చరణ్, చిరంజీవిలకు శుభాకాంక్షలు చెప్పారు. రోజా కూడా చిరంజీవి కుటుంబానికి విషెస్ చెప్పారు. అందరిలా కాకుండా ఒక సుదీర్ఘ ట్వీట్ చేశారు. చరణ్ నిన్ను చిన్నప్పుడు ఎత్తుకున్న రోజులు గుర్తుకు వచ్చాయని పేర్కొన్నారు.

'తాత అయిన చిరంజీవి గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. దేవుడి దయవల్ల మెగా ప్రిన్సెస్ మీ కుటుంబంలో చేరింది. మై డియర్ రామ్ చరణ్ నువ్వు చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు నిన్ను నా చేతులతో హత్తుకున్న రోజులు నాకింకా గుర్తున్నాయి. ఆ రోజులు మరొకసారి గుర్తుకొచ్చాయి. అలాంటిది ఇప్పుడు నువ్వే తండ్రివి అయ్యావన్న వార్త సంతోషాన్ని కలిగించింది. చిరంజీవి సార్.. మీరు తాత అయినప్పటికీ మీరు ఎప్పటికీ ఒక ఎవర్ గ్రీన్ హీరోనే. ఉపాసనకు నా దీవెనలు. మీ ఇంటి చిన్ని మహాలక్ష్మి ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాను.' అని రోజా ట్వీట్ చేశారు.



రోజా తన ట్వీట్ ద్వారా చిరంజీవి కుటుంబానికి దగ్గర అయ్యే ప్రయత్నం చేశారనే చెప్పాలి. కాగా, రోజా ట్వీట్ కి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది. మెగా అభిమానులు కొందరు రోజాను ట్రోల్స్ చేస్తుండగా.. మరి కొందరు మాత్రం మెగా ప్రిన్సెస్ కు ఆశీస్సులు అందించినందుకు ధన్యవాదాలు చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News