Pathaan Movie: ఫిల్మ్ చలేగా హాల్ జలేగా.. పఠాన్ పై పగబట్టిన భజరంగ్ దళ్
Pathaan Movie controversy: సెన్సార్ బోర్డ్ అంగీకరించినా సినిమా ప్రదర్శనకు తాము అంగీకరించేది లేదంటూ భజరంగ్ దళ్, ఏబీవీపీ నాయకులు బీహార్ లో థియేటర్ల వద్ద గొడవ చేశారు. భాగల్ పూర్ లోని ఏ థియేటర్ లో అయినా పఠాన్ సినిమాను ప్రదర్శిస్తే తాము సహించేది లేదన్నారు.
పఠాన్ పై భజరంగ్ దళ్ పగబట్టింది. సినిమా ప్రదర్శన అడ్డుకుంటామని చెప్పింది. అంతే కాదు, అన్నంత పని కూడా చేసింది. బీహార్ రాష్ట్రంలోని భాగల్ పూర్ లో పఠాన్ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ వద్ద భజరంగ్ దళ్, ఏబీవీపీ నేతలు హల్చల్ చేశారు. బాగల్ పూర్ లోని దీప్ ప్రభ థియేటర్ వద్ద గొడవ చేశారు, పోస్టర్లు తగలబెట్టారు. థియేటర్ తగలబెట్టేస్తామని హెచ్చరించారు.
పఠాన్ సినిమా దేశభక్తిని ప్రభోదిస్తుందని చిత్ర యూనిట్ చెబుతున్నా.. ఆ సినిమాలో బేషరమ్ రంగ్ అనే పాట వివాదానికి కారణం అయింది. ఆ పాటలో హీరోయిన్ దీపికా పదుకోన్ కాషాయ బికినీలో కనపడుతుంది. కాషాయ వస్త్రాన్ని అపవిత్రం చేశారంటూ అప్పట్లోనే భజరంగ్ దళ్ గొడవ చేసింది. బీజేపీ నేతలు కూడా అప్పట్లో పెద్ద సీన్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత సెన్సార్ వాళ్లు ఆ కాషాయ బికినీ సీన్లను డిలీట్ చేసి సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ భజరంగ్ దళ్ కోపం తగ్గలేదు.
సెన్సార్ బోర్డ్ అంగీకరించినా సినిమా ప్రదర్శనకు తాము అంగీకరించేది లేదంటూ భజరంగ్ దళ్, ఏబీవీపీ నాయకులు బీహార్ లో థియేటర్ల వద్ద గొడవ చేశారు. భాగల్ పూర్ లోని ఏ థియేటర్ లో అయినా పఠాన్ సినిమాను ప్రదర్శిస్తే తాము సహించేది లేదన్నారు. ఈ సినిమాను దేశవ్యాప్తంగా బహిష్కరిస్తామని అన్నారు. కాషాయ రంగును, సనాతన ధర్మాన్ని అవమానించే సినిమా ప్రదర్శన జరగనివ్వబోమన్నారు. హిందూత్వం విషయంలో రాజీ పడలేమన్నారు. సనాతన సంస్కృతిని వ్యతిరేకించే దేన్నైనా భారత దేశం, భాగల్పూర్ సహించదంటున్నారు భజరంగ్ దళ్ నేతలు.
పోలీస్ ప్రొటెక్షన్ తో సినిమా..
భాగల్పూర్ లో థియేటర్ల యాజమాన్యాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. థియేటర్ల వద్ద గొడవలు జరుగుతున్నాయని తమకు రక్షణ కల్పించాలని కోరాయి. దీంతో పోలీసులు థియేటర్లకు రక్షణ ఏర్పాటు చేశారు. పోలీస్ ప్రొటెక్షన్ మధ్య రేపటి నుంచి పఠాన్ సినిమా ప్రదర్శించబోతున్నారు. బీహార్ లోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి పరిస్థితులో ఉన్నాయి. అక్కడ కూడా థియేటర్ల యాజమాన్యాలు పోలీసుల సాయం కోరాయి.