ప్రేక్షకులు పెరిగారు- చిన్న స్థాయి సినిమాలకి కాదు సుమా!

2023 లో సినిమా ప్రేక్షకుల సంఖ్య పెరిగిందా, తగ్గిందా? హిందీ సినిమాలతో పోల్చితే తెలుగు, తమిళ, కన్నడ సినిమాలని చూసే ప్రేక్షకుల సంఖ్య పెరిగిందా, తగ్గిందా? మలయాళ సినిమాల్ని చూసే ప్రేక్షకుల సంఖ్య ఎందుకు పెరిగింది? వీటికి సమాధానాల్ని కనుక్కునే ప్రయత్నం చేస్తే, 2023లో సినిమాలు చూసే ప్రేక్షకుల సంఖ్య 92 మిలియన్లకు (9 కోట్ల 20 లక్షలు) పెరిగింది.

Advertisement
Update:2024-04-24 15:29 IST
ప్రేక్షకులు పెరిగారు- చిన్న స్థాయి సినిమాలకి కాదు సుమా!
  • whatsapp icon

2023 లో సినిమా ప్రేక్షకుల సంఖ్య పెరిగిందా, తగ్గిందా? హిందీ సినిమాలతో పోల్చితే తెలుగు, తమిళ, కన్నడ సినిమాలని చూసే ప్రేక్షకుల సంఖ్య పెరిగిందా, తగ్గిందా? మలయాళ సినిమాల్ని చూసే ప్రేక్షకుల సంఖ్య ఎందుకు పెరిగింది? వీటికి సమాధానాల్ని కనుక్కునే ప్రయత్నం చేస్తే, 2023లో సినిమాలు చూసే ప్రేక్షకుల సంఖ్య 92 మిలియన్లకు (9 కోట్ల 20 లక్షలు) పెరిగింది. 2022 కంటే ఇది 58% పెరుగుదల. అలాగే హిందీ సినిమాలతో పోల్చితే తెలుగు, తమిళం, కన్నడ సినిమాలు చూసే ప్రేక్షకుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. కానీ మలయాళ సినిమా ప్రేక్షకుల సంఖ్య 19% పెరిగింది. 2022లో 10 మిలియన్ల (1 కోటి) మంది నుంచి 2023లో 12 మిలియన్ల (కోటీ 20 లక్షలు) కి మలయాళంప్రేక్షకుల సంఖ్య పెరిగింది. 2023లో దేశీయ సినిమా పరిశ్రమ గణనీయ అభివృద్ధిని నమోదు చేసింది. 2023 లో 157.4 మిలియన్ల మంది (15 కోట్ల 74 లక్షలు) ప్రేక్షకులు కనీసం ఒక్కసారైనా సినిమాకి హాజరయ్యారు. 2022 సంవత్సరంతో పోలిస్తే ఇది 29% పెరుగుదల. ఈ పెరుగుదల కోవిడ్ మహమ్మారి పూర్వ స్థాయుల్ని 8% అధిగమించింది.

మీడియా కన్సల్టింగ్ సంస్థ ఓర్మాక్స్ వెలువరించిన తాజా నివేదికలో పై సమాచారముండగా, దీనికి ట్రేడ్ నిపుణుల విశ్లేషణలు కూడా జత కలిశాయి. పై ఆకట్టుకునే సంఖ్యలతో 2023 లో బాక్సాఫీసు వసూళ్ళు మొదటిసారిగా రూ. 12,000 కోట్లకు మించినప్పటికీ, ఫుట్‌ ఫాల్స్ లో పెరుగుదల మాత్రం వెనుకబడే వుంది. ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్‌లని సందర్శిస్తున్నప్పటికీ, మహమ్మారి ముందు కంటే వచ్చినంత తరచుగా రావడం లేదని నివేదిక సూచిస్తోంది.

ప్రేక్షకులు ఎక్కువగా హోమ్ వ్యూయింగ్ ఆప్షన్ల వైపు మొగ్గుచూపడం, సినిమా హాళ్ళకి వెళ్ళడం ఖరీదైన వ్యవహారంగా మారడం, సినిమా హాళ్ళు ఎక్కువగా మల్టీప్లెక్సుల వంటి ప్రీమియం స్పేస్‌లు కావడంతో, ఫుట్‌ఫాల్స్ లో కనీసం 20 నుంచి 25% తగ్గుదల వుండవచ్చని ట్రేడ్ నిపుణులు సూచిస్తున్నారు. ఈ మార్పు వచ్చేసి ప్రేక్షకుల్లో గణనీయ భాగాన్ని థియేటర్లకి దూరం చేసే ప్రమాదం వుందనీ, స్టార్ పవర్ లేని చిన్న స్థాయి, కంటెంట్-ఆధారిత సినిమాలకి ఇది సవాలుగా మారే అవకాశముందనీ చెబుతున్నారు. పర్యవసానంగా, దేశీయ సినిమా పరిశ్రమ కొన్ని భారీ బడ్జెట్, స్టార్-ఆధారిత సినిమాల్ని ఉత్పత్తి చేయడంపై ఎక్కువగా ఆధారపడడం జరగవచ్చనేది సారాంశం.

ఓర్మాక్స్ నివేదిక ప్రకారం, జనవరి 2024 లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని 8,500 మంది ప్రేక్షకులతో నిర్వహించిన రీసెర్చి ఆధారంగా, ఈ 15 కోట్ల 74 లక్షల మంది సినిమా ప్రేక్షకులు 2023 లో దేశీయ బాక్సాఫీసుకి 943 మిలియన్ల (9 కోట్ల 43 లక్షలు) ఫుట్‌ ఫాల్స్ ని నమోదు చేశారు. ఇది సగటున ఆరు సినిమాలకి చేరుకుంది. అంటే అన్ని భాషల్లో ప్రతి వ్యక్తి చూసిన సినిమాల సంఖ్య ఆరు.

