'మాచర్ల' సినిమా వెనక కథ ఇదేనా?
నితిన్ హీరోగా నటించిన సినిమా మాచర్ల నియోజకవర్గం. ఈ సినిమా కథ వెనక ఆసక్తికర సందర్భాన్ని పంచుకున్నాడు నటుడు సముత్తరఖని.
మాచర్ల నియోజకవర్గం సినిమా కథ ఎలా పుట్టింది.. దీని కోసం దర్శకుడు రాజశేఖర్ రెడ్డి ఎలాంటి హోం వర్క్ చేశాడు. ఈ విషయాల గురించి తనకు తెలియదు కానీ, మాచర్ల నియోజకవర్గం సినిమాలో ఉన్న కథ, తమిళనాడులో యథాతథంగా జరిగిందని చెప్పుకొచ్చాడు సముత్తరఖని. ఈ సినిమాలో విలన్ గా నటించిన ఈ విలక్షణ నటుడు, తమ రాష్ట్రంలో జరిగిన ఘటనను గుర్తు చేసుకున్నాడు.
'గత ఏడాది దర్శకుడు రాజశేఖర్ మాచర్ల కథ చెప్పారు. చాలా నచ్చింది. తమిళనాడులోని ఓ ప్రాంతంలో ఇలాంటి సంఘటన జరిగింది. 25 ఏళ్లుగా అక్కడ ఎలక్షన్ జరగలేదు. చివరికి ఉదయ్ చందర్ అనే ఒక ఐఎఎస్ అధికారి చొరవ తీసుకొని అక్కడ స్థానికులతో మాట్లాడి పరిస్థితులని చక్కదిద్ది ఎన్నికలు జరిపారు. దర్శకుడు శేఖర్ తో కూడా అదే సంగతి చెప్పా. చాలా అద్భుతమైన కథ. తప్పకుండా చేస్తానని చెప్పా. ఇందులో నా పాత్రలో ఒక సర్ప్రైజ్ ఉంది. అది థియేటర్లో చూడాల్సిందే."
ఇలా సినిమా గురించి చెబుతూనే, తన పాత్రలో సర్ ప్రైజ్ ఉందనే విషయాన్ని బయటపెట్టాడు సముత్తరఖని. ఇక నితిన్ గురించి మాట్లాడుతూ.. "నితిన్ అద్భుతమైన వ్యక్తి. ఆయన చాలా ఎనర్జీటిక్ పాజిటివ్ వ్యక్తి. ఆయన కళ్ళల్లో చూసి కోపంగా డైలాగ్ చెప్పలేకపోయేవాడిని. ఆయనతో కలసి పని చేయడం మర్చిపోలేని జ్ఞాపకం." అంటూ పొగిడేశాడు.
త్వరలోనే నితిన్ హీరోగా, తన దర్శకత్వంలో సినిమా ఉంటుందని ప్రకటించాడు సముత్తరఖని. రెండేళ్ల క్రితమే సినిమా చేద్దామని తామిద్దరం మాట్లాడుకున్నామని.. సరైన సమయం వచ్చినప్పుడు తమ కాంబోలో సినిమా వస్తుందని ప్రకటించాడు.