Captain Miller Movie Review: కెప్టెన్ మిల్లర్ -రివ్యూ! {2.5/5}

Captain Miller Movie Review: తమిళంలో సంక్రాంతికి విడుదలైన ‘కెప్టెన్ మిల్లర్’ తెలుగులో ఈ వారం విడుదలైంది.

Advertisement
Update:2024-01-27 15:22 IST

చిత్రం: కెప్టెన్ మిల్లర్

రచన-దర్శకత్వం : అరుణ్ మాథీశ్వరన్

తారాగణం : ధనుష్, ప్రియాంకా అరుళ్ మోహన్, నివేదితా సతీష్, సందీప్ కిషన్, శివరాజ్ కుమార్, అబ్దుల్ లీ తదితరులు

సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, ఛాయాగ్రహణం: సిద్థార్థ్ నూని

బ్యానర్ : సత్య జ్యోతి ఫిలిమ్స్

విడుదల : జనవరి 26, 2024

రేటింగ్: 2.5/5

తమిళంలో సంక్రాంతికి విడుదలైన ‘కెప్టెన్ మిల్లర్’ తెలుగులో ఈ వారం విడుదలైంది. ఇది ధనుష్ 47వ సినిమా. విభిన్న పాత్రలు పోషించే ధనుష్ ఈ సారి బ్రిటిష్ కాలపు పాత్రతో ప్రేక్షకుల ముందుకు యాక్షన్ హీరోగా వచ్చాడు. ఈ యాక్షన్ ఏమిటో,మిగతా విషయాలేమిటో వరుసగాపరిశీలిద్దాం...

కథ

1930 లలో బ్రిటిష్ పాలనా కాలంలో అగ్ని (ధనుష్) అనే గ్రామస్థుడు, గ్రామంలో గుళ్ళోకి ప్రవేశమివ్వని గ్రామ పెద్ద రాజాధిపతి (జయప్రకాష్) తో కుల సమస్యల కారణంగా మంచి జీవితం కోరుకుని బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో చేరతాడు. బ్రిటిష్ పాలనకి వ్యతిరేకంగా విప్లవానికి నాయకత్వం వహిస్తున్న అగ్ని అన్న శివన్న (శివరాజ్ కుమార్) దీన్ని వ్యతిరేకిస్తాడు. అగ్ని గ్రామ పెద్ద కూతురైన డాక్టర్ భానుమతి (ప్రియాంకా అరుళ్ మోహన్) ని ప్రేమించి, ఆమె వేరొకరితో ప్రేమలో వుందని తెలుసుకుని విరమించుకుంటాడు. బ్రిటిష్ సైన్యంలో చేరిన అగ్నికి మిల్లర్ అని పేరుపెడతాడు జనరల్ ఆండ్రూ వెండీ (ఎడ్వర్డ్ సానెన్ బ్లిక్). అగ్ని మిల్లర్ కి ముందు కెప్టెన్ అని తగిలించుకుంటాడు.

ఇలా సైన్యంలో పనిచేస్తున్న కెప్టెన్ మిల్లర్ ని, ఒక బహిరంగ సభలో స్వాతంత్ర్య సమర యోధుల్ని కాల్చి చంపమని బలవంతం చేస్తాడు జనరల్ వెండీ. కెప్టెన్ మిల్లర్ తోటి సైనికులు రఫీక్ (సందీప్ కిషన్), స్టీఫెన్‌ ( అబ్దుల్ లీ) లతో కలిసి, స్వాతంత్ర్య సమరయోధుల మృతదేహాల్ని పారవేస్తున్నప్పుడు, స్టీఫెన్ అపరాధభావంతో ఆత్మహత్య చేసుకుంటాడు. కెప్టెన్ మిల్లర్ జనరల్ వెండీ ని చంపేసి ఆత్మహత్య చేసుకోబోతాడు. రఫీక్ అతడ్ని ఆపి, గ్రామానికి తిరిగి వెళ్ళిపొమ్మంటాడు. గ్రామానికి తిరిగి వచ్చిన కెప్టెన్ మిల్లర్ తన అన్న విప్లవకారుడు శివన్న కూడా స్వాతంత్ర్య యోధులతోబాటు చనిపోయాడని తెలుసుకుంటాడు. గ్రామస్థులు మిల్లర్ ని దూషించి బహిష్కరిస్తారు. మిల్లర్ వెళ్ళి బ్రిటిషర్ల ఆధీనంలో వున్న పురాతన విగ్రహాన్ని దొంగిలించి పారిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథ.

ఎలావుంది కథ

అంతరానితనం, బ్రిటిష్ దౌర్జన్యాలు, మధ్యలో విగ్రహం- కథలో విషయం కంటే విరామం లేని విపరీత పోరాటాలే కనిపిస్తాయి. కుల వివక్షపై ఈ మధ్య వస్తున్న తమిళ సినిమాల వరసలో ఇదొకటి. కాకపోతే బ్రిటిష కాలపు కథ. ‘ఇప్పుడు బ్రిటీషోళ్ళ కింద బ్ర తుకుతున్నాం. వాళ్ళు వెళ్ళి పోతే ఇక్కడి రాజుల కింద బ్రతుకుతాం. వీళ్ళ కంటే తెల్లోళ్ళే నయం. ఇక్కడ వుంటే మనల్ని చెప్పులు కూడా వేసుకోనివ్వరు. అదే బ్రిటిష్ సైన్యంలో చేరితే బూట్లు ఇస్తారు. ఇక్కడ మనల్ని గుళ్ళోకి రానివ్వరు. అక్కడ వాళ్ళు పక్కన కూర్చోపెట్టుకుని మంచి భోజనం పెడతారు. దేన్ని స్వాతంత్ర్యం అనాలి?’ అని కథానాయక పాత్రలో ధనుష్ వేసే సూటి ప్రశ్న. ఇదే గాంధీజీ భయం కూడా, స్వాతంత్ర్యం తర్వాత నయా దొరలకింద నలిగిపోతారు ప్రజలని.

అయితే ధనుష్ దేని గురించి పోరాడుతున్నాడో అర్ధం గాకుండా సాగుతుంది కథ. పాత్ర ఏం కోరుకుంటోందో ఒక లక్ష్యం లేకపోవడంతో రకరకాలుగా మారిపోతూంటుంది కథ. కులవివక్షపై అతను వేసిన సూటి ప్రశ్నకి సమాధానం బ్రిటిష్ సైన్యంలో చేరిపోవడమేనా? చేరిపోయినా పాలకులైన బ్రిటిషర్లని తాననుభవిస్తున్న కుల వివక్షని రూపుమాపమని అడగకూడదా? ప్రారంభించిన ఈ కథ బ్రిటిషర్లపై పోరాటంగా మారిపోతుంది. ఇంతలో విగ్రహం దొంగతనం చేసి గ్రామ పెద్దపై పోరాటంగా మారిపోతుంది. ఇలా ఇది ఏ కథ అనాలో, ధనుష్ ఏం కోరుకుంటున్నాడో అర్ధంగాకుండా సాగుతుంది. తిరిగి విగ్రహాన్ని గుడికి అప్పగిస్తే గుళ్ళో ప్రవేశం లభించే మంచి వాడయిపోతాడు!

కులవివక్షకి ఇదే పరిష్కారమైతే ఇక అందరూ విగ్రహా లెత్తుకు పోయి తర్వాత అప్పగించి సవర్ణులైపోతారు. వాస్తవికత లేకుండా శాశ్వత పరిష్కారం ఇలా జరుగుతుందా? అమెరికా గూఢచార సంస్థ సీఐఏ తమ కెదురయ్యే సమస్యలకి హాలీవుడ్ రచయితలు సరైన పరిష్కారాలు చెప్తారని సంప్రదిస్తూంటారు. బిన్ లాడెన్ ని పట్టుకుంటే ఏం చేయాలని అడిగితే, చంపకూడదని చెప్పాడు రచయిత. చంపితే మరింతమంది టెర్రరిస్టులు పుట్టుకొచ్చి అతడి భావజాలం చావదని చెప్పాడు. అతడ్ని పట్టుకుని అతడి వల్ల బాధితులైన, వికలాంగులైన, అనాధలైన కుటుంబాల ముందు అన్ని ప్రాంతాల్లో తిప్పుతూ, వాళ్ళడిగే ప్రశ్నలకి ఏం చెప్తాడో చెప్పుకోమనాలి. అలా అతడి భావజాలంలోని ఔచిత్యాన్ని అతడి చేతే ప్రపంచానికి ఎక్స్ ఫోజ్ చేసి, అతడి మత చట్టం షరియా ప్రకారమే బహిరంగ శిర విచ్ఛేదం గావించాలని, అంతే తప్ప ప్రత్యర్ధులైన అమెరికన్లు చంపకూడదని సలహా ఇచ్చాడు హాలీవుడ్ రచయిత.

కానీ ప్రభుత్వాలకి ఇలాటివి నచ్చవు. సమస్య ఇంకా మిగిలుండాలి. అందుకని పట్టుకుని అక్కడికక్కడే ఎన్ కౌంటర్ చేసేయాలి. బిన్ లాడెన్ కి ఇదే జరిగింది. ధనుష్ గ్రామ పెద్దని చంపి పరిష్కారమైందని భావించినట్టు.

ఫస్టాఫ్ పాత్రల పరిచయాలతో, గ్రామంలో పీడనలతో సాగి, ధనుష్ సైన్యంలో చేరిన తర్వాత, బహిరంగ సభలో స్వాతంత్ర్య యోధుల్ని చంపవలసి వచ్చే, కదిలించే ఏకైక భావోద్వేగ భరిత సన్నివేశం తప్ప మరేమీ లేదు ఈ సినిమాలో. ఆ తర్వాత ఉన్న ఈ భావోద్వేగం కూడా సెకండాఫ్ లో చెదిరిపోతుంది కథ విగ్రహం మీదికి మళ్ళడంతో. ఇంటర్వెల్లో విగ్రహం కాజేసే ఎపిసోడ్ మాత్రం యాక్షన్ తో చప్పట్లు కొట్టించుకుంటుంది.

ఇక సెకండాఫ్ లో విగ్రహం కోసం ధనుష్ ని పట్టుకోవడానికి బ్రిటిషర్ల దాడులు, ధనుష్ ఎదురు దాడులు, మరో పక్క ధనుష్ ని చంపాలని గ్రామ పెద్ద ప్రయత్నాలూ కలిసి అసలు ధనుష్ ఏం కోరుకుంటూన్నాడో అర్ధంగాని గందరగోళం. విషయంలోకి వెళ్లకుండా ఒకదానితర్వాత భారీ యాక్షన్ ఎపిసోడ్లు. ఇందులో ఇప్పుడున్న ఆధునిక ఆయుధాలు!

సినిమా నడకలో వేగం లేకపోవడం, కథని ఏవేవో చాప్టర్లుగా విడగొట్టి, వాటికి పేర్లివ్వడం, ఇలా చాలా గజిబిజి వుంది. యాక్షన్ ఎపిసోడ్లు కూడా ఓపికని పరీక్షిస్తూ ఎంతకీ ముగియవు. పైన చెప్పుకున్నట్టు, కథలో విషయం కంటే విరామం లేని విపరీత పోరాటాలే నిండిపోయి వుంటాయి. ఈ సినిమాతో దర్శకుడికంటే యాక్షన్ డైరెక్టర్లకే పనెక్కువలా కన్పిస్తుంది!

నటనలు-సాంకేతికాలు

ధనుష్ నటనని విషయాన్ని పక్కనబెట్టి యాక్షన్ ఎపిసోడ్లలో యాక్షన్ హీరోగానే చూడాలి. విషయం, లక్ష్యం లేవుగాబట్టి ఈ యాక్షన్ ఎపిసోడ్లలో కట్టిపడేసే ఎమోషన్లు, ఫీలింగులు చూడకూడదు. ఏదైనా ఎమోషన్ వుంటే అది ప్రకటించకుండా లోలోన దాచు కుంటాడు. పాత్రపరమైన ఆహార్యం, పాత్రలో ఒదిగిపోయేట్టున్న మేకోవర్ అతడి వృధా అయిపోయిన బలాలు.

అయితే ధనుష్ పాత్ర తప్ప మిగతా ఎవరి పాత్రలకీ తగిన స్పేస్ లేదు. ఆఖరికి సందీప్ కిషన్ పాత్రకి కూడా ప్రాధాన్యం లేదు. హీరోయిన్ ప్రియాంకా అరుళ్ మోహన్ పాత్రయితే మిస్సింగ్ ఇన్ యాక్షన్. ‘జైలర్’ లో ప్రత్యేక ముద్ర వేసిన కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ సైతం కాసేపే కనిపిస్తాడు. గ్రామ పెద్దగా జయప్రకాష్ డిటో. గ్రామ పెద్ద కొడుకుగా జాన్ కొక్కెన్ పాత్రది అకాల మరణం.

తెర వెనుక దర్శకుడు తప్ప భారీ పోరాటాలతో యాక్షన్ డైరెక్టర్లు, అదరగొట్టే సంగీతంతో సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ కుమార్, ఆకర్షణీయమైన పీరియడ్ లుక్ తో ఛాయాగ్రహకుడు సిద్దార్థ నూని, అత్యున్నత నిర్మాణ విలువలతో నిర్మాతా –వీళ్ళే కెప్టెన్ మిల్లర్ కి అసలైన శ్రామికులనాలి. కులసమస్యల మీద సినిమాలు ఒక ట్రెండ్ గా నడుస్తున్న తమిళ సినిమాల పక్కన దీన్ని పెట్టి చూస్తే ‘జైభీమ్’ కి చాలా దూరంలో కనిపిస్తుంది.

Tags:    
Advertisement

Similar News