బింజ్ వాచింగ్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త!

ఇప్పుడు ఓవర్ ది టాప్ ఓటీటీ సెక్టార్ కి సంబంధించి ఎక్కువగా వినబడుతున్న మాట బింజ్ వాచింగ్. అంటే ఓటీటీ కంటెంట్ ని అతిగా చూసేస్తూ కాలం గడిపేయడం. మామూలుగా కంటెంట్ ని చూసే వ్యసనం వుంటే అది సమస్య కాదు.

Advertisement
Update:2022-12-19 11:52 IST

బింజ్ వాచింగ్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త!

ఇప్పుడు ఓవర్ ది టాప్ ఓటీటీ సెక్టార్ కి సంబంధించి ఎక్కువగా వినబడుతున్న మాట బింజ్ వాచింగ్. అంటే ఓటీటీ కంటెంట్ ని అతిగా చూసేస్తూ కాలం గడిపేయడం. మామూలుగా కంటెంట్ ని చూసే వ్యసనం వుంటే అది సమస్య కాదు.

అతిగా చూసినప్పుడే వ్యసనం దుర్వ్యసనంగా మారుతుంది. బింజ్ వాచింగ్ అవుతుంది. ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఈ బింజ్ వాచింగ్ కి లోనుజేయడం ఓటీటీ కంపెనీల ప్రధాన ఉద్దేశం. దాదాపు ప్రతీ ఓటీటీ ప్లాట్ ఫామ్ అందించే కంటెంట్, దాని భాష, దృశ్యాలూ ఇటీవలి కాలంలో ఆందోళన కలిగించే స్థాయికి చేరుకున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా యువతపై బహుళ ప్రభావాల ఉధృతికి కారణమవుతున్నాయని పేర్కొంటున్నారు.

అయినా ఎవరు లక్ష్యపెడుతున్నారు. బింజి బాబు బద్ధకంగా బెడ్ మీద వాలిపోయి బింజ్ వాచింగ్ కి ఇంకేమున్నాయా అని స్క్రోల్ చేస్తాడు. గజిబిజిగా చాలా కంటెంట్ కన్పిస్తోంది. ఏది చూడాలా అని గందరగోళంలో పడ్డాడు. బింజ్ వాచింగ్ కి కూడా మంచిదే చూడాలనుకుంటున్నాడు. ఆ మంచికి అతడి నిర్వచనం వేరు. ఆన్‌లైన్ వీడియో కంటెంట్‌ ని చూడడానికి ప్రతిరోజూ 8 గంటల 29 నిమిషాల కాలాన్ని పాడు చేసుకుంటున్న సగటు ఇండియన్ యూత్ లో గర్వించేలా తనూ ఒకడు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ వినియోగదారుల సర్వే ఆధారంగా 2023 నాటికి భారతీయ ఓటీటీ మార్కెట్ 5 బిలియన్ డాలర్లకి చేరుకుంటుందని అంచనా వేసింది. మరి దీన్ని నిజం చేసే బాధ్యత తనలాంటి బింజి బాబుల భుజస్కంధాల పైనే వుంది. సమయం కూడా ఎక్కువ లేదు.

కంటెంట్ దాహంతో స్క్రోల్ చేసే బింజి బాబుల పని సులువు చేయడానికే ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ (సెప్టెంబర్ 30 త్రై మాసికానికి టర్నోవర్ 29.698 బిలియన్ డాలర్లు) పుష్ ప్లే అనే బటన్ ని పరీక్షిస్తున్నట్టు తెలుస్తోంది. అంటే వినియోగదారుల వీక్షణ ప్రాధాన్యతల ఆధారంగా ఇది కంటెంట్ ని సూచిస్తుంది. దీన్ని కంటెంట్ బాస్కెట్ గా భావించ వచ్చు. వినియోగదారుల టేస్టు ని బట్టి కంటెంట్ టైటిల్స్ ఇందులో దర్శన మిస్తాయి. ఈ బాస్కెట్ దగ్గర పెట్టుకుని బింజ్ వాచింగ్ చేసేయ వచ్చు. బింజి బాబు ఈ పుష్ ప్లే బటన్ కోసమే వెయిటింగ్. ఇది వీడి చేతికి చిక్కిందా ఇక బయట కన్పించడు, బాస్కెట్లోనే వుంటాడు.

ఈ బాస్కెట్ దేశ దేశానికీ మారుతుంది. నెట్ ఫ్లిక్స్ అనే కాదు, ఇతర కంపెనీలూ అనుసరించి బాస్కెట్స్ తో వచ్చేస్తాయి. వినియోగదారులు చూడగలిగే కంటెంట్‌ ని కంపెనీలు క్యూరేట్ చేస్తున్నందున వెతుక్కునే పనుండదు. అదే సమయంలో వినియోగదారుల అభిరుచుల్ని మార్చే, మరోవైపుకు తీసికెళ్ళే అధికారం కంపెనీల చేతికొచ్చేస్తుంది. ఇప్పటికే క్రైమ్, హార్రర్ అనేవి పాపులర్ జానర్లుగా భావించేలా చేసి తమ కంటెంట్ లైబ్రరీలని నింపేస్తున్నాయి. అంతే కాదు వెబ్ సిరీస్ మొత్తం సీజన్‌లు ఒకేసారి విడుదల చేసి, అతిగా చూసే (బింజ్ వాచింగ్) ట్రెండ్‌కి దోహదం చేస్తాయి.

ఈ కంపెనీల లక్ష్యం అంతులేని స్క్రోల్స్ ని సాధించడం, కంటెంట్‌ ని నిరంతరం నవీకరించడం. ఇంకా సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కంటెంట్‌ ని నిరంతరం కనిపెట్టడం. ఆన్‌లైన్ వీక్షణకి స్మార్ట్ ఫోన్స్ అంబాటులోకి రావడంతో, కంటెంట్ ని వ్యక్తిగతీకరించే దారులు పెరిగాయి- శృంగార కంటెంట్ సహా. ఇది శృంగార కంటెంట్‌తో మొదలై ముగియదు. మతం, రాజకీయాలు కూడా ఉన్మాద చిత్రీకరణలతో ముందుకొస్తాయి.

ఈ కంటెంట్ ప్రజల - ముఖ్యంగా యువత ఆలోచనా ప్రక్రియని, వైఖర్లునీ, ప్రవర్తనీ ప్రభావితం చేసే అపారమైన సామర్థ్యాన్ని కలిగి వుంటాయి. ప్రధానంగా దేశ వ్యతిరేక లేదా మత వ్యతిరేక కంటెంట్‌ ని ప్రదర్శించడం ద్వారా, తక్షణమే స్పందించేలా రెచ్చగొట్టడం ద్వారా, యువతలో ప్రతికూల సంస్కృతిని కంటెంట్ వ్యాప్తి చేసే ప్రమాదముంది.

బింజ్ వాచింగ్ కి ఈ కంటెట్ తోడవడమనేది ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. నిద్రలేమి, డిప్రెషన్, స్థూలకాయం, కంటిచూపు తగ్గడం వంటి పరిణామాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని చెప్తున్నారు. చదువు సంధ్యల సంగతి చెప్పక్కర్లేదు. ఆల్కహాల్, స్మోకింగ్, డ్రగ్స్ వంటివి ప్రోత్సహించేలా ఇప్పటికే వెబ్ సిరీస్‌లు మారాయి. ఇటీవల యువత పాల్పడిన నేరాలకు ఓటీటీ కంటెంటే కారణమని పోలీసులు చెప్తున్నారు.

కాబట్టి బింజ్ వాచింగ్ కూడా ఒక డ్రగ్. దీన్నుంచి తమని తాము కాపాడుకోక పోతే బింజి బాబులు ఎందుకూ పనికి రాకుండా పోతారు. దీన్నుంచి కాపాడుకునే మార్గాలున్నాయి. అవేమిటో చూద్దాం- పరిమితులు సెట్ చేసుకుని వాటిని కచ్చితంగా పాటించడం, ఒంటరిగా గాకుండా ఎవరితోనైనా కలిసి చూడడం, అప్పుడప్పుడు పాజ్ బటన్ ని నొక్కి చూడాలనిపించే కోరికని నియంత్రించడం, చూస్తున్నప్పుడు దృష్టి సోషల్ మీడియా వైపు పోతే చూడడం ఆపేయడం, నిద్ర వస్తున్నపుడు వెంటనే ఆపేయడం, వ్యాయామం వంటి మంచి అలవాట్లు అలవర్చుకోవడం వంటివి బింజ్ వాచింగ్ నుంచి దూరంగా వుంచుతాయి.

Tags:    
Advertisement

Similar News