బాయ్ కాట్ ట్రెండ్ మంచిదే.. స్టార్ డైరెక్టర్ కామెంట్స్
బాయ్ కాట్ ట్రెండ్ వల్ల సినిమాలకు నష్టం వాటిల్లుతోందని ఇండస్ట్రీలోని అందరూ భావిస్తుండగా ది కశ్మీర్ ఫైల్స్ సినిమా డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి మాత్రం బాయ్ కాట్ ట్రెండ్ బాలీవుడ్ కి మేలే చేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
బాలీవుడ్ ని కొన్ని నెలలుగా బాయ్ కాట్ ట్రెండ్ వణికిస్తోంది. పలువురు అగ్రహీరోలు, దర్శకులు, నిర్మాతలు తీస్తున్న సినిమాలను చూడొద్దని నెటిజన్లు ట్విట్టర్ వేదికగా ఒక పోరాటం చేస్తున్నారు. ఈ బాయ్ కాట్ ట్రెండ్ వల్ల చాలా సినిమాలకు నష్టం వాటిల్లింది. లాల్ సింగ్ చద్దా విడుదల సమయంలో తన సినిమాను బాయ్ కాట్ చేయొద్దని ఆ సినిమాలో హీరోగా నటించిన అమీర్ ఖాన్ స్వయంగా ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు.
ఈ సినిమాతో పాటు ఇటీవల విడుదలైన బ్రహ్మాస్త్ర, లైగర్ సినిమాలను బాయ్ కాట్ చేయాలని ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా ఒక హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేశారు. త్వరలో విడుదల కానున్న హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ ల సినిమా విక్రమ్ వేదా సినిమాకు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. బాయ్ కాట్ ట్రెండ్ వల్ల సినిమాలకు నష్టం వాటిల్లుతోందని ఇండస్ట్రీలోని అందరూ భావిస్తుండగా ది కశ్మీర్ ఫైల్స్ సినిమా డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి మాత్రం బాయ్ కాట్ ట్రెండ్ బాలీవుడ్ కి మేలే చేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయన ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ ' బాలీవుడ్ లో చాలామంది హీరోలు, దర్శకులు, సినిమా అంటే ఫార్ములా, ప్యాకేజీ అని ఒక కమర్షియల్ మూసలో కొట్టుకు పోతున్నారు. పరమ రొటీన్ కథలు, పాత కథలనే అటూ ఇటూ మార్చి సినిమాలు తీసి జనం మీదకు వదులుతున్నారు. ఇలాంటి సినిమాలు చూసి చూసి విసుగు వచ్చిన ప్రేక్షకులు బాయ్ కాట్ ట్రెండ్ ని తీసుకు వస్తున్నారు. ఈ బాయ్ కాట్ ట్రెండ్ కి భయపడి అయిన బాలీవుడ్ మేకర్స్ మంచి సినిమాలు తీసే అవకాశం ఉంది.
ఈ విధంగా బాయ్ కాట్ ట్రెండ్ మంచిదే. బాయ్ కాట్ ట్రెండ్ భవిష్యత్తులో బాలీవుడ్ కు మంచి ఫలితాలను తీసుకు వస్తుందని నేను నమ్ముతున్నాను.' అని ఆయన కామెంట్స్ చేశారు. కరీనా కపూర్, అలియాభట్ అగ్ర హీరోయిన్లు బాయ్ కాట్ ట్రెండ్ పై నెటిజన్లను తీవ్రంగా విమర్శిస్తూ ఉండగా.. డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి మాత్రం బాయ్ కాట్ ట్రెండ్ కు మద్దతుగా మాట్లాడటం సంచలనంగా మారింది.