Allu Arjun | బన్నీ కెరీర్ లో 'ఆర్య'
Allu Arjun - ఆర్య సినిమా 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమా తన కెరీర్ ను పట్టాలెక్కించిందని అంటున్నాడు బన్నీ.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘ఆర్య’. సుకుమార్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 2004 మే 7న ఈ మూవీ రిలీజైంది. ఈ బ్లాక్ బస్టర్ సినిమా విడుదలై 20 ఏళ్లు అయ్యింది.
ఈ స్పెషల్ మూమెంట్స్‌ను చిత్ర యూనిట్ ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. ఈ కార్యక్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్, నిర్మాత దిల్ రాజు, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, శివ బాలాజీ, సుబ్బరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బన్నీ మాట్లాడాడు.
"గంగోత్రి సినిమా హిట్ అయ్యింది.. కానీ నాకు పర్సనల్ గా గుర్తింపు రాలేదు. నా మార్క్ నేను క్రియేట్ చేయలేకపోయాను. ఏడాది పాటు ఖాళీగా కూర్చున్నాను. రోజుకు మూడు కథలు వినేవాడిని. సినిమాలు చూస్తుండేవాడిని. ఎలాగైనా సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయాను. కథ వింటున్నాను కానీ, మ్యాజిక్ ఎక్కడా తగలటం లేదు. అప్పుడు హీరో తరుణ్ నాకు మంచి ఫ్రెండ్. తను నాకు ఫోన్ చేసి ఇలా రాజుగారు నాకోసం దిల్ సినిమా వేస్తున్నారు. నేను చూడటానికి వెళుతున్నాను. నువ్వు కూడా వస్తావా అన్నారు. నేను ఆల్ రెడీ సినిమాను రెండు సార్లు చూశాను. నాకు సినిమా నచ్చింది. అయినా వస్తానని ప్రసాద్ ల్యాబ్ కి వెళ్లాను. అక్కడ సుకుమార్ గారు నన్ను కలిశారు. కథ చెబుతానన్నారు..చెప్పారు. నాకు మైండ్ బ్లోయింగ్ గా కథ నచ్చింది. ఇడియట్ సినిమాలాంటి సినిమా చేయాలని కోరిక ఉండేది. సుకుమార్ గారు నాకు ఆర్య కథ చెబుతుంటే.. ఇదే నా ఇడియట్ సినిమా అనిపించింది."
తన కెరీర్ ను పట్టాలెక్కించిన సినిమాగా ఆర్యను అభివర్ణించాడు బన్నీ. మళ్లీ 20 ఏళ్ల తర్వాత తనను పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టిన ఘనత కూడా సుకుమార్ కే దక్కుతుందని, పుష్ప-2తో మరోసారి మేజిక్ చేస్తామని చెబుతున్నాడు.