హిందీ సినిమాలు అత్యంత ముఖ్యమైన వృద్ధిని సాధించాయి. హిందీ ప్రేక్షకుల సంఖ్య 92 మిలియన్లకు, అంటే 9 కోట్ల 2 లక్షలకి పెరిగింది. 2022 కంటే ఇది 58% పెరుగుదల. మహమ్మారి తర్వాత థియేట్రికల్ వ్యాపారం బాగా పుంజుకుందని దీన్నిబట్టి అర్థమవుతున్నప్పటికీ, ఈ నివేదిక మార్కెట్‌లు, భాషలు, జనాభా మొదలైన వాటి స్థాయుల్లో రికవరీని అంచనా వేస్తోంది. తద్వారా దేశంలో థియేటర్లకి వెళ్ళే జనాభాపై లోతైన అవగాహనకి వీలు కల్పిస్తుంది.

2023 లో రూ. 12,226 కోట్ల స్థూల బాక్సాఫీసుని గమనిస్తే, ఇది 2019 నాటి రూ. 10, 948 కోట్ల స్థూల బాక్సాఫీసుని అధిగమించిన తొలి సంవత్సరంగా గుర్తింపు పొందుతోంది. అయితే ఈ పెరుగుదల టికెట్ ధరల పెరుగుదల కారణంగానే చోటుచేసుకుంది. అంటే ప్రేక్షకులు 2019 కంటే 2023 లో తమ జేబుల నుంచి చూసిన అదే సంఖ్యలో సినిమాల కోసం, ఒక వెయ్యీ 278 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టాల్సి వచ్చిందన్న మాట.

2023 సంవత్సరంలో 943 మిలియన్ల (9 కోట్ల 43లక్షలు) మంది ప్రేక్షకుల అడుగులు (ఫుట్ ఫాల్స్) థియేటర్లలో పడ్డాయి. ఇది 2022 కంటే వృద్ధే, కానీ 2019లో 1,030 మిలియన్ల (10కోట్ల 30 లక్షలు) మహమ్మారి మునుపు స్థాయి కంటే చాలా తక్కువ. ఇంకా, 1,000 కంటే ఎక్కువ సినిమాలు విడుదలైనప్పటికీ, టాప్ 10 సినిమాలు మాత్రమే సంవత్సరం మొత్తం బాక్సాఫీసులో 40% వాటాని అందించాయి. 2023 లో 2022 కంటే సగటు టిక్కెట్ ధర 9% పెరిగింది. ఇది మహమ్మారి ముందు (2019) స్థాయి కంటే 22% ఎక్కువ.

మనుగడ పోరాటం వీటికే!

ఇక తెలుగు, తమిళం, కన్నడ సినిమాల ప్రేక్షకుల సంఖ్య విషయానికొస్తే- 2023 లో తెలుగు సినిమాల ప్రేక్షకుల సంఖ్య 6 శాతం తగ్గింది. తమిళం 3 శాతం, కన్నడ 9 శాతం తగ్గాయి. మలయాళ సినిమా ప్రేక్షకుల సంఖ్య మాత్రం అమాంతం 19 శాతం పెరిగింది. మరాఠీ సినిమా ప్రేక్షకుల సంఖ్య 2022 కంటే 2023లో 44 శాతం పెరిగి 10.1 కోట్లకు చేరుకుంది. అయితే పంజాబీ సినిమాలు చూసే ప్రేక్షకుల శాతం 27 కి పెరిగి 4.3 కోట్లకు చేరుకుంది. బెంగాలీ, గుజరాతీ సినిమా-ప్రేక్షకుల సంఖ్య కూడా 2022 కంటే 2023లో 19 శాతం, 48 శాతంగా పెరిగాయి.

ఈ గణాంకాలు నిర్మాతలు, దర్శకులు తమ ప్రణాళికల్ని పునర్ రచించుకోవడానికి సహాయపడతాయి. థియేటర్ స్పేస్ లో స్టార్ సినిమాలకి తప్ప చిన్న స్థాయి సినిమాలకి ప్రేక్షకుల ఆదరణ లేదనేది స్పష్టమవుతోంది. ప్రేక్షకుల సంఖ్య పెరిగింది కాబట్టి చిన్న స్థాయి సినిమాల్ని ఎలా చుట్టేసినా ఆడేస్తాయనుకోవడం వొఠ్ఠి భ్రమ. ఆ పైన ఓటీటీల నుంచి దండిగా ఆదాయం వుంటుందని నమ్మడం కూడా ఉత్త అమాయకత్వం. ఈ అమాయకత్వాలతో వుంటున్న కొత్త నిర్మాతల్నే రంగంలోకి దింపుతున్నారు దర్శకులు. ఆ ఒక్క సినిమాతో తామిద్దరూ చేతులు దులుపుకుని వెళ్ళిపోతున్నారు.

చిన్న స్థాయి సినిమాల పరిశ్రమ మలయాళ సినిమా ప్రేక్షకుల సంఖ్య 19 శాతం పెరగడం, మరో 20 లక్షల ప్రేక్షకులు అదనంగా వచ్చి కలవడం ఎందుకు జరిగిందో ఆలోచించుకోవాలి. ఆ కారణాల్ని కేరళ వెళ్ళి తిరిగి గమనించాలి. ఐదు కిలోమీటర్ల పరిధిలో ఫిలిం నగర్లో కూర్చుని అదే లోకమనుకుంటూ సినిమాల్ని చుట్టి పారేస్తే, అదే వేగంతో వెనక్కి తన్నే నవలోకం ప్రేక్షకుల బ్యాచి పొంచి వుంది!

Tags:    
Advertisement

Similar